Oke Oka Jeevitham Movie Review
తెలుగు360 రేటింగ్ 3/5
ఒకే ఒక జీవితం…
రెండో ఛాన్స్ ఉండదు.. రాదు కూడా.
అసలు ఆ అవకాశం వస్తే, గతంలో చేసిన తప్పుల్ని సవరించుకొంటే, విధి రాతని మార్చుకొంటే, మన భవిష్యత్తుని చక్కబెట్టుకొంటే..?
ఆలోచనే గమ్మత్తుగా ఉంది కదా..? టైమ్ మిషన్ కథలు అక్కడే పుట్టుకొచ్చాయి. గతాన్ని మరోసారి పలకరించి, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకొనే అందమైన ఫాంటసీ అది. ఆదిత్య 369 నుంచి నిన్నా మొన్నటి బింబిసార వరకూ టైమ్ మిషన్ కథలు మ్యాజిక్ చేశాయి. ఇక మీదటా చేస్తాయి. ఎందుకంటే ఆ కథల్లో అంత స్టఫ్ ఉంది. ఇప్పుడు ఈ జానర్‌లో మరో సినిమా వచ్చింది. అదే ఒకే ఒక జీవితం.
ఆది (శర్వానంద్)కి సంగీతం అంటే ప్రాణం. పాటలు బాగా పాడతాడు. కానీ.. అందరి ముందూ పాడలేడు. స్టేజీ ఎక్కితే భయం. అమ్మ (అమల) ఉంటే బాగుండేది కదా అనుకుంటాడు. ఇరవై ఏళ్ల క్రితం అమ్మ… ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. అప్పటి నుంచీ ఆ భయం మరింత ఎక్కువైంది. ఆది స్నేహితులు శ్రీను (వెన్నెల కిషోర్), చైతూ (ప్రియదర్శి). ఒకొక్కరిదీ ఒక్కో సమస్య. శ్రీనుని అంతా బ్రోకర్ .. బ్రోకర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే తను ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్. చదువు లేదు. ఇంగ్లీషు అస్సలు రాదు. చిన్నప్పుడు నేను చదువుకుంటే బాగుండేది కదా అని ప్రతీ రోజూ బాధ పడుతుంటాడు. చైతూకి పెళ్లి సమస్య. ఎవర్ని చూసినా నచ్చరు. చిన్నప్పుడు తను రిజెక్ట్ చేసిన సీత… ఇప్పుడు అందంగా తయారయ్యేసరికి.. చిన్నప్పుడే ఎందుకు ఈ అమ్మాయిని ప్రేమించలేదు అని అనుక్షణం సతమవుతుంటాడు. ఈ ముగ్గురికీ… పాల్ (నాజర్) పరిచయం అవుతాడు. తను ఓ సెంటిస్ట్. టైమ్ మిషన్ కనుక్కోవడానికి ఇరవై ఏళ్లుగా కష్టపడుతూనే ఉంటాడు. చివరికి తన లక్ష్యానికి దగ్గరవుతాడు. టైమ్ మిషన్‌లో గతంలోకి వెళ్లి తమ తమ తప్పుల్ని సవరించుకొనే అవకాశం ఆది, శ్రీను, చైతూ ముందుకు వస్తుంది. మరి వాళ్లు ఈ అవకాశాన్ని అందుకొన్నారా? గతంలోకి వెళ్లి ఏం చేశారు? పాత తప్పుల్ని సరిదిద్దుకోగలిగారా, కొత్త తప్పుల్ని చేసొచ్చారా? ఇదీ మిగిలిన కథ.
