అమరావతి తరలింపు ఒక రాజకీయ వికృత క్రీడ – ఎన్నారై బహిరంగ లేఖ !

వ్యక్తులను గుంపులుగా, సమూహాలుగా, ఆ సమూహాలను శ్రేణులుగా, ఒక సైన్యంలా తీర్చి దిద్ది లక్ష్యం వేపు నడిపించే మహా నాయకులు కాలంలో వేగంగా కనుమరుగవుతున్న సమయం ఇది!

అందుకే ఒక అంశాన్ని ఆవేశ కావేశాలకు అతీతంగా పరిశీలించటం, సార్వజననీయమైన పరిష్కార మార్గాలు వెతకటం, విధాన నిర్ణయాలు తీసుకోవటం అనేది ఒక కలలా మిగిలిపోతున్నది!

గత నెలరోజులుగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ని అధికార వికేంద్రీకరణ పేరుతో అమరావతి నుండి విశాఖపట్టణం కి మార్చటం అనే ఆలోచన, దానిమీద ప్రభుత్వం G.N.Rao కమిటీ రిపోర్ట్, ఆ తరువాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రిపోర్ట్ తీసుకోవటం, ఆ తరువాత మంత్రివర్గ సభ్యులతో కూడిన ఒక హై పవర్ కమిటీ వేయటం ఇవన్నీ ఆ ప్రాంతంలో ఒక రకమైన అనిశ్చితని, గందరగోళ పరిస్థితులని సృష్టించాయి, రాజధాని ప్రాంత రైతుల్లో వారి భవిష్యత్ పైన ఒక భయాన్ని, ఆందోళనకి దారితీసాయి. CRDA కి భూములు ఇచ్చిన రైతులకి అసలు ఏమి జరుగుతున్నది, వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అవి ఎలా నెరవేరుస్తారు అన్న విషయంలో స్పష్టత లేకపోవటం తో ఆందోళనతో రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి.

ఈ GN రావు కమిటీ లో వున్న సభ్యులు శ్రీ మహావీర్, శ్రీమతి అంజలి మోహన్, శ్రీ రవీంద్రన్, శ్రీ అరుణాచలం. వీరిలో GN రావు గారు తప్ప మిగతావారు అంత వేరే రాష్ట్రాలకి చెందిన వారు. వారు ఇక్కడ ఎన్ని రోజులు పర్యటించారు? ఏ ప్రాంతం ప్రజల అభిప్రాయాలు సేకరించారు? ఈ GN రావు కమిటీ ని నియమించి, వారు తమ రిపోర్ట్ ఇవ్వకుండానే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కి మళ్ళీ అదే పని అప్పచెప్పవలసిన అవసరం ఏమొచ్చింది?

ఈ రెండు కమిటీస్ కి మార్గదర్శక సూత్రాలు ఏమిటి? వారిద్దరూ తమ రిపోర్ట్ చెప్పకుండానే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు శాసన సభలో ఎలా ఊహించగలిగారు? రాబోయే రిపోర్ట్స్ లో వున్న విషయాలనే యధాతధంగా ఎలా చెప్పగలిగారు? ఇవన్నీ ప్రజల మనస్సులో వున్నా సందేహాలు, ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయవలసిన అవసరం వుంది.

అమరావతి నుండి రాజధాని తరలించటం లేదు, అక్కడ శీతాకాల సమావేశాలు జరుగుతాయి అంటున్న కూడా పాలకుల మనసులో ఏముందో అందరికీ అర్ధం అవుతూ వస్తున్నది. ఈలోగా కొంత మంది ప్రభుత్వ పెద్దలు అమరావతి ముంపు ప్రాంతం అనీ, అక్కడ రాజధాని ని నిర్మించాలి అంటే చాలా ఖర్చు అవుతుంది అనీ అందువల్ల విశాఖపట్నం అయితే బాగుంటుంది అనే వాదన ని తెరపైకి తీసుకొనివచ్చారు.

