OG Movie Review
Telugu360 Rating: 3/5
రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ మాట అన్నారోసారి. పవన్ కల్యాణ్ సినిమా అంటే.. ప్రత్యేకంగా కథేం అవసరం లేదు. తెరపై ఆయన కనిపిస్తే చాలు… అని. అది అక్షరాలా నిజం. పవన్ ని నిలబెట్టి, ఫ్యాన్స్‌ని నచ్చేలా చూపిస్తే సరిపోతుంది. బాక్సాఫీసు దగ్గర కనక వర్షం కురుస్తుంది. అంతటి ఇమేజ్ పవన్ కల్యాణ్ సొంతం. పవన్ ఫ్యాన్స్ కూడా సెపరేట్. వాళ్లు పెద్దగా ఏం కోరుకోరు. పవన్ ఏం చేసినా నచ్చుతుంది. పవన్ డాన్సులేం చేయక్కర్లెద్దు. ఫైట్స్ కూడా ఇరగదీయక్కర్లెద్దు. తన స్టైల్ జోడించి కాస్త కదిలితే చాలు. అది వీణ స్టెప్పు కంటే పాపులర్ అయిపోతుంది. మెడ మీద చేయి వేసి, రుద్దితే చాలు. అది బాహుబలిలో ఓ యుద్ధంతో సమానం. కానీ.. ఇవి రెండూ సరైన సమయంలో, సరైన చోట.. జరగాలి. ఆ టైమింగ్ మిస్సయ్యే పవన్ సినిమాలు కొన్ని బాక్సాఫీసు దగ్గర తడబడ్డాయి. పవన్‌ని ఎలా చూపించాలో తెలీక చాలామంది దర్శకులు గందరగోళానికి గురయ్యారు. పవన్‌ని చూపించే అవకాశం పవన్ అభిమానికే వస్తే అది ఎలా ఉంటుందో ‘గబ్బర్ సింగ్’తో అర్థమైంది. ఇప్పుడు సుజిత్ వంతు వచ్చింది. ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ రోజున థియేటర్లో గోల చేసిన లక్షలాది అభిమానుల్లో సుజిత్ ఒకడు. తనకిప్పుడు తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌నే డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఇలాంటి ఛాన్స్ వస్తే సుజిత్ ఎందుకు వదులుతాడు. అందుకే ఈ కాంబో సెట్ అయినప్పటి నుంచీ… ఒకటే హైప్. టీజర్‌తో, పాటలతో క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. పవన్ ఫ్యాన్స్ ఓజీ ఓజీ అంటూ ఊగిపోయారు. మరి గత రెండేళ్లుగా అభిమానుల్ని ఊరిస్తున్న ఓజీ ఎలా ఉంది? సుజిత్ తనకొచ్చిన అవకాశాన్ని వాడుకొన్నాడా, లేదా?
కథ:
1990వ దశకంలో ముంబైలో జరిగే కథ ఇది. సత్యా దాదా (ప్రకాష్‌రాజ్)కి చెందిన షిప్ యార్డుకు ఓ షిప్ వచ్చి ఆగుతుంది. ఆ షిప్‌లోని ఓ కంటేనర్ నిండా ఆర్డీఎక్స్ నిండిపోయి ఉంటుంది. ఆ కంటేనర్ పంపింది.. ఓమి (ఇమ్రాన్ హష్మీ). అతనో గ్యాంగ్ స్టర్. ఆ కంటేనర్ విద్రోహుల చేతిలో చేరితే ఏం అవుతుందో సత్య దాదాకు బాగా తెలుసు. అందుకే ఆ కంటేనర్ని దాచేస్తాడు. ఆ కంటేనర్ని వెదుక్కొంటూ ఓమి ముంబై వస్తాడు. సత్యాదాదాకు సంబంధించిన వాళ్లని వెంటాడతాడు. ఓమి నుంచి సత్యా దాదాని, అతని మనుషుల్ని రక్షించాలంటే ఒకే ఒక్కడి వల్ల సాధ్యం అవుతుంది. ఆ ఒక్కడు.. ఓజీ అని పిలుచుకొనే ఓజెస్ గంభీర (పవన్ కల్యాణ్). తను ముంబై వదిలి వెళ్లిపోయి పదిహేనేళ్లు అవుతుంది. ఇంతకీ ఓజీ ఎవరు? తాను తిరిగి వచ్చాడా? వచ్చాక ఏం జరిగింది? అసలు ఓజీకీ.. సత్యా దాదాకీ ఉన్న సంబంధం ఏమిటి? అనేదే.. ఓజీ కథ.