పాత కథని కొత్తగా చెప్పాలి. కొత్త కథని అర్థమయ్యేలా చెప్పాలి. కొత్త ఫార్మెట్‌లో కథ ఎంచుకొంటే వచ్చే సౌలభ్యం ఏమిటంటే… సన్నివేశం ఎలా రాసుకొన్నా అది కొత్తగా కనిపిస్తుంది. `ఒకే ఒక జీవితం` ప్లస్ పాయింట్ అదే. టైమ్ మిషన్ నేపథ్యంలో ఇది వరకు `కొన్ని` సినిమాలు రావొచ్చు. కానీ అవి `కొన్నే`. కాబట్టి… ఈ కథా నేపథ్యం కొత్తదే. ఆదిత్య 369 టైమ్ మిషన్ కథలకు తలమానికం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడూ చూపించేసిన సినిమా అది. టైమ్ మిషన్ కథంటే ముందు అదే గుర్తొస్తుంది. దాన్ని డామినేట్ చేయడం, లేదా మర్చిపోయేలా చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. కనీసం పోలిక తీసుకు రాకుండా ఉంటే అదే పది వేలు. `ఒకే ఒక జీవితం` టైమ్ మిషన్ కథే అయినా… ఆదిత్య 369తో ఎలాంటి పోలిక ఉండదు. దీనికంటూ సెపరేట్ మార్క్ దక్కించుకోగలిగింది. ఎందుకంటే.. ఇది `అమ్మ` కథ. ఇరవై ఏళ్లుగా తాను కోల్పోయిన అమ్మని.. తాను మళ్లీ ఓసారి చూసుకొని రావడం.. తన ధైర్యాన్ని మళ్లీ తిరిగి తెచ్చుకోవడం ఇంతకంటే గొప్ప ఎమోషనల్ టచ్ ఏముంటుంది? టైమ్ మిషన్ కథని అమ్మ ఎమోషన్ తో ముడి పెట్టడంలో దర్శకుడు తెలివైన నిర్ణయం తీసుకొన్నాడు. టైమ్ మిషన్ కథ ఇది వరకే చూసిందే అయినా.. ఈసారి అమ్మ తోడవ్వడంతో ఆ కాంబినేషన్ కొత్తగా మారింది. ఇంట్రవెల్ బ్యాంగ్ అయితే… చిన్న ట్విస్టులాంటిది. నిజానికి.. అది కూడా ఓ తెలివైన ఎత్తుగడే. మూడు పదుల వయసు వాళ్లు…పదేళ్ల ప్రాయంలో తామెలా ఉన్నారో చూసుకోవడానికి వెళ్తే… ఆ పిల్లలు… భవిష్యత్తులోకి దూకేయడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇది టైమ్ మిషన్ కథకు రెండో యాంగిల్. అలా.. దర్శకుడు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు మూడింటినీ కవర్ చేసేసినట్టైంది.
వెన్నెల కిషోర్ కథ కూడా ఈ సినిమాకి ఓ కొత్త మైలేజీ తీసుకొచ్చింది. ఆ పాత్రతో ఫన్ పండించాడు దర్శకుడు. వెన్నెల కిషోర్ తో చేయించిన చిన్న చిన్న ఫన్నీ మూమెంట్స్ కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. ప్రియదర్శి ట్రాక్‌లో రెండు మూడు చోట్ల.. మంచి హై వస్తుంది. అయితే ఇంకొంచెం బాగా డిజైన్ చేసుకొంటే బాగుండేది. ఫస్టాఫ్ అంతా సాఫీగా సాగిపోతే.. సెకండాఫ్లో కాస్త జర్క్ వస్తుంది. స్లో నేరేషన్ ఇబ్బంది పెడుతుంది. ఆది తన గతంలోకి వెళ్లి.. తన ఇంటినీ, అమ్మా నాన్నని చూసి మురిసిపోతాడు. మరి…చైతూ, /శ్రీనులకు కూడా ఓ ఇల్లు ఉంటుంది కదా.. వాళ్లకూ అమ్మానాన్నలు ఉంటారు కదా..? ఆ ఎమోషన్‌ని దర్శకుడు ఎందుకు మిస్ అయిపోయాడు..? ఇంట్రవెల్ బ్యాంగ్ లో ఓ ట్విస్టు వచ్చినట్టే క్లైమాక్స్ లో కూడా ఓ మలుపు వస్తుందని ఆశిస్తారంతా. కానీ. స్మూత్ గా డీల్ చేసి వదిలేశాడు. అయినా సెకండాఫ్ పాస్ అయిపోతుంది. ఎందుకంటే.. ఇక్కడ కూడా అమ్మ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయిపోయింది.