కొంత మంది రాష్ట్రం లో వున్న జిల్లాల ఆదాయం అంతా అమరావతిలోని పెట్టాలా అనే ఇంకొక వాదన తెస్తున్నారు. అయితే భౌగోళికంగా అందరికీ అందుబాటలో, నీటికి కొరత లేని కృష్ణ నది తీరప్రాంతం, రైలు , రోడ్ మార్గం ద్వారా రాష్ట్రం లో అన్నిప్రాంతాలకు వున్నా కనెక్టివిటీ, ఒక్క చోటే అందుబాటలో వున్న 50,000 ఎకరా భూమి, ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో సంవత్సరాలుగా ఆదాయవనరుల్లో, PER CAPITA INCOME లో మొదటి మూడుఅగ్రస్థానాల్లో ఉంటూ వస్తున్న కృష్ణ, గుంటూరు జిల్లాలు ఎందుకు రాజధాని అనర్హం అనే ప్రశ్న ఈ రెండు జిల్లాలకు చెందిన అధికార శాసన సభ్యులు 29 మంది లో ఒక్కరినుండి కూడా వినపడటం లేదు.

అన్యాయానికి గురి అయ్యామనే బాధతో నెల రోజులుగా నినదిస్తున్న అమరావతి ప్రాంతపు రైతు సమాజపు ఉనికిని గుర్తించే పరిస్థితి లో పాలకులు లేరు. ఉపశమనం కలిగించేలా వారితో మాట్లాడకుండా అధికార పార్టీ నాయకులహేళన, తిరస్కారంతో కూడిన మాటలు, ప్రజాస్వామ్యయుత నిరసన ని తొక్కి వేసే దిశగా నిర్బంధం, 144 సెక్షన్ అమలు లాంటి చర్యలు చూస్తుంటే విస్మయం కలుగుతున్నది.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నది, వేలాది మంది రైతులకి ప్రభుత్వం ఇచ్చిన మాటని తప్పి వారిని నిరాశ, నిస్పృహ గురిచేయడం, వారి భవిష్యత్ ని అంధకారం లోకి నెట్టడం! తరతరాలుగా వస్తున్న వారసత్వ ఆస్తి, వారికి జీవనోపాధి, కన్నతల్లి లాంటి భూమిని ప్రభుత్వం మాటలు విని రాజధాని నిర్మాణం కొరకు భూములిచ్చిన రైతు సమాజానికి తీరని అన్యాయం జరుగుతున్నది సత్యం!

ఏది ఏమైనా రాజకీయ నాయకులు రాజకీయ నిర్ణయాలు ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాలకే తీసుకుంటారు అన్నది చారిత్రక వాస్తవం!

వైస్సార్సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం వెనుక ఉత్తరాంధ్ర అభివృద్ధి ఆశయం అని చెపుతున్నా తార్కికంగా ఆలోచిస్తే దీని వెనుక వేరే అవసరాలు వున్న అవకాశం కనపడుతూ వుంది
అందులో మొదటిది గత ఎన్నికలలో వైస్సార్సీపీ, టిడిపి కి జిల్లాలవారీగా వచ్చిన ఫలితాలు చూస్తే అర్ధం అవుతుంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు జిల్లాలో వున్న 62 శాసనసభ స్థానాల్లో వైస్సార్సీపీ పార్టీ కి 59, టిడిపి కి కేవలం 3 (కుప్పం, ఉరవకొండ, హిందూపురం ) మాత్రమే వచ్చాయి.

ఉత్తరాంధ్ర లో వున్న 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వున్న 34 నియోజకవర్గాల్లో వైస్సార్సీపీ పార్టీ కి 28, టిడిపి కి కేవలం 6 మాత్రమే వచ్చాయి.

కుల సమీకరణాలు, గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలని పరిశీలిస్తే కృష్ణ, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం వైస్సార్సీపీ కి ఎక్కువ స్థానాలు వచ్చినా ఇదే పరిస్థితి రాబోయే కాలం లో ఉంటుంది అనే భరోసా లేదు.

ఈ సమయంలో మొదటినుండి టిడిపి కి కంచుకోటగా భావించే ఉత్తరాంధ్ర లో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెట్టటం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో టిడిపి పార్టీ ని శాశ్వతంగా బలహీనపరచటానికి, వైస్సార్సీపీ కి బలమైన రాజకీయ పునాదికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. తన ప్రాంతంలో కాకుండా ఉత్తరాంధ్ర లో ఎగ్జిక్యూటివ్ రాజధాని ని పెట్టారు అనేది వైస్సార్సీపీ ని ఉత్తరాంద్ర తరుపున పోరాటం చేసే ఛాంపియన్ గా చూపిస్తూ, దీర్ఘకాలికంగా రాజకీయ ప్రయోజనం చేకూర్చిపెట్టే ఎత్తుగడగా భావించవచ్చు.

