మస్క్ – ట్రంప్ మధ్య శత్రుత్వానికి కారణం అయిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు చట్టసభల్లో ఆమోదం పొందింది. ట్రంప్ సంతకం పెట్టి దాన్ని చట్టంగా మార్చబోతున్నారు. 2017లో ఎత్తివేసిన పన్ను కోతలను శాశ్వతంగా కొనసాగించడానికి బిల్లును ట్రంప్ తీసుకువచ్చారు. దాదాపు 4.5 ట్రిలియన్ డాలర్ల పన్నుల కోత ఇందులో ఉంది. సీనియర్ సిటిజన్లు కూడా 6000 డాలర్ల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది. పిల్లల పన్ను క్రెడిట్‌ను కూడా 2200 డాలర్లకు పెంచవచ్చు. రుణ పరిమితిని కూడా 5 ట్రిలియన్ డాలర్లకు పెంచవచ్చు.
ఈ బిల్లు చాలా పెద్దది. దీనిలోని కష్టనష్టాలపై అమెరికాలో అనేక చర్చలు జరిగాయి. ఎలాన్ మస్క్ ఈ బిల్లు అమెరికాను దివాలా తీయిస్తుందని వ్యతిరేకించారు. అయితే ఇందులో ఆయనకు సంబంధించిన వ్యాపారాలకు రాయితీలు కట్ చేస్తున్నట్లుగా ఉంది కాబట్టి వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ ఫైరయ్యారు. మస్క్ చివరి వరకూ వ్యతిరేకత చూపారు. ఆమోదిస్తే సొంత పార్టీ పెడతానన్నారు. చివరికి అమెరికా నుంచి పంపించేస్తానని ట్రంప్ హెచ్చరించడంతో ఆగిపోయారు. ఇప్పుడు సైలెంట్ అయ్యారు.
ఈ బిల్లు అమెరికాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నదానిపై ఆర్థిక నిపుణులు కూడా సరైన అంచనాకు రాలేకపోతున్నారు. పన్నుల కోత ఓ వైపు.. సబ్సిడీల కోత మరో వైపు ఉంటుంది. నిజమైన పేదలకు సబ్సిడీలు, సంక్షేమం అందకపోతే జీవన ప్రమాణాలు…పడిపోతాయని అది అమెరికాకు మంచిది కాదని అంటున్నారు. మరో వైపు భారీగా డబ్బులు ఆదా అవుతాయని కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఎలా చూసినా అమెరికా ప్రజలకు ఈ బిల్లుతో కొత్తగా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.