అమెజాన్ వగైరా సంస్థల జాకెట్ యాడ్ వచ్చిన రోజు పేపర్ లూజ్ సర్కులేషన్ పెరుగుతూంది. ఆన్ లైన్ అమ్మకాలు పెరగడం ఇందుకు పైకి కనిపించే కారణం…వినియోగ వస్తువుల పై ప్రజల్లో కన్స్యూమరిజం వేగంగా పెరిగిపోతూవుండటం ఇందులో కనిపించని కారణం.
ఈ ధోరణి భారతీయుల సహజ లక్షణమైన పొదుపు ని వేగంగా ధ్వంసం చేస్తోంది. సంపాదనలో మిగులుని, ఖర్చులు తగ్గించి కూడబెట్టుకున్న సొమ్ముతో ఆస్ధులు కొనడం మగవారి అలవాటు…బంగారం కొనడం ఆడవారి అలవాటు. దేశమంతా ఇదే లక్షణం వుండటం వల్ల డొమెస్టిక్ సేవింగ్స్ లో భారత్ కు మించిన దేశమే లేకుండా పోయింది. ఆర్ధిక సంక్షోభంతో ప్రపంచమంతా మాంద్యంలో కూరుకుపోయిన 2008 లో కూడా మన ఆర్ధిక సౌష్టవం చెక్కు చెదరలేదంటే సంపదలు కూడబెట్టే భారతీయ ఇల్లాళ్ళు, బంగారాలే కారణం!
ఇపుడైతే ఆపరిస్ధితులు వేగంగా అంతరించిపోతున్నాయి. జీతం వచ్చిన రెండురోజుల్లోనే పేమెంట్లు క్లియర్ అయిపోయి, తిరిగి డబ్బుల కోసం నెలంతా పనిచేయవలసిన అమెరికా జీవనశైలి మనలో చొరబడిపోయింది. మధ్యలో ఏ అవసరం వచ్చినా తీర్చడానికి క్రెడిట్ కార్డులు వున్నాయి. పండగల్లో ఇంటిల్లపాదీ బయటకు వెళ్ళి అవసరమైన వస్తువులకోసం తిరిగి వెతికి కొనుక్కునే సంతృప్తి ఆనందాల చోటుని అమెజాన్, ఇబే, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి ఆన్ లైన్ మార్కెట్లు ఆక్రమించేశాయి.
ఆ వర్చువల్ మార్కెట్ల యాప్ లను డౌన్ లోడ్ చేసుకుని వాటిద్వారా ఆర్డర్ చేస్తేనే డిస్కౌంట్లు అనే షరతు వుంది. డౌన్ లోడ్ చేయడం వల్ల కొనుగోలుదారుల కాంటాక్టు వివరాలు కంపెనీలకు వెళ్ళిపోతాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఆఫర్ల ద్వారా టెంప్ట్ చేయడానికి వీలౌతుంది. ఏమేమి ఆఫర్లు వున్నాయో పదేపదే వెతుక్కోడానికి కొనుగోలుదారులకు ఒక గేట్ వే అవుతుంది. అన్నిటికీమించి యాప్ డౌన్ లోడ్ చేసుకోవడమంటే అన్ని షరతులనూ ఆమోదిస్తున్నామని డిజిటల్ సంతకం చేయడమే అవుతుంది!!
ఇ కామర్స్ ను పెంచే డిజిటల్ ఎన్విరాన్ మెంటు విస్తరిస్తున్నందుకు ప్రో మార్కేట్ నేతలైన నరేంద్రమోదీ వంటి వారు సంతోషిస్తూ వుండవచ్చు! చంద్రబాబు నాయుడు వంటి వారు ఆసంతోషాన్ని ఆపుకోలేక బయట పెట్టేస్తూ వుండవచ్చు!
వ్యవసాయ మిగుళ్ళు సంపదలుగా మారే భారతదేశం స్వభావాన్ని వస్తువులు కొనే వినియోగ మార్కెట్ గా, బయటి వారి వ్యాపారాలకు కొమ్ముగాసే సర్వీసు రంగంగా మార్చేస్తున్న దేశ, రాష్ట్రాల ఆర్ధిక విధానాలు – అవసరమైన సరుకును మాత్రమే డబ్బిచ్చి కొనుక్కునే ప్రజల ఒబ్బిడితనాన్ని ”అప్పుచేసి పప్పుకూడు” తినే దుబారా మనుషులుగా మార్చేస్తున్నాయి.
ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ కార్యక్రమం పోస్ట్ డేటెడ్ చెక్కులే హామీలుగా క్షణాల్లో రుణాలిచ్చే పరపతి మార్గాలైపోయాయి. వెంటపడి క్రెడిట్ కార్డులిచ్చే మనీ మార్కెట్లు రెండో ఆలోచన లేకుండా నచ్చిన వస్తువుని కొనేసే వేలంవేర్రి వ్యాపకానికి దారులు వేస్తున్నాయి.
ఏస్ధాయికి ఆస్ధాయిలో ఎంతో కొంత పొదుపు మిగుళ్ళతో ధీమాగా జీవించే సగటు భారతీయని స్వభావం వినియోగ వస్తువు కోసం రేపటి శ్రమను ఈ రోజే తాకట్టు పెట్టే ”అప్పుల అప్పారావు” గా మారిపోతోంది.
రెండు ముఖాల (ఒకటి సొంత ఫస్ట్ పేజి, రెండవది ఫస్ట్ పేజికంటే ముందు కనిపించే యాడ్ పేజి) పేపర్లలో అమెజాన్ జాకెట్ యాడ్ వెనుక ఇంత కథ వుంది!!