రాయలసీమ, నెల్లూరు, ఉత్తరాంధ్రలో వున్న 8 జిల్లాల్లో ఎప్పటికీ వైస్సార్సీపీ ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే ప్రయత్నం, తద్వారా చిరకాలం అధికారం లో కొనసాగగలం అనే ఎత్తుగడ ఈ ఎగ్జిక్యూటివ్ రాజధాని నిర్ణయం వెనుక కనపడుతూ వుంది.

గత సంవత్సరం జులై లో, శ్రీకాకుళం జిల్లా పల్లివీధి గ్రామంలో మంచినీటికి గురించి జరిగిన ఘర్షణలో తాటిపూడి పద్మ అనే మహిళ చనిపోయిన విషాద సంఘటనని చూస్తే . తాగునీటి ఎద్దడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎంత తీవ్రంగా ఉందొ గ్రహించవచ్చు. అలాగే గత సంవత్సరం విశాఖకి త్రాగునీరు అందించే రైవాడ, మేఘాద్రిగడ్డ రిజర్వాయర్లు ఎండిపోతే జీవీఎంసీ వారు విశాఖ పట్టణ ప్రజలకి త్రాగునీరు అందించటానికి ఎంత ఇబ్బంది పడ్డారో ఆ ప్రాంత ప్రజలందరికీ విదితమే.

పోలవరం ఎడుమ కాలువ ఉద్దేశ్యం ఉత్తరాంధ్ర కి, ముఖ్యంగా విశాఖపట్నం తాగునీటి, పరిశ్రమలకి నీరు అందించే ఏలేరు రిజర్వాయరు కి 25 టి.ఎం.సి. అందించటం,ఒక పక్క ఆ పోలవరం ప్రాజెక్ట్ ని ఆపివేసి ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి గురుంచి మాట్లాడటం పాలకులకి ఆ ప్రాంత సమస్యల పరిష్కారం మీద వున్న చిత్తశుద్ధిని ప్రశ్నర్థకం చేస్తున్నది. రాజధాని పేరుతో ఆడే రాజకీయ క్రీడలు కాకుండా పాలకులు వంశధార, నాగావళి నదుల అనుసంధానం, అభివృదికి ఆమడ దూరం లో వుంటూ ఇంకా పోడు వ్యవసాయం చేస్తున్న శ్రీకాకుళం జిల్లా గిరిజన సమస్యలు, నెల్లిమర జ్యూట్ మిల్ ని తెరిపించటం వీటి మీద దృష్టి సారించాలి, పరిష్కరించాలి.

అంతే కానీ రాజకీయ ఎత్తుగడలు, రైతు ప్రయోజనాలను, వారి భవిష్యత్ ని పణంగా పెట్టి ఆడే ఈ వికృత క్రీడ లో ప్రాంతాల మధ్యన విద్వేషాలు, జిల్లాల వారీగా ప్రజల్ని విడగొట్టాలి అనే ప్రయత్నం 1905 లో లార్డ్ కర్జన్ ద్వారా బెంగాల్ సమాజాన్ని పరిపాలన సౌలభ్యం పేరుతో తూర్పు, పశ్చిమ బెంగాల్ గా విడగొట్టటానికి ఆనాటి బ్రిటీష్ సామ్రాజ్యపు సామ్రాజ్యవాద పోకడలు గుర్తుకు తెస్తున్నాయి.

ఆ రోజు ఆ కుటిల యత్నం ని వ్యతిరేకించి, తిప్పి కొట్టిన బెంగాలీ సమాజపు ఐక్యత, ఈ రోజు తెలుగు ప్రజల్లో రావాలి. అంతే కానీ ఇది కేవలం ఒక ప్రాంతపు సమస్య అని, సమస్యని సమస్యగా అంగీకరించక పోతే రేపు మరిన్ని సమస్యలతో ఉధృతమై చుట్టుముట్టినప్పుడు సమాజంలో మిగిలేది సందిగ్థత, శున్యం , అవినీతి మాత్రమే !

