పిఠాపురం నియోజకవర్గంలో కూటమి రాజకీయాలు ఇప్పుడు పాత వైరం – కొత్త పార్టీ’ అనే చందంగా మారి ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ తరపున చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఇప్పుడు అనూహ్యంగా జనసేనలో చేరి అనధికార ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుండటం స్థానిక టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసహనానికి కారణమవుతోంది.
గత రెండు దశాబ్దాలుగా పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మ, పెండెం దొరబాబులు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. 2024 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ విజయం కోసం వర్మ తన సీటును త్యాగం చేసి కష్టపడితే, దొరబాబు మాత్రం వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపు కోసం పనిచేశారు. అయితే, ఎన్నికల తర్వాత దొరబాబు జనసేనలోకి రావడం, పవన్ కల్యాణ్ ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో సమీకరణాలు మారిపోయాయి. తనను ఓడించడానికి ప్రయత్నించిన వ్యక్తికే పవన్ ప్రాధాన్యత ఇవ్వడంపై వర్మ వర్గం గుర్రుగా ఉంది.
పీఏడీఏ కార్యాలయంలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమని, సీఎం ఫోటో లేకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘన అని ఆయన అధికారులను నిలదీశారు. అయితే, అక్కడే ఉన్న దొరబాబు జోక్యం చేసుకుని, ఇది పవన్ కల్యాణ్ నియోజకవర్గం, ఇక్కడ అనవసర రచ్చ చేయొద్దు అంటూ వర్మపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య బాహాబాహి చోటుచేసుకోవడం, కార్యకర్తలు తోసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పెండెం దొరబాబు ఉద్దేశపూర్వకంగానే టీడీపీ-జనసేన మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వర్మ ఆరోపిస్తున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు చేసిన రూ.150 కోట్ల ఆర్థిక అవకతవకల నుంచి తప్పించుకోవడానికే ఆయన జనసేన కండువా కప్పుకున్నారని, ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు చెప్పుకుని అధికారాన్ని చెలాయిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో పవన్ ఇమేజ్ను దెబ్బతీసేలా, కూటమి నేతల మధ్య గొడవలు పెట్టేలా దొరబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వైసీపీ నుంచి వచ్చి జనసేనలో చేరిన నేతలు కూటమిలో అసలైన కోవర్టులలా పనిచేస్తున్నారన్న ప్రచారం క్షేత్రస్థాయిలో జోరందుకుంది. ఈ గొడవలు ఇలాగే కొనసాగితే అది అంతిమంగా వైసీపీకే లాభిస్తుందని కూటమి పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


