విస్తరిస్తున్న ఆర్టీసీ సమ్మె..! ఇక క్యాబ్‌లూ…!

బస్సుల బంద్‌లో అష్టకష్టాలు పడుతున్న హైదరాబాద్ వాసులకు క్యాబ్ డ్రైవర్లు కూడా షాక్ ఇవ్వబోతున్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలుకుతూ.. తమదైన డిమాండ్లు వినిపిస్తూ.. పందొమ్మిదో తేదీ అంటే.. శనివారం నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు.. క్యాబ్ డ్రైవర్ల జేఏసీ ప్రకటన చేసింది. తమకు కిలోమీటర్‌కు రూ. 22 ఇప్పించాలనేది వారి ప్రధాన డిమాండ్. క్యాబ్ అగ్రిగేటర్లయిన ఓలా, ఉబెర్ డ్రైవర్లందరూ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. అలాగే.. హైదరాబాద్ నలుమూలల నుంచి ఐటీ ఉద్యోగులకు రవాణా సేవలు అందించే క్యాబ్‌లు కూడా.. ఈ బంద్‌లో పాల్గొననున్నాయి. క్యాబ్‌ల సమ్మె ప్రారంభమైతే.. ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ సర్కార్… అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని.. వారు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారనే విధానంపైనే… సీఎం కేసీఆర్ నిలబడ్డారు. ఈ మేరకు.. హైకోర్టులో వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. నిజానికి హైకోర్టు కార్మికులతో చర్చలు జరపాలని.. ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీని నియమించాలని ఆదేశించింది. కానీ.. కేసీఆర్ మాత్రం… తనదైన వాదనను ప్రభుత్వం తరపున హైకోర్టులో వినిపించేందుకు.. న్యాయనిపుణలతో సమావేశమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులెరర్నీ బుజ్జగించే ప్రశ్నే లేదని… ఆర్టీసీని సగం ప్రైవేటీకరణ చేసి తీరాలని కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది.

మరో వైపు కార్మికులు చర్చలకు సిద్ధమంటున్నారు. కానీ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే తమ డిమాండ్ పై వెనక్కి తగ్గడం లేదు. అదే సమయంలో.. సమ్మెకు మద్దతుగా ఇతరులు రంగంలోకి దిగుతున్నారు. నిన్నామొన్నటి వరకూ మద్దతు విషయంలో ఊగిసలాడిన టీజీవో, టీఎన్జీవో ఉద్యోగ సంఘాలు.. మరో సకలజనుల సమ్మెకు సిద్ధమని ప్రకటించాయి. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్లు కూడా తమ డిమాండ్లు వినిపిస్తూ.. సమ్మెకు సిద్ధం కావడంతో.. తర్వాత ఆటో డ్రైవర్లు కూడా.. అదే బాట పడతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం మెట్టు దిగకపోతే.. ప్రజల్లో అలజడి రేగడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com