ఇప్పటికి మౌనం గా వున్నముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి ! సమాజాన్ని విడకొడటానికి చూసి చరిత్ర లో అప్రతిష్ట పాలయిన లార్డ్ కర్జన్ ఒక పక్క, ఈ దేశానికి చెందకపోయినా ఇక్కడి ప్రజల కొరకు ధవళేశ్వరం ఆనకట్ట, ప్రకాశం బ్యారేజ్, కడప కర్నూల్ కెనాల్ కట్టి ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయిన సర్ ఆర్థర్ కాటన్ దొరా మన ముందున్నారు.

1930 లో మహాకవి శ్రీ శ్రీ వేదనతో ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం? నరజాతి చరిత్ర సమస్తం పరస్పరాహారాణోద్యోగం! నరజాతి చరిత్ర సమస్తం రణ రక్త ప్రవాహసిక్తం !’

అన్నమాటల్ని నిజం చేస్తూ చరిత్ర లో అగాధపు నీడల్లోకి జారిపోతారా? లేక సరి అయినా నిర్ణయం తీసుకొని రేపటి వెలుగుల్లో శాశ్వతంగా నిలిచిపోతారా?

అధికారం శాశ్వతం కాదు, ప్రజల గుండెల్లో స్థానం శాశ్వతం! ఆలోచించండి!

రాయలసీమ, ఉత్తరాంధ్ర సోదరులకు ఒక మాట!
ఈ వ్యాసం, ఒక నిజం పక్కన నిర్భయంగా నిలబడే ప్రయత్నం మాత్రమే!.
మీ ఊళ్ళల్లో నా ఇల్లు వెతుక్కుంటున్నా! మీ కష్టాల్లో నా కన్నీటిని చూస్తున్నా! మీ వ్యధల్లో నా బాధని అనుభవిస్తున్నా!
మీ ప్రాంతానికి వ్యతిరేకం కాదు

సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ

అభినందనలతో
బసవేంద్ర సూరపనేని
డిట్రాయిట్
USA
basavendras@yahoo.com

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సచివాలయ కూల్చివేతలో గుప్తనిధుల కోణం..!

సచివాలయాన్ని గుప్త నిధుల కోసమే కూలగొడుతున్నారన్న వాదనను.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకు వచ్చారు. కేసీఆర్ కనిపించకుండా పోవడం.. ఆర్థరాత్రిళ్లు తవ్వకాలు జరపడం వంటి అంశాలపై తాము పరిశీలన జరిపితే......

వెబ్ సిరీస్‌లు మ‌నకెక్కుతాయా?

ఇప్పుడు ఎవ‌రు చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుతున్నారు. స్టార్లంతా అటువైపే చూస్తున్నారు. సినిమాకి మ‌రో గ‌ట్టి ప్ర‌త్యామ్నాయం వ‌చ్చింద‌ని బ‌లంగా న‌మ్ముతున్నారు. నిర్మాణ సంస్థ‌లు అటువైపే, హీరోల చూపూ అటుకేసే....

రద్దయ్యే మండలిలో ఎవరికి పదవులు ఇస్తే ఏంటి..!?

వైసీపీలో శాసనమండలి పదవుల చర్చ నడుస్తోంది. మొత్తం నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయినప్పటికీ.. ఒక స్థానం సమయం కేవలం 9 నెలలు మాత్రమే ఉండటంతో..ఎన్నిక జరగదు. మరో మూడు స్థానాల్లో రెండు...

న్యూ ఐడియా: ట్రైల‌ర్‌కీ టికెట్టు

ఎడారిలో ఇసుక అమ్మే తెలివితేట‌లు అచ్చంగా రామ్ గోపాల్ వ‌ర్మ సొంతం. ఓ సీ గ్రేడ్ షార్ట్ ఫిల్మ్ తీసి, దానికి వంద‌, రెండొంద‌లు టికెట్టు పెట్టి, ప్రేక్ష‌కుల నుంచి ఎంతో కొంత...

HOT NEWS

[X] Close
[X] Close