విశ్లేషణ :
విజయేంద్ర ప్రసాద్ చెప్పినట్టు పవన్ కల్యాణ్‌కి కథేం అవసరం లేదు. కాకపోతే.. సుజిత్ ఒక స్ట్రక్చర్ ఉన్న కథ రాసుకోగలిగాడు. చాలామందికి ఈ కథ రొటీన్ గానే అనిపించొచ్చు. ఇలాంటి కథ మనం చాలాసార్లు చూశాం కదా అని కూడా అనిపించ వచ్చు. కానీ… తెలిసిన కథని సుజిత్ తన మేకింగ్ స్టైల్ తో, పవన్ ఇమేజ్ తో ఎలివేషన్లతో కాస్త కొత్తగా మార్చేశాడు. సినిమా ప్రారంభమైన తొలి 24 నిమిషాల వరకూ పవన్ కల్యాణ్ తెరపై కనిపించడు. కానీ పవన్ ఉన్నాడన్న ఇంపాక్ట్ ఫ్యాన్స్‌కి కలుగుతూనే ఉంటుంది. `పవన్ ఇప్పుడొస్తాడా.. ఎప్పుడొస్తాడు` అనే ఎదురు చూపుల్లోనే సమయం ఇట్టే గడిచిపోతుంది. కమర్షియల్ సినిమాల్లో హీరో ఇంత లేట్ గా ఎంట్రీ ఇవ్వడం నిజంగా.. ఓ సాహసం. కానీ పవన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ ఎదురు చూపులకు తగిన ప్రతిఫలం దొరికినట్టే అనిపిస్తుంది. పవన్ ని తొలిసారి స్క్రీన్ పై చూపించిన మూమెంట్, అక్కడ తమన్ ఇచ్చిన ఆర్.ఆర్.. ఇవన్నీ పవన్ ఫ్యాన్స్‌కు పండుగ లా అనిపిస్తాయి. ఓజీ టైటిల్ సాంగ్ ఎప్పుడొచ్చినా.. జనం ఊగిపోతుంటారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది. నిజానికి ఫస్టాఫ్‌లో పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ. కానీ ప్రతీ సీన్లోనూ పవన్ ఉన్నట్టే అనిపిస్తుంది. పవన్ కనిపించే ప్రతీ ఫ్రేమూ ఫ్యాన్స్‌కి నచ్చుతుంది. ఇంట్రవెల్ లో సీన్.. పైసా వసూల్ మూమెంట్.
మధ్యలో కణ్మణితో లవ్ ట్రాక్ కాస్త రొటీన్ గా బోరింగ్ గా అనిపిస్తుంది. కాకపోతే.. ఇలాంటి కథల్లో అలాంటి కథల్లో హీరోకి ఎక్కడో ఓచోట ఎమోషన్ ముడి వేయాల్సిందే. కాబట్టి సుజిత్ కు ఈ ట్రాక్ వాడడం తప్పలేదు. ఇంట్రవెల్ తరవాత 20 నిమిషాలు బండి చాలా స్పీడుగా.. జోరుగా సాగిపోతుంది. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్ అయితే.. పవన్ ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ ఈ సినిమా చూసేలా చేస్తుంది. అక్కడ పవన్ విశ్వరూపం చూడొచ్చు. ఇలాంటి సీన్.. ఇంకోటి పడి ఉంటే ఎలా ఉండేదో అనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ సీన్ అయిపోయిన తరవాత.. కథ కాస్త ట్రాక్ తప్పుతున్నట్టు అనిపిస్తుంది. అర్జున్ దాస్ ఎపిసోడ్ పెద్దగా కిక్ ఇవ్వలేదు. అర్జున్ దాస్ వాయిస్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన డైలాగులు కొన్ని ఎలివేషన్లకు బాగా ఉపయోగపడ్డాయి. అయితే.. ఆ ట్రాక్ సంతృప్తికరంగా రాసుకోలేకపోయాడు. అర్జున్.. ఓజీపై పగ పెంచుకోవడానికి వేసిన రీజనింగ్ కూడా అంత గొప్పగా లేదు. క్లైమాక్స్ ఊహాజనితంగానే సాగిపోతుంది. పవన్ గన్నులు పట్టుకొని.. విచ్చలవిడిగా బులెట్ల వర్షం కురిపించుకొంటూ వెళ్లడమే చూస్తాం. కాకపోతే ఇక్కడ తమన్ ఓ మ్యాజిక్ చేశాడు. చివర్లో మిషన్ గన్‌కి ‘జానీ’ అనే పేరు పెట్టడం, ‘తమ్ముడు’లోని పాటని బ్యాక్ గ్రౌండ్ గా వాడుకోవడం… ఫ్యాన్స్‌కు పిచ్చ పిచ్చగా నచ్చేస్తాయి. అప్పటి వరకూ సినిమా నడతపై కాస్త అసంతృప్తి ఉన్నా, అవన్నీ ‘తమ్ముడు’లోని పాట రావడంతో పటాపంచలు అయిపోతుంది. సాహో సినిమాకు ఇచ్చిన లింక్.. చాలామందికి అర్థం కాదు. సుజిత్ యూనివర్స్ లో సాహో, ఓజీ సినిమాల్ని భాగస్వామ్యం చేయడానికి ఆ లింక్ ఉపయోగపడింది. ప్రభాస్ ని కూడా చూపించేస్తే భలే ఉండేది. ఆ ఆలోచన సుజిత్ కి వచ్చిందో, రాలేదో మరి..? చివర్లో… ఓజీ 2కి లింక్ ఇచ్చారు. అక్కడ ‘పగ రగిలిన ఫైరూ..’ బీజియమ్ ని టూ ఎక్స్ లో (డబుల్ స్పీడ్‌లో) వాడాడు తమన్. మామూలుగానే ఆ పాట.. ఓ రేంజ్ లో ఉంటుంది. దాన్ని డబుల్ స్పీడులో వినిపించేసరికి… మళ్లీ ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చేస్తాయి.
పెర్ఫార్మెన్స్ :
చాలాకాలం తరవాత పవన్ స్టైలీష్‌గా, అందంగా కనిపించాడు. తన లుక్స్, కాస్ట్యూమ్స్ అన్నీ బాగా కుదిరాయి. అత్తారింటికి దారేది తరవాత పవన్ ని ఇంత స్టైలీష్‌గా, అందంగా చూపించిన సినిమా ఇదేనేమో. పోలీస్ స్టేషన్ సీన్లో పవన్ ఎనర్జీ గుర్తుండిపోతుంది. తన అభిమాని సుజిత్ కి పవన్ పూర్తిగా సరెండర్ అయిపోయి ఈ సినిమా చేశాడేమో అనిపిస్తుంది. ఇమ్రాన్ హష్మీ స్టైలింగ్ లో పవన్ తో పోటీ పడ్డాడు. తనని సోలోగా చూస్తే.. తనే ఈ సినిమాలో హీరోనా అనిపించాడు. విలన్ పాత్ర ఇంకాస్త బలంగా రాసుకోవాల్సిందేమో. హీరో – విలన్లు ఎదురు పడే సందర్భాలు రెండే రెండు. ఆ రెండు చోట్లా పవన్ ఆధిపత్యమే కనిపించింది. ప్రకాష్ రాజ్ సెటిల్డ్ గా చేశాడు. ప్రియాంక మోహన్ అందంగా ఉంది. అయితే తనది ఇలాంటి గ్యాంగ్ స్టర్ కథల్లో కనిపించే రెగ్యులర్ హీరోయిన్ పాత్రే. అర్జున్ దాస్ క్యారెక్టర్, తన ట్రాక్ ఎలా ఉన్నా, తన వాయిస్‌కి ఈ సినిమాతో మరింత మంది ఫ్యాన్స్ పెరుగుతారు. శ్రియా శెట్టిది కూడా పవర్ ఫుల్ పాత్రే. రాహుల్ రవీంద్రన్ క్యారెక్టర్, తను ఇచ్చిన కొన్ని ఎక్స్ప్రెషన్స్ కాస్త ఇరిటేటింగ్ గా అనిపించాయి. ఎందుకో ఆ పాత్రకి తను సరిపోలేదు అనిపించింది.
