జనతా గ్యారేజ్ తరవాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏమిటి? ఎవరితో ఉంటుంది? ఎప్పుడు వీటిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎన్టీఆర్ తదుపరి సినిమా వక్కంతం వంశీతోనే అని ప్రచారంలో ఉంది. ఎందుకంటే టెంపర్ సమయంలో వక్కంతం – ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ… పూరి జగన్నాథ్ కోసం ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టారు. వక్కంతం కథతోనే టెంపర్ సినిమా కార్యరూపం దాల్చింది. ఆ సినిమాతోనే ఎన్టీఆర్ ఫామ్లోకి వచ్చాడు. అప్పట్నుంచీ ‘నీతో సినిమా చేస్తా.. చేస్తా’ అంటూ ఎన్టీఆర్ భరోసా ఇస్తూనే వచ్చాడు. జనగా గ్యారేజ్ తరవాత ఈ సినిమా కచ్చితంగా ఉంటుందని భావించారంతా. కానీ… వక్కంతం విషయంలో ఎన్టీఆర్ ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సినిమా ఏమిటి అని అడిగితే ”ఇంకా ఏం అనుకోలేదు. కొన్ని డిస్కర్షన్స్ అయితే నడుస్తున్నాయి. అందులో వక్కంతం కథ కూడా ఉంది. అయితే.. ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేను” అంటున్నాడు ఎన్టీఆర్.
జనతా గ్యారేజ్ తరవాత ఎన్టీఆర్ బ్రేక్ తీసుకోబోతున్నాడు. కొన్నాళ్లు షూటింగ్ హడావుడికి దూరంగా ఉంటాడట. ”నాన్నకు ప్రేమతో తరవాత వెంటనే జనతా గ్యారేజ్ మొదలెట్టేశాం. మధ్యలో విరామం తీసుకోలేదు. అందుకే జనతా గ్యారేజ్ తరవాత కొన్నాళ్లు విశ్రాంతి తీసుకొందామనుకొంటున్నా. అది ఎన్నాళ్లన్నది ఇప్పుడే చెప్పలేను. అర్జెంటుగా సినిమాలు చేయడం కూడా నాకు ఇష్టం లేదు” అంటున్నాడు. అంటే ఈ గ్యాప్లో మంచి కథలు విని… అప్పుడు బెటర్ ఆప్షన్ని ఎంచుకోవాలని చూస్తున్నాడన్నమాట. మంచి కథ దొరికితే ఓకే. లేదంటే వక్కంతం ఎలాగూ ఉన్నాడు కదా. అదీ.. ఎన్టీఆర్ ప్లాన్.