తెలుగు సినిమా వాళ్ళందరూ కూడా కథలకోసం ప్రపంచ భాషల సినిమాలన్నింటి వెంటా పడుతూ ఉంటారు కానీ కొంచెం ఆలోచిస్తే సినిమా ఇండస్ట్రీలోనూ, ఇండస్ట్రీ చుట్టూనే బోలెడన్ని కథలు దొరుకుతాయని అనిపిస్తోంది. ఆ కథలకు సీక్వెల్ స్టోరీస్ కూడా నడుస్తూ ఉంటాయి. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే జీడిపాకం సీరియల్స్ కథల్లాగా ఈ కథలను కూడా సాగదీస్తూ సాగిపోవచ్చు. కాకపోతే స్టార్ హీరోల వీరాభిమానుల పైత్యాన్ని కాస్త శ్రద్ధగా స్టడీ చేయాలంతే. పవన్, మహేష్, ఎన్టీఆర్‌లను టాప్ త్రీ స్థాయి హీరోలుగా సినిమా వాళ్ళు పరిగణిస్తూ ఉంటారు. అలా చూస్తే ఎవరికి ఎవరు పోటీ? ఎవరు నంబర్ ఒన్? అనే ప్రశ్నలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి, పవన్, మహేష్‌ల ఫ్యాన్స్‌కి మధ్య మావాడు సూపర్ అంటే….మావాడు బంపర్ అన్న చర్చలు, వాదోపవాదాలు నడవాలి. కానీ ఎక్కడ మొదలైందో? ఎవరు మొదలెట్టారో తెలియదు కానీ ఇప్పుడు వివాదాలన్నీ కూడా బన్నీ వర్సెస్ ఎన్టీఆర్ అభిమానుల మధ్యే నడుస్తూ ఉన్నాయి. బాద్షా, ఇద్దరమ్మాయిలతో సినిమాల షూటింగ్ ఒకే కంట్రీలో జరుగుతూ ఉన్నప్పడు బన్నీ, ఎన్టీఆర్ ఎంత క్లోజ్‌గా ఉన్నారు అనే విషయాన్ని ఇప్పటికీ నెట్లో ఉన్న ఫొటోస్ తెలియచేస్తూ ఉంటాయి. కానీ ఎన్టీఆర్-బన్నీ అభిమానులకు మాత్రం అవేవీ కనిపించడం లేదు.
గొడవలకు, వాదోపవాదాలకు ఏ విషయం పనికొస్తుందా అని సెర్చ్ చేసి మరీ గొడవలు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా గూగుల్ సెర్చ్‌లో ఎవరు టాపర్ అని చెప్పి అనవసరమైన కొత్త వాగ్యుద్ధాలకు తెరతీసి సోషల్ మీడియాను మోతెక్కిస్తున్నారు. లింగుస్వామి సినిమా విషయంలోనూ, జనతా గ్యారేజ్, సరైనోడు కలెక్షన్స్ విషయంలో కూడా ఇలాగే గొడవలు పడ్డారు. ఇప్పుడు గూగుల్ సెర్చ్ టాపర్ గురించి జరుగుతున్న డిస్కషన్స్, తిట్టుకుంటున్న తిట్లు అయితే అంతకంటే దారుణం. కొంతమంది ఏ పనీలేని వాళ్ళు కలిసి పనిచేసుకుంటున్నవాళ్ళను కూడా ఈ ఇష్యూలోకి లాగి రచ్చ రచ్చ చేసేస్తున్నారా? అన్న అనుమానాలు వచ్చేలా చేస్తున్నారు. మన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులేమో ఇంటర్నెట్ ఫ్రీగా ఇస్తాం….అంతా ఆన్లైన్ చేసేస్తాం అని బోలెడంత అత్యుత్సాహం చూపిస్తున్నారు. తీరా చూస్తే చాలా మంది జనాల వాడకం మాత్రం ఇలాంటి విషయాల్లోనే ఎక్కువ ఉంటోంది. పోర్న్ వీడియోస్, సన్నీ లియోన్, హీరోల అభిమానుల రచ్చ….ప్రతి సంవత్సరం కూడా గూగుల్ సెర్చ్‌లో ఇవే టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు తెలుసుకుంటున్న మేధావులు ఈ విద్యార్థులు, కొంతమంది జనాల తీరు చూసి ఆవేధన చెందుతున్నారు. కానీ హీరోలపైన అభిమాన పైత్యంతో కొట్టుమిట్టాడుతున్న అభిమానులు మాత్రం మా హీరో గొప్ప అంటే…..మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో తిట్టుకుంటూ ఉన్నారు. ఈ అవాంచిత ట్రెండ్ కూడా ప్రతి సంవత్సరం సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అవుతూ ఉంటోంది. హీరోలందరూ బాగానే ఉంటారు. కానీ ఇంతకుముందు ఊర్లలో రచ్చబండల దగ్గర జరిగే అభిమానుల సీరియల్ తగాదాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే రచ్చబండల దగ్గర కంటే కూడా సోషల్ మీడియాలోనే బూతుల వాడకం అంతకుమించి అనే స్థాయిలో ఉండడం. ప్రస్థానం సినిమాలో దేవాకట్టా చెప్పినట్టుగా చదువుకున్న వాళ్ళే సంస్కారాన్ని తగలెడుతున్నారా ఏంటి మన సోకాల్డ్ భక్తులు, అభిమానులు.