ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేసింది. ప్రపంచ ప్రసిద్ధ టెక్ దిగ్గజం NVIDIA భాగస్వామ్యంతో, అమరావతి కేంద్రంగా AI లివింగ్ ల్యాబ్స్ ఫౌండేషన్ ర్పాటుకు రంగం సిద్ధమైంది. కంపెనీల చట్టం 2013లోని సెక్షన్ 8 ప్రకారం, ఇది ఒక లాభాపేక్ష లేని సంస్థగా పనిచేయనుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలో కనీసం ఒకరైనా AI శిక్షణ పొందిన వ్యక్తి ఉండాలనే మహోన్నత ఆశయంతో ఈ ప్రాజెక్టును రూపొందించారు.
అత్యాధునిక మౌలిక సదుపాయాలు:
ఈ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులు, పరిశోధకులు , స్టార్టప్‌లకు అత్యంత ఖరీదైన Shared GPU Computing వనరులు అందుబాటులోకి వస్తాయి. సాధారణంగా ఏఐ మోడల్స్ అభివృద్ధికి భారీ కంప్యూటింగ్ పవర్ అవసరమవుతుంది, ఇది చిన్న సంస్థలకు భారంగా మారుతుంది. అయితే, ఈ ల్యాబ్ ద్వారా ఎన్వీడియా అందించే అధునాతన ఏఐ టూల్స్, క్యూరేటెడ్ డేటా సెట్లు , ఇన్నోవేషన్ సాండ్‌బాక్స్‌లను ప్రభుత్వం ఉచితంగా లేదా తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తుంది.
నైపుణ్యాభివృద్ధి , సర్టిఫికేషన్
రాష్ట్రవ్యాప్తంగా ఏఐ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను ఈ ఫౌండేషన్ సమన్వయం చేస్తుంది. కేవలం విద్యార్థులకే కాకుండా, అధ్యాపకులకు కూడా శిక్షణ ఇచ్చి ఏఐ కరికులంను బలోపేతం చేస్తారు. దీనివల్ల యువతకు అంతర్జాతీయ స్థాయి ఏఐ సర్టిఫికేషన్లు లభిస్తాయి, తద్వారా వారు గ్లోబల్ మార్కెట్లో అత్యధిక జీతాలతో కూడిన ఉద్యోగాలను పొందడానికి వీలవుతుంది.
హబ్-అండ్-స్పోక్ మోడల్
ఏఐ విజ్ఞానం కేవలం అమరావతికే పరిమితం కాకుండా, రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరేలా ప్రభుత్వం హబ్-అండ్-స్పోక్ విధానాన్ని అమలు చేస్తోంది. అమరావతి ప్రధాన కేంద్రంగా ఉంటే, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు, విశ్వవిద్యాలయాలు శాఖలుగా పనిచేస్తాయి. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది.
రీసెర్చ్ , లాంగ్వేజ్ మోడల్స్
అప్లైడ్ ఏఐ రీసెర్చ్‌ను ప్రోత్సహించడం ఈ ఫౌండేషన్ మరో ముఖ్య ఉద్దేశం. సొంతంగా ఏఐ మోడల్స్ , లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది. ముఖ్యంగా తెలుగు భాషా వినియోగానికి సంబంధించిన ఏఐ టూల్స్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది స్థానిక సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంచడానికి దోహదపడుతుంది.
ఆర్థిక ప్రయోజనాలు , స్టార్టప్ సంస్కృతి
ఈ చొరవ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్‌లు , సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు లకు ఊతం లభిస్తుంది. నిజ జీవిత సమస్యల పరిష్కారం పై దృష్టి పెట్టడం వల్ల వ్యవసాయం, వైద్యం మ, విద్య వంటి రంగాల్లో ఏఐ ఆధారిత ఆవిష్కరణలు వస్తాయి. ఇది రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఏపీని దేశానికే ఏఐ క్యాపిటల్ గా నిలబెడుతుంది.
