తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న నందమూరి తారక రామారావు పోలికలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఆ ఎన్టీఆర్ చేసినటువంటి చారిత్రక, పౌరాణిక సినిమాలు ఎప్పుడొస్తాయి? బాలల రామాయణంలోనే చారిత్రక పురుషుడు ఎన్టీఆర్‌కి ఎంతో ఇష్టమైన రాముడి క్యారెక్టర్ని పోషించి మెప్పించిన తారక్..ఆ తర్వాత యమదొంగ సినిమాలో యంగ్ యముడిగా కూడా తన స్థాయి ఏంటో చూపించాడు. కానీ ఆ తర్వాత నుంచీ మాత్రం అలాంటి అవకాశాలన్నింటినీ పక్కన పెట్టేస్తున్నాడు ఎన్టీఆర్. కానీ చారిత్రక, పౌరాణిక పాత్రలతో సినిమా చేసే ప్రయత్నాల్లో ఏ డైరెక్టర్ ఉన్నా కూడా మీడియా, ప్రేక్షకుల కళ్ళన్నీ ఎన్టీఆర్ వైపే వెళుతున్నాయి.
రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో ఎన్టీఆర్ యాక్ట్ చేస్తాడన్న వార్తలు చాలా గట్టిగానే వినిపించాయి. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ గోల్డెన్ ఛాన్స్‌ని మిస్ చేసుకున్నాడు. ఆ క్యారెక్టర్ని అద్భుతంగా ప్లే చేసిన బన్నీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచీ ప్రశంశలు పొందాడు. ఇక ఇప్పుడు మరోసారి అదే గుణశేఖర్ హిరణ్యకశిపుడు అంటూ ఓ కొత్త సినిమాకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సారి కూడా ఎన్టీఆర్‌ని కలిసే ప్రయత్నాల్లో ఉన్నాడు గుణ. అలాగే సావిత్రి జీవిత కథతో సినిమా ప్లాన్ చేస్తున్న నాగ్ అశ్విన్ కూడా ఎన్టీఆర్‌తో చర్చలు జరుపుతున్నాడు. తాత ఎన్టీఆర్ క్యారెక్టర్ని మనవడు ఎన్టీఆర్ చేత చేయించాలన్న ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు. హిరణ్యకశిపుడు సినిమాతో పాటు, చారిత్రకపురుషుడు ఎన్టీఆర్ పాత్ర కూడా ఏ నటుడికైనా చాలా అరుదుగా వచ్చే అవకాశమే. మరీ ముఖ్యంగా ఆ ఎన్టీఆర్ క్యారెక్టర్లో నటించే అవకాశం అంటే తారక్‌కి లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. నందమూరి అభిమానులతో పాటు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఆ ఎన్టీఆర్ క్యారెక్టర్లో తారక్ నటిస్తే చూడాలని ఆశిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్స్ కూడా ఎన్టీఆర్ సన్నిహితులకు అదే విషయాన్ని చెప్తున్నారు. ఈ జెనరేషన్ తెలుగు హీరోలందరిలోనూ చారిత్రక, పౌరాణిక పాత్రల్లో నటించే సత్తా ఉన్న ఏకైక నటుడు ఎన్టీఆర్. మరి ఆ స్ట్రెంగ్త్‌ని ఎన్టీఆర్ గుర్తిస్తాడా? ఈ సారైనా ఛాన్స్ కొట్టేస్తాడా?