ఈ సినిమాకి రెండో దర్శకుడు కచ్చితంగా తమనే. తన బీజియమ్స్ వేరే లెవల్ లో సాగాయి. సినిమా మొదలైనప్పటి నుంచీ చివరి వరకూ తమన్ మ్యాజిక్ కనిపిస్తూనే ఉంటుంది. పవన్ ఎలివేషన్లకు తాను ఇచ్చిన స్కోర్ మామూలుగా లేదు. తెరపై ఏం జరక్కపోతున్నా, పవన్ ఏం చేయలేకపోయినా… ఏదో జరిగిపోతోందన్న భ్రమ తన మ్యూజిక్ తో కలిగించాడు. తను ఇచ్చిన బెస్ట్ రీ రికార్డింగ్ అని చెప్పొచ్చు. టైటిల్ ట్రాక్ ఎన్నిసార్లు వాడినా బోర్ కొట్టలేదు. అంత మ్యాజిక్ ఉంది ఆ ట్రాక్ లో. సుజిత్ కి మేకింగ్ అంటే పిచ్చి. సాహోలో అదే కనిపించింది. ఇక్కడా అంతే. పవన్ పై తనకున్న ప్రేమ ప్రతీ ఫ్రేములోనూ చూపించేశాడు. ఎమోషన్ పై తాను కొంత దృష్టి పెడితే కచ్చితంగా తననుంచి మంచి సినిమాలొస్తాయి. మేకింగ్ లో ఈ సినిమాకు తిరుగులేదు. కెమెరా వర్క్ చాలా చక్కగా ఉంది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. కేజీఎఫ్ పేట్రన్‌లో కొన్ని సీన్లు ఎడిట్ చేశారు. డైలాగులు చాలా షార్ప్ గా ఉన్నాయి. జపనీస్ నేపథ్యం, చివర్లో జపాన్‌లో ఓజీ చేసిన విధ్వంసం గురించి చెప్పిన వైనం.. పెద్దగా ఎక్కలేదు. అర్థం కూడా కాలేదు. దాన్ని ఇంకొంచెం వివరించి చెప్పాల్సింది. ఫస్టాఫ్ పైసా వసూల్. సెకండాఫ్‌లో తొలి సగం.. కిక్ ఇస్తుంది. ఆ తరవాత కాస్త గాడి తప్పినా.. చివర్లో మళ్లీ లైన్లోకి వచ్చాడు సుజిత్.
ఒక్క మాటలో ఓజీ గురించి చెప్పాలంటే.. ఇది పవన్ ఫ్యాన్స్ కు పండుగ . తమ హీరోని ఎలా చూడాలనుకొంటున్నారో సుజిత్ అలా చూపించేశాడు. కొన్ని సీన్ల గురించి, కొన్ని ఎలివేషన్ల గురించి, ఫ్యాన్స్ పదే పదే మాట్లాడుకొంటారు. ఇది చాలు.. బాక్సాఫీసు దగ్గర ఓజీ సంచలనాలు సృష్టించడానికి. ఓపెనింగ్స్ అయితే అదిరిపోతాయి. ఫ్యాన్స్ తో పాటు..మిగిలిన సాధారణ ప్రేక్షకులు ఈ సినిమాని ఎంత వరకూ ఆదరిస్తారు అనేదాన్ని బట్టి ఓజీ రేంజ్ ఆధారపడి ఉంటుంది. ఎలా చెప్పుకొన్నా గత నాలుగైదేళ్లలో పవన్ కల్యాణ్ నుంచి వచ్చిన క్వాలిటీ సినిమా ఓజీ.. ఈ విషయంలో మాత్రం తిరుగులేదు.
– అన్వర్
Telugu360 Rating: 3/5