ఆ ఇద్దరి తర్వాత… మోడీయే మొనగాడు!

స్వాతంత్ర్యం పొందిన మొదటి రోజు నుంచీ పాకిస్తాన్ భారత్ పై విద్వేషంతో రగిలిపోయింది. ఇప్పటి వరకూ ప్రత్యక్షంగా మూడు యుద్ధాలు చేసింది. ఆ తర్వాత కార్గిల్ యుద్ధం చేసింది. మన ప్రధాన మంత్రుల్లో ధీరత్వాన్ని ప్రదర్శించిన వారుగా ఇప్పటి వరకూ ఇద్దరి పేర్లను చెప్పుకునే వాళ్లం. వారే, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ. ఇప్పుడు నరేంద్ర మోడీ పేరు కూడా ఆ జాబితాలో చేరింది.

లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న కాలంలో 1965 యుద్ధం జరిగింది. పాకిస్తాన్ కయ్యానికి కాలుదువ్వగానే శాస్త్రి ప్రభుత్వం చకచకా పావులు కదిపింది. యుద్ధానికి సైన్యాన్ని సర్వసన్నద్ధం చేసింది. పాక్ ను కోలుకోని విధంగా దెబ్బకొట్టాలనే శాస్త్రి పిలుపుతో మన జవాన్లు రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోయారు. లాహోర్ వరకూ అప్రతిహతంగా సాగిపోయారు. అడ్డొచ్చిన పాక్ సైన్యాన్ని మట్టుబెట్టారు. వాళ్ల యుద్ధ ట్యాంకులను తునాతునకలు చేశారు. ఆనాటి యుద్ధంలో పాక్ లోని 3,9000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత సైన్యం హస్తగతం చేసుకుంది. భారత్ లోని 650 కిలోమీటర్ల భూభాగాన్ని పాక్ సైన్యం హస్తగతం చేసుకుంది.

యుద్ధ విరమణ సమయంలో రెండు దేశాల బలగాలూ వెనక్కి రావాలనే అంతర్జాతీయ సమాజం సూచనను ఆనాటి ప్రధాని శాస్త్రి ఒప్పుకోలేదు. ఎవరు గెలిచిన భూభాగం వాళ్లదే అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే, తాష్కెంట్ లో చర్చలు జరుపుతున్న సమయంలోనే, దురదృష్టవశాత్తు శాస్త్రి అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ తర్వాత మన బలగాలు పాకిస్తాన్ నుంచి వెనక్కి వచ్చేశాయి. జై జవాన్ జైకిసాన్ పిలుపుతో బలగాల్లో స్థయిర్యాన్ని నింపిన ధీశాలిగా శాస్త్రి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

శాస్త్రి తర్వాత ప్రధాని అయిన ఇందిరాగా గాంధీ 1971 యుద్ధ సమయంలో చూపించిన ధైర్యసాహసాలు అసాధారణం. ఆనాటి యుద్ధంలో భారత్ బంగ్లా ప్రజల తరఫున పోరాడింది. అప్పటి తూర్పు పాకిస్తాన్ ప్రాంతంపై పశ్చిమ పాకిస్తాన్ దండయాత్ర చేసింది. భారత సైన్యం అప్రతిహతంగా దూసుకుపోయింది. పాకిస్తాన్ బలగాల పనిపట్టింది. పనిలో పనిగా, పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేయాలనే వ్యూహాన్ని ఇందిరా గాంధీ అమలు చేశారు. ఫలితంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. మనకు పక్కలో బళ్లెంలాంటి పాక్ బలం గణనీయంగా తగ్గిపోయింది. ఆనాడు ఇందిర చూపిన తెగువకు యావద్దేశం జేజేలు పలికింది.

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే నాటికి పాకిస్తాన్ ఉగ్రవాదులను అడ్డం పెట్టుకుని ప్రచ్ఛన్న యుద్ధాన్ని తీవ్ర స్థాయిలో కొనసాగిస్తోంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక ఉగ్రదాడులు జరిగాయి. యురీ దాడితో సహనం నశించింది. పాక్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే వ్యూహాన్ని మోడీ దాదాపువిజయవంతంగా అమలు చేశారు. పాక్ లాంటి దేశానికి సైనిక చర్య తప్ప మరే భాషా అర్థం కాదని మోడీకి తెలుసు. అందుకే పీవోకే లో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయించారు. మా దగ్గర అణుబాంబుఉంది జాగ్రత్త అనే పాక్ బెదిరింపులను మోడీ ఖాతరు చేయలేదు. చివరకు పాక్ భూభాగంలో దాన్నే చిత్తుచేసినా, ప్రపంచం పల్లెత్తు మాట అనని విధంగా వ్యూహాన్ని అమలు చేశారు. అందుకే, ప్రతిపక్షాలు, ప్రజల దృష్టిలో హీరో అయ్యారు. ఇక ముందు పాక్ ఇష్టారాజ్యంగా వ్యవహరించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కల్పించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com