శర్వా మంచి నటుడు. ఆ విషయంలో డౌటే లేదు. తనకు సరైన పాత్ర పడాలి అంతే. ఆది అలాంటి పాత్రే. నటుడిగా ఇంకో మెట్టు పైకి ఎక్కించిన సినిమా ఇది. అమ్మ వంట తింటున్నప్పుడు.. శర్వా మొహంపై కెమెరా ఒక నిమిషం పాటు అలానే ఉంటుంది. కళ్ల నిండా నీళ్లు గిర్రున తిరిగేంత వరకూ.. కట్ చేయలేదు. బహుశా గ్లిజరిన్ కూడా వాడకుండా ఆ షాట్ తీసి ఉంటారు. శర్వా ఎంత మంచి నటుడో చెప్పడానికి ఈ సీన్ ఒక్కటి చాలు. వెన్నెల కిషోర్ ట్రాక్ బాగుంది. తను కూడా ఎమోషనల్ గా కొన్ని డైలాగులు పలికాడు. తన కామెడీ టైమింగ్ ప్లస్ అయ్యింది. ప్రియదర్శి పాత్రని ఇంకొంచెం బాగా డిజైన్ చేయొచ్చు. ఇక అమల ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. చాలాకాలం అమ్మ పాత్రకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చిన సినిమా ఇది. అమల తన అనుభవాన్నంతా రంగరించింది. నాజర్‌కి ఈ టైపు పాత్రలు కొట్టిన పిండే. కథానాయిక పాత్రనీ డిసెంట్ గానే చూపించారు.
స్క్రిప్టు పకడ్బందీగా రాసుకొన్నాడు దర్శకుడు. నిజానికి టైమ్ మిషన్ కథలో ఎన్నో లాజిక్కులు మిస్సవుతాయి. ఇందులోనూ ఒకట్రెండు మిస్ అవ్వొచ్చు. వాటిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పనిలేదు. స్లో నేరేషన్ అనే కంప్లైంట్.. ఇలాంటి కథలకు సర్వ సాధారణం. ఈ సినిమా కూడా అందుకు అతీతం కాదు. సెకండాఫ్ మరింత బెటర్ గా రాయొచ్చు. తీయొచ్చు. ఈ సినిమాలో హీరో ఓ సంగీతకారుడు. కాబట్టి… ఈ కథలో సంగీతానికీ ప్రాధాన్యం ఉన్నట్టు. అయితే.. మంచి పాట ఒకటైనా ఉంటే బాగుండేది. అమ్మ పాట కూడా థియేటర్లో చూసినంత వరకూ ఓకే. బయటకు రాగానే మర్చిపోతాం. మనల్ని హాంట్ చేసే పాట ఒకటి ఇచ్చి ఉంటే మరింత మంచి అవుట్ పుట్ వచ్చేది.
దర్శకుడు తన తల్లిని కోల్పోయాక.. ఆ బాధలో రాసిన కథ ఇది. ఈ విషయం తనే చెప్పాడు. నిజంగా… కోల్పోయిన తల్లి ప్రేమని గతంలోకి వెళ్లి తెచ్చుకొనే అవకాశం ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. అదే సమయంలో మనం టైమ్ మిషన్ తో ఏ కాలంలోనైనా ప్రయాణం చేయొచ్చు. కానీ.. విధి రాతని మార్చలేం.. అనే విషయాన్నీ.. స్ఫష్టంగా, బలంగా చెప్పేశారు. ఒకే ఒక జీవితం… థియేటర్లో హాయిగా ఓసారి చూడ్డానికి ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు. శర్వా చేసిన మంచి అటెమ్ట్ లో ఇదొకటిగా మిగిలిపోతుంది.
తెలుగు360 రేటింగ్ 3/5