ఎన్టీఆర్, పరిటాల జపం….రాజకీయ లాభం కోసమేనా?

చనిపోయే చివరి క్షణం వరకూ కూడా చంద్రబాబును అమితంగా ద్వేషించాడు ఎన్టీఆర్. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలోనూ, యూట్యూబ్‌లోనూ హల్చల్ చేస్తున్న ఆనాటి ఎన్టీఆర్ ఇంటర్యూ వీడియోలను చూస్తే ఆ విషయం ఎవ్వరికైనా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్‌ ఇమేజ్‌ని తన సొంతం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి, కొడుకు హరికృష్ణలు ఎన్టీఆర్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకు సాధ్యం కాలేదు. భజన మీడియా బ్రహ్మాండమైన ప్రచారంతో ఎన్టీఆర్ ఇమేజ్ బాబు సొంతమయ్యింది. అయితే ఇఫ్పటికీ కూడా చంద్రబాబు ఎన్టీఆర్ ఇమేజ్‌ని కేవలం రాజకీయ లాభం కోసమే ఉపయోగించుకుంటూ ఉండడం మాత్రం కొంతమంది ఎన్టీఆర్ అభిమానులను బాధిస్తోంది. కేంద్రంలో కూడా చక్రం తిప్పానని పదే పదే చెప్పుకుంటూ ఉండే చంద్రబాబు ….ఎన్టీఆర్‌కి భారతరత్న తీసుకురావడంలో మాత్రం విఫలమవుతున్నాడు. పద్మ అవార్డుల విషయంలో రామోజీరావుకు కూడా న్యాయం చేసిన చంద్రబాబు….ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఉద్ధేశ్యపూర్వకంగానే అలసత్వం ప్రదర్శిస్తున్నాడన్న విమర్శలున్నాయి. ఇఫ్పుడు మహానాడు వేదికగా ఎన్టీఆర్‌కి భారతరత్న ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం అని మరోసారి చెప్పుకొచ్చాడు చంద్రబాబు. ఎన్నికలకు కేవలం రెండేళ్ళ వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సారి అయినా చంద్రబాబు తన మాటల నిలబెట్టుకుంటాడేమో చూడాలి.

ఇక తెలుగుదేశం వాళ్ళు రాజకీయ లాభం కోసం జపిస్తున్న మరోపేరు పరిటాల రవి. వైకాపా నేత నారాయణరెడ్డి హత్యకు గురైన తర్వాత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు జగన్. ఆ విమర్శలకు కౌంటర్ ఇవ్వడం కోసం పరిటాల సునీతను ముందుకు తెచ్చారు. షరామామూలుగానే పరిటాల సునీత జగన్‌ని తిట్టిపోసింది. పరిటాల రవిని చంపిన ఫ్యాక్షనిస్ట్ జగన్‌కి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పుకొచ్చింది. 2014 ముందు వరకూ పరిటాల హత్య టాపిక్ ఎప్పుడు చర్చకు వచ్చినా కూడా జగన్‌తో పాటు జేసీ దివాకర్‌రెడ్డి పేరును కూడా తప్పకుండా ప్రస్తావించేది సునీత. జేసీలు టిడిపిలో చేరిన తర్వాత నుంచీ పరిటాల రవిని హత్య చేసిన వాళ్ళ లిస్టులో నుంచి జేసీలను తీసేసినట్టుగా ఉన్నారు. టిడిపిలో చేరినంతనే పరిటాల రవి హత్యతో జేసీకి సంబంధం లేకుండా పోయిందంటే ఇక సునీత ఆరోపణల్లో పస ఎంత అంటే ఏం చెప్పాలి? రాజకీయలాభం కోసం పరిటాల రవి హత్యను పదే పదే ప్రస్తావనకు తీసుకొస్తున్నారన్న వాదనలకు సునీత మాటలు బలం చేకూర్చడం లేదా? పరిటాల రవి హత్య జరిగిన వెంటనే జేసీ, జగన్‌లు కలిసే పరిటాలను హత్య చేయించారు అని చంద్రబాబు, సునీతలతో సహా టిడిపి నేతలు అందరూ ఆరోపించారు. ఇప్పుడు టిడిపిలో చేరగానే జేసీకి క్లీన్ చిట్ ఇచ్చేశారా? రేపు జగన్ కూడా టిడిపిలో చేరితే జగన్‌కి కూడా క్లీన్ చిట్ ఇచ్చేస్తారా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]