పోలవరానికి ఓడిశా అభ్యంతరాలు… రైల్వేజోన్ కి ఏమైనా లింక్ ఉందా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఓడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందిస్తూ, నాలుగు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రా, తెలంగాణా, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలకి ఈరోజు నోటీసులు పంపింది. పోలవరం ప్రాజెక్టు పై ఓడిశాయే కాదు మహారాష్ట్ర, ఛత్తిస్ ఘడ్ రాష్ట్రాలు కూడా అభ్యంతరాలు తెలుపుతున్నాయి. ఆ ప్రాజెక్టు క్రింద ఓడిశాలో అనేక గ్రామాలు ముంపుకు గురవుతాయి కనుక ఓడిశా ప్రభుత్వం చాలా ఏళ్ళ నుంచి అభ్యంతరం తెలుపుతూనే ఉంది. కానీ ఇంతకాలం ఆ ప్రాజెక్టు పనులు నత్తనడకలు నడుస్తున్నందున అది కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రప్రభుత్వం అందదండలతో ఆ ప్రాజెక్టు పనులు చురుకుగా సాగుతుండటం, మార్చి 2018 నాటికల్లా ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయాలనుకొంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి కొన్ని రోజుల క్రితమే ఒక సమగ్ర నివేదిక పంపడంతో ఓడిశా ప్రభుత్వం అప్రమత్తం అయినట్లుంది.

ఓడిశా ప్రభుత్వం విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుకి కూడా అభ్యంతరం చెపుతోంది కనుక దానిని విజయవాడ తరలించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావించినట్లు ఆ మధ్య మీడియాకి లీకులు ఇచ్చాయి. కానీ ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇక ఎవరూ ఆ ప్రస్తావన చేయకుండా మౌనం వహించారు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయకపోతే, పోలవరం ప్రాజెక్టుకి ఓడిశా ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదని రాజీ కుదిరినట్లుగా కూడా ఆ మద్య మీడియాలో వార్తలు వచ్చాయి.

ఆ తరువాత విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మౌనం వహించడం, పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోవడంతో ఆ రాజీవార్తలు నిజమేననే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఆ తరువాత విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ “విశాఖలోనే రైల్వేజోన్ ఏర్పాటు అవుతుంది. అది విశాఖ ప్రజల హక్కు” అని చాలా స్పష్టంగానే చెప్పారు. అంటే రైల్వేజోన్ పై రాజీకి ఆయన అంగీకరించలేదని భావించవలసి ఉంటుంది.

రైల్వేజోన్ వదులుకోవడానికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించనందునే బహుశః ఒడిశా ప్రభుత్వం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుపై ఈ మెలిక పెడుతోందేమోననే అనుమానం కలుగుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రప్రభుత్వానిదే. దానికి అన్ని అనుమతులు, నిధులు అన్నీ ఇచ్చి సహకరిస్తోంది కనుక దాని గురించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఆలోచించనవసరం లేదు కానీ విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు కోసం కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసి రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేత వీలైనంత త్వరగా నిర్దిష్టమైన ప్రకటన చేయించవలసిన అవసరం చాలా ఉంది. లేకుంటే ఆ హామీ కూడా ప్రత్యేకహోదాలాగే మెల్లగా ఆవిరైపోయే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]