ఈరోజు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `ఓజీ` నుంచి కొత్త టీజర్ విడుదల బయటకు వదిలారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇది వరకు విడుదల చేసిన గ్లింప్స్… పవన్ ఫ్యాన్స్ కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమాపై ఇంతటి హైప్ రావడానికి ఆ గ్లింప్స్ ఓ ప్రధానమైన కారణం. ఆ తరవాత వచ్చిన పాట కూడా.. ఓజీ క్రేజ్ ని పదింతలు చేసింది. ఇప్పుడు పవన్ పుట్టిన రోజు సందర్భంగా సుజిత్ ఎలాంటి కానుక ఇస్తాడా అని పవన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
దాదాపు నిమిషం పాటు సాగిన ఈ గ్లింప్స్ లో ఎప్పటిలానే ఎలివేషన్లకు సుజిత్ పెద్ద పీట వేశాడు. కాకపోతే… ఇది ఓజీ గ్లింప్స్ లా లేదు. ఓమి పరిచయ కార్యక్రమంలా సాగింది. ఓమి పాత్రలో ఇమ్మాన్ హష్మీని చూపించారు. ఆ పాత్రలో హష్మీ ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉంది. ఓ స్టైలీష్ విలన్ ని చూడబోతున్నాం అనే భరోసాని ఈ గ్లింప్స్ కల్పించింది.
”డియర్ ఓజీ. నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నా.. నీ ఓమీ” అనే డైలాగ్ ఈ గ్లింప్స్ లో వినిపించింది. చివర్లో హ్యాపీ బర్త్ డే ఓజీ.. అనగానే పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ కు సంబంధించిన ఇంకొన్ని షాట్స్ ఉంటే బాగుండేదేమో.. అనిపించింది. తమన్ బీజియం, క్లాసీ విజువల్స్ ఎప్పటిలానే ఆకట్టుకొన్నాయి. ఈనెల 25న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈలోగా ఓ టీజర్, ట్రైలర్ మరో రెండు పాటలు రాబోతున్నాయి.