ఢిల్లీలో జరిగిన భారీ పేలుడుకు కారణం ఉగ్రవాద దాడులేనని ఇప్పటి వరకూ ప్రభుత్వం నిర్దారించలేదు. అలాగే ఏ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ కూడా తామే చేశామని చెప్పుకోలేదు. పేలుడుకు సంబంధించి పూర్తి వివరాలను కేంద్రం బయటకు తీస్తోంది. అందులో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాయం చేసినట్లుగా ఆధారాలు లభిస్తే.. ఇక ఆరోపణలు చేయడాలు.. అంతర్జాతీయ కోర్టులకు ఎక్కడాలు ఉండవు. నేరుగా ప్రతీకారం తీర్చుకోవడమే ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ రెండో రౌండ్ ప్రారంభమవుతుంది.
గుంభనంగా బయటకు వివరాలు తెలియకుండా దర్యాప్తు
ఢిల్లీలో హై సెక్యూరిటీ ఉంటుంది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో దానికి కారణం ఏమిటో విశ్లేషించే వ్యవస్థలు ఉంటాయి. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు వ్యవహారంలో ఏం జరిగిందో ఇప్పటికే వ్యవస్థలన్నీ బయటకు వెలికి తీసి ఉంటాయి. పేలిన కారు ఎక్కడ నుంచి బయలు దేరింది.. అందులో ఎవరు ఉన్నారు.. పేలుళ్లకు ఎందుకు పాల్పడ్డారు..లాంటి విషయాలపై ఓ అవగాహనకు వచ్చి ఉంటారు. కానీ ఇంకా బయట పెట్టలేదు. అది వ్యూహాత్మకంగా అనుకోవచ్చు.
మానవబాంబుల దాడేనా ?
మెల్లగా వెళ్తున్న కారులో.. మంచి జనసమ్మర్థం ఉన్న చోట పేలిపోయింది. ఓ సీఎన్జీ ట్యాంక్ పేలితే అంత పెద్ద ప్రమాదం జరగదు. అమ్మోనియా నైట్రైట్ ను ఉపయోగించి పేల్చారని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో ఓ తుపాకీ బుల్లెట్ కూడా లభించింది. అన్నింటినీ విశ్లేషిస్తున్నారు. వీవీఐపీ జోన్ లో ఉన్న సెక్యూరిటీ ఏర్పాట్ల కారణంగా ప్రకారం.. బయట నుంచి బాంబులు తెచ్చి పెట్టడం సాధ్యం కాదు. ఎక్కడో తయారు చేసి కారులో పెట్టుకుని వస్తూ కాల్చేశారని అనుమానిస్తున్నారు. అది మానవబాంబు దాడి అయి ఉండొచ్చన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
పాకిస్తాన్ ప్రమేయం ఆధారాలు దొరికితే సిందూర్ 2.0
కొంతకాలంగా పాకిస్తాన్ సంగతి తేల్చడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. త్రివిధ దళాలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. గతంలోనే ప్రధాని మోదీ.. ఇండియాలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ఇక మాటలు కూడా ఉండబోవన్నారు. ఆ విషయాన్ని నెటిజన్లు అనేక మంది గుర్తు చేస్తున్నారు. ఈ సారి పాకిస్తాన్ కు.. ఎలాంటి అవకాశం ఇవ్వకుండా.. మొత్తం పని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్దం చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే గుంభనంగా ఉంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.


