ఓటీటీ అనేది ఇది వరకు కల్పతరువు అనుకొనేవారు. చిన్న, మీడియం రేంజు సినిమాలకు ఓటీటీ భరోసా ఇచ్చేది. పెద్ద సినిమాలకు అదే ఊపిరి. కానీ ఇప్పుడు అదే భస్మాసుర హస్తంగా మారిపోయింది. ఓటీటీల వల్లే జనాలు థియేటర్లకు రావడం లేదన్నది అందరి మాట. సినిమా విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలకు ఇచ్చేయడం వల్ల ప్రేక్షకులూ.. ఇంట్లోనే సినిమాల్ని చూడ్డానికి అలవాటు పడిపోతున్నారు. దాంతో ఓటీటీలను కట్టడి చేయాల్సిందే అనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయమై నిర్మాతల మండలి చాలాసార్లు మల్లగుల్లాలు పడింది. ఓటీటీలను అదుపులోకి తీసుకురావడం ఎలా అనే విషయమై తర్జన భర్జనలు చేసింది. సినిమా విడుదలైన 8 వారాల తరవాతే… ఓటీటీలకు వదిలితే బాగుంటుందన్నది చాలామంది అభిప్రాయం. ఇప్పుడు నిర్మాతల మండలి ఈమాటకే కట్టుబడి… ఏ సినిమా అయినా 8 వారాలు దాటాకే, ఓటీటీలకు ఇవ్వాలన్న తీర్మాణం చేయబోతోంది. ప్రొడ్యూసర్ కౌన్సిల్, గిల్డ్ కలిసి ఈ నిర్ణయం తీసుకొని అమలు చేయాలన్న అభిప్రాయానికి వచ్చేసింది.
8 వారాల గ్యాప్ తీసుకొంటే థియేటర్ల ఫుట్ ఫాల్స్ పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓ మంచి సినిమా థియేటర్లకు వస్తే, చూడ్డానికి ప్రేక్షకులు 8 వారాలు ఎదురు చూడలేరు. కాబట్టి ఈ నిర్ణయం మంచిదే. కాకపోతే.. ఎంత వరకూ అమలు చేస్తారు? అనేదే కీలకం. ఇది వరకు కూడా 8 వారాల నిబంధన పాటించాలని గట్టిగా అనుకొన్నారు. కానీ అది సాధ్యం కాలేదు. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్లదే. మిగిలిన సినిమాలు వచ్చినప్పుడు ‘8 వారాల నిబంధన’ గురించి మాట్లాడే నిర్మాతలు.. తమ సొంత సినిమా వచ్చేసరికి నాలుగు వారాలకే ఓటీటీలకు వదిలేస్తుంటారు. ఈ విషయంలో ఎవరూ ఒకే అభిప్రాయంపై నిలబడలేకపోతున్నారు.
పెద్ద సినిమాలపై ఓటీటీలకు క్రేజ్ ఉంటుంది. 8 వారాలు ఆగడం పెద్ద విషయం కాదు. కానీ.. చిన్న – మీడియం రేంజ్ సినిమాల మాటేమిటి? అసలే ఈ సినిమాలు చూడ్డానికి జనం థియేటర్లకు రావడం లేదు. థియేటర్ పరంగా రెవిన్యూ పడిపోయింది. 8 వారాల నిబంధనకు తలొగ్గకపోతే.. ఓటీటీల నుంచి కూడా సొమ్ము రాకపోతే, సదరు నిర్మాత రికవరీ అయ్యేది ఎలా? ‘సినిమా చూశాకే ఓటీటీ కొంటాం’ అని పట్టుపట్టుకొని కూర్చుంటున్నాయి సంస్థలు. ఇప్పటికీ సినిమాలు చూసే కొంటున్నారు. 8 వారాల గ్యాప్ అంటే.. అసలు చిన్న సినిమాలవైపు ఓటీటీలు కన్నెత్తి చూస్తాయా?
8 వారాల నిబంధన వస్తే ఓటీటీలు ఎలా తీసుకొంటాయన్నది మరో అంశం. ఇప్పుడు ఇచ్చేంత రేటు అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వరు. పైగా నిబంధనలు మరింత కఠినతరం అవుతాయి. కలక్షన్లని బట్టే రేటు అని ఫిక్స్ చేస్తే నిర్మాతలు మరింత ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. 4 వారాల నిబంధన వల్ల థియేటర్లకు జనం రావడం లేదా? సరైన కంటెంట్ ఇవ్వకపోవడం వల్ల రావడం లేదా? అనే విషయంలో నిజాయతీతో కూడిన చర్చ అవసరం. మంచి కంటెంట్ తో సినిమా వస్తే – జనాలు థియేటర్లకు వెళ్తారు. లేదంటే ఓటీటీలో చూసుకొందాం అనుకొంటారు. కంటెంట్