Om Shanti Shanti Shantihi movie review
తెలుగు360 రేటింగ్: 2.5/5
ఆడవాళ్లకు కూడా సమానమైన హక్కులు ఇవ్వాలి అంటుంటారు. నిజానికి ‘హక్కులు’ ఎవరికీ ఎవరూ ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వాళ్ల ‘హక్కు’ కాబట్టి. వాటికి దయాదక్షణ్యాలతో పని లేదు. ఆడవాళ్లు రిఫెక్లన్స్. ప్రేమిస్తే ప్రేమిస్తారు. కోపిస్తే.. కోపగిస్తారు. కొడితే – ‘తిరిగి కొడతారు కూడా’.
మలయాళంలో వచ్చిన ‘జయ జయ జయహే’ ఈ కాన్సెప్టుతో సాగిన కథ. ఓ భర్తపై భార్య తిరగబడడం అనే పాయింట్ అక్కడి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అందుకే ఆ కథని ‘ఓం శాంతి శాంతి శాంతి’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. వార్తల్లో నిలిచిన జంట తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించడం, 35 లాంటి సెన్సిబుల్ మూవీ అందించిన సృజన్ నిర్మాత కావడంతో ఈ సినిమాపై ఆసక్తి రెట్టింపు అయ్యింది. మరింతకీ ఈ సినిమా ఎలా వుంది? భార్యాభర్తల యుద్ధభేరి వెండి తెరపై ఎలా సాగింది? రీమేక్ కి న్యాయం చేశారా, లేదా?
ప్రశాంతి (ఈషా రెబ్బా) ఓ సగటు అమ్మాయి. ఇంట్లో అమ్మానాన్నల ఆంక్షలు, అన్నయ్య పెత్తనం, మేనమామ అక్కర్లేని పెద్దరికాల మధ్య పెరిగిన మామూలు అమ్మాయి. ప్రేమిస్తే, తాను కోరుకొన్న వ్యక్తి భర్తగా లభిస్తే.. అని ఆశ పడితే.. అక్కడా ఎదురుదెబ్బే తగులుతుంది. చివరికి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొంటుంది. ఆయన గారి పేరు.. ఓంకార్ నాయుడు (తరుణ్ భాస్కర్). చేసేది చేపల వ్యాపారం. ఒకలాంటి తీరు. ఇంట్లో అన్నిటా తనదే పెత్తనం. కోపం ఎక్కువ. ఆ కోపం కట్టుకొన్న ఇల్లాలిపై కూడా చూపిస్తాడు. అయిన దానికీ, కానిదానికీ.. చెంపదెబ్బే సమాధానం అవుతుంది. కన్నవాళ్లకు చెప్పుకొంటే ‘సర్దుకొని పోవాలి’ అని హితవు పలుకుతారు. ఇంట్లో ఆయన గారి దెబ్బల తాకిడి రోజు రోజుకీ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ సహించలేక, ఓసారి ఎదురుతిరుగుతుంది. కరాటే నేర్చుకొని మరీ.. ఎదురుదాడి చేస్తుంది. దాంతో ఆ భర్త అవాక్కవుతాడు. భార్య చేతిలో చావు దెబ్బలు తిన్న మగాడి అహంకారం అతన్ని ఏ దారిలో నడిపించింది? భర్తపై ఎదురు తిరిగిన ఆ వీరనారి ఆ తరవాత ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంది? అనేదే మిగిలిన కథ.
రీమేక్ కథల్ని మళ్లీ ఒక ఫ్రెష్ ఫీల్ తో తెరకెక్కించడం అంత ఈజీ కాదు. మార్పులూ, చేర్పులూ చేయాలంటే భయం పట్టుకొంటుంటుంది. మారిస్తే మాతృకలో ఫీల్ మిస్ అవుతుందేమో అనే కంగారు వస్తుంది. మార్చకపోతే కాపీ పేస్ట్ అంటారన్న ఇబ్బంది ఉంటుంది. ఇవన్నీ బాలెన్స్ చేస్తూ రీమేక్ కథలు తీయాలి. కథా పరంగా చూస్తే ‘ఓం శాంతి’కీ ‘జయ జయ హే’ సినిమాకీ ఎలాంటి తేడా లేదు. అక్కడా ఇక్కడా కథ ఒకటే. కానీ నెటివిటీ పరంగా మాత్రం మార్పులు కనిపిస్తాయి. అచ్చమైన గోదావరి యాస, భాష, పాత్రలూ మిళితం చేసి ఒక కొత్త ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. తెరపై పాత్రలన్నీ స్వచ్ఛమైన గోదావరి యాసలో మాట్లాడుతుంటే.. చూడ్డానికి, వినడానికీ భలే ముచ్చటగా ఉంటుంది. ప్రశాంతి బాల్యం, చిన్నప్పటి నుంచీ తన చుట్టూ ఏర్పాటైన కనబడని కంచె, దాన్నుంచి దాటుకు రావడానికి చేసే ప్రయత్నాలు.. ఇవన్నీ అమ్మాయిల పట్ల మనం ప్రేమతో చూపిస్తున్న వివక్షతకు అద్దం పడుతుంటాయి. ఓంకార్ నాయుడు పాత్ర ఎంట్రీతో కథ ఫన్ టోన్ లోకి మారుతుంది. బ్రహ్మాజీ ఇచ్చే సలహాలు, తనతో జరిగే కాన్వర్జేషన్ బాగా కుదిరాయి. చెంపదెబ్బ ఎఫెక్టుల నుంచి బయటపడి.. కథానాయిక తిరుగుబాట ధోరణిలోకి మారడంతో అసలైన కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. అణగారుతున్న వర్గం తిరుగబడితే చూడ్డానికి బాగుంటుంది. ప్రేక్షకుల ఈగో చల్లబడుతుంది. ఇక్కడా అదే జరిగింది. ఎప్పుడైతే శాంతి – ఓంకార్ నాయుడుపై ఎదురుదాడి చేస్తుందో అక్కడ ప్రేక్షకులకు కావాల్సిన మజా దొరికేస్తుంది.
