జూనియర్ ఎన్టీఆర్ తన పూర్తి సమయం సినిమాలకే వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. సినిమా కెరీర్ మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఇతర అంశాలపై కనీస మాట మాట్లాడినా అది సంచలనం అవుతుందని తెలిసి పూర్తి స్థాయిలో కంట్రోల్ లో ఉంటున్నారు. కానీ ఇలా ఉండటం కూడా తప్పే అన్నట్లుగా కొంత మంది టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు పెడుతున్నారు. ప్రతి సినిమా ముందు రాజకీయంగా ఇదో పంచాయతీ అవుతోంది. దీని వల్ల ఎవరికైనా ఏమైనా ఉపయోగం ఉండే అవకాశం లేదు. లేనిపోని దూరం పెంచుకోవడం తప్ప.
ఎన్టీఆర్ లక్ష్యం చాలా స్పష్టం
చిన్న వయసులోనే ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. కానీ ఆ వయసులోనే రెండు పడవల మీద కాళ్లు పెట్టడం మంచిది కాదని చాలా త్వరగానే తెలుసుకున్నారు. సినిమాల్లో సాధించాల్సింది చాలా ఉందని అనుకుని పూర్తిగా రాజకీయాలకు డిటాచ్ అయిపోయారు. ఎంతగా ఉంటే.. సోదరి కూకట్ పల్లిలో పోటీ చేసినా మద్దతు ప్రకటించలేదు. కానీ వ్యక్తిగతంగా సపోర్టుగా ఉన్నారు. ప్రస్తుతానికి తాను రాజకీయ నీడలోకి వెళ్లకూడదని గట్టిగా ఫిక్సయ్యారు.
ఏం మాట్లాడినా చిలువలు పలువులు చేసే చాన్స్
ఎన్టీఆర్ చాలా తక్కువ మాట్లాడుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా స్పష్టంగా తన లక్ష్యం సినిమాలేనని చెప్పారు. అయినా ఆయన ప్రసంగంలో ఒకటి, రెండు మాటలు తీసుకుని రాజకీయాలకు ఆపాదించుకున్నారు. ఇటు టీడీపీ సోషల్ మీడియా ఆయనను కొడాలి నాని, వంశీలకు ముడిపెట్టి కొంత మందిపోస్టులు పెట్టారు. కష్టకాలంలో స్పందించలేదని… రజనీకాంత్ స్పందించారని చెప్పుకొచ్చారు. రజనీ 50 ఏళ్ల సినీ జీవితంపై శుభాకాంక్షలు చెబితే.. దానికి ఎన్టీఆర్ కు ముడిపెట్టారు. ఇలా చేయడం వల్ల ఏం వస్తుంది?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ కార్యకర్తలు
అదే సమయంలో ఇలాంటి రాజకీయాలు చేయడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. అలాంటి వారు గ్యాప్ మరింత పెంచడానికి ప్రయత్నిస్తూంటారు. వీరితో ఈగో సమస్యలు పెట్టుకుని.. ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా. ఎన్టీఆర్ .. రాజకీయాలకు దూరం అన్న ఆయన అభిప్రాయాలను గౌరవించాలి. ఆయనను రాజకీయాల్లోకి లాగకుండా ఉండటమే ఆయనకు టీడీపీ ఇచ్చే గౌరవం అనుకోవచ్చు.