వరి అన్నం తినడం అనేది ఓ లగ్జరీ అయిన రోజుల్లో ప్రజలందరూ సమానంగా అన్నం తినాలని రెండు రూపాయలకే కిలోబియ్యం పథకాన్ని తెచ్చారు ఎన్టీఆర్. 1983 ప్రాంతంలో చాలా మందికి జొన్నలే ఆహారం. తక్కువ ధరకు వచ్చేవి. బియ్యం కొనడం చాలా ఖరీదు. అందుకే ఎన్టీఆర్ రెండు రూపాయలకే కేజీ బియ్యాన్ని తెచ్చి నిరుపేదలు కూడా అన్నం తినేలా చేశారు. ఆకలి విలువ తెలిసిన అటువంటి నేత చరిత్రలో నిలిచిపోతారని అప్పుడే నిర్ణయం అయిపోయింది. ఆ రెండు రూపాయల కేజీ బియ్యం పథకం ఇప్పటికీ కొనసాగుతోందంటే.. ఆయన ముద్ర ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది మచ్చుకు ఒక్కటి మాత్రమే.
తెలుగుకు ఎక్కడైనా ఓ రూపం ఇవ్వాల్సి వస్తే ముందుగా కనిపించేది ఎన్టీఆర్. తెలుగుజాతి గురించి చెప్పుకోవాలంటే ఎన్టీఆర్తో ప్రారంభించుకోవాలి. అంతగా తనదైన ముద్ర వేశారు. ఎవరైనా ఓ రంగంలో ఉన్నత స్థానానికి వెళ్తారు. ఆ రంగంలో దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసిన తర్వాత మరో రంగంలోకి ప్రవేశించి అక్కడా అదే స్థాయిలో రాణించడం మామూలు విషయం కాదు. అటు సినీ రంగంలో దిగ్గజంగా ఎదిగి.. వెంటనే రాజకీయ రంగంలోనూ అదే స్థాయిలో సంచలనాలు నమోదు చేశారు. ప్రజల జీవితాల్లో ఊహించని మార్పులు చేశారు.
నేటి తరానికి ఎన్టీఆర్ పాఠాలుగా తెలుసు. కానీ ఆయన పాలనా సంస్కరణల వల్ల, ఇచ్చిన అవకాశాల వల్ల బాగుపడిన కుటుంబాలు ప్రతి గ్రామంలోనూ ఉంటాయి. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకత్వాలను పెంచారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వారు ఇప్పటికీ అగ్రనేతలుగా ఉన్నారు. వారితో తెలంగాణ బహుజన సమాజం రాజకీయంగా బలపడింది. ఎన్టీఆర్ సినిమా రంగ విజయాలు, రాజకీయ విజయాలు ఎప్పటికప్పుడు నిత్యనూతనంగానే ఉంటాయి.
క్షుద్ర రాజకీయాల యుగంలో, సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్టీఆర్ పై తప్పుడు ప్రచారాలు చేసే వారూ ఉంటారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కుల ముద్ర పడకుండా ఉండదు. కొంత మంది వ్యతిరేకించడం సాధారణం. ఆ రాజకీయ వ్యతిరేకతల వల్ల ఆయన ఘనతను తగ్గించే ప్రయత్నం చేస్తూంటారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ ఆకాశంలో రాళ్లేసినట్లే. ఎందుకంటే ఎన్టీఆర్ తెలుగు జాతి చరిత్రలో ఓ శిఖరంగా నిలబడ్డారు. ఆయనను అందుకునే .. రాళ్లేసేంత స్థాయికి ఇంకా ఎవరూ రాలేదు. భవిష్యత్లో రాలేరు. ఎందుకంటే ఆయన తెలుగుజాతి నిలువెత్తు సంతకం – మరో వందేళ్లయినా తగ్గదు వైభవం !
జోహార్ ఎన్టీఆర్