ఇంట్రవెల్ వరకూ ఎలాంటి కంప్లైంట్ లేని సినిమా ఇది. ఆ తరవాత కూడా అదే ఫన్, అంతే ఆసక్తి ఉండి ఉంటే.. ఈ సినిమా ఫలితం మరోలా ఉండేది. కానీ సెకండాఫ్లో ఆ ఫ్లో తగ్గింది. ఎంటర్టైన్మెంట్ కి ఆస్కారం ఉన్నా.. ఎందుకో ఆ దిశగా దర్శకుడు సీన్లు రాయలేదు. రాసినా.. అందులో ఫన్ సరిపోలేదు. తొలి సగంలో చూపించిన అథెంటిసిటీ మలి సగంలో కనిపించకుండా పోవడం విచిత్రం. క్లైమాక్స్ కూడా ‘అప్పుడే అయిపోయిందేంటి’ అనిపించేలా వుంది. కోర్ట్ రూమ్ డ్రామా అసలు వర్కవుట్ కాలేదు. అక్కడ ఫన్ కూడా పండలేదు. బ్రహ్మానందాన్ని జడ్జ్ పాత్రలో చూసీ చూసీ బోర్ కొట్టేసింది. అవే ఎక్స్ప్రెషన్లు, దాదాపుగా అలాంటి డైలాగులే. జనాలకు బోర్ కొట్టేస్తోంది. ఇలాంటి సినిమాలకు క్లైమాక్స్ చాలా అవసరం. అదెంత పకడ్బందీగా ఉంటే అంత బాగుంటుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏదో ఓ ఫీల్ తో రావాలి. ఆ ఫీల్ మిస్సయ్యింది. అక్కడక్కడ బిట్స్ అండ్ పీసెస్ గా సినిమా చూడ్డానికి బాగుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే మాత్రం చెప్పడానికి పెద్ద కథేం మిగల్లేదు.
తరుణ్ భాస్కర్ నాయుడు పాత్రలో ఒదిగిపోయాడు. తన ఎక్స్ప్రెషన్స్ అత్యంత సహజంగా కుదిరాయి. తెలంగాణ బిడ్డ.కానీ గోదావరి యాసలో మాట్లాడడం కొత్తగా అనిపించింది. యాసని ఇంకొంచెం ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈషా నటన నచ్చుతుంది. తాను కూడా సజహంగా కనిపించింది. యాక్షన్ సీన్స్ లో బాగా చేసింది. చాలా చోట్ల తనకు డైలాగులు లేవు. కేవలం హావభావాలతో కన్వే చేసింది. బ్రహ్మాజీ కనిపించిన ప్రతీసారీ.. సీన్లు బాగా పండాయి. తను ఇంకొంచెం సేపు ఉంటే బాగుటుందనిపించింది. హీరో అమ్మ, అక్క పాత్రలు కూడా బాగా కుదిరాయి.
దర్శకుడు ఈ కథకు వీలైనంత నెటివిటీ టచ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అందులో చాలాసార్లు సఫలీకృతం అయ్యాడు కూడా. ముఖ్యంగా గోదావరి యాసలో కొన్ని డైలాగులు బాగా పలికాయి. అనాసరంగా (అనవసరంగా), కనమాయి (మిగిలినవి), సలుపు (నొప్పి) ఇలాంటి చిన్న చిన్న పదాల్ని కూడా డైలాగుల్లో రాసుకోగలిగాడు. హీరో – హీరోయిన్లు ముష్టి యుద్ధానికి దిగినప్పుడు వెనుక కోడి పందాల్ని గుర్తు చేస్తూ కామెంట్రీ ఇవ్వడం బాగుంది. ఎడిటింగ్ కట్ షార్ప్ గా వుంది. సెకండాఫ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది. క్లైమాక్స్ లో కూడా ఏదో ఓ కుదుపు, మెరుపు ఉంటే బాగుండేది. చిన్న సైజు సినిమా ఇది. అయినా క్వాలిటీ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. పాటలు కథలో ఇమిడిపోయాయి. ‘జయ జయహే’ చూడని వాళ్లకు ఆడవాళ్ల తిరుగుబాటు అనే పాయింట్ నచ్చుతుంది. చూసినవాళ్లకు ‘ఇంకేదో మిస్ అయ్యిందే’ అనే ఫీలింగ్ వస్తుంది.
తెలుగు360 రేటింగ్: 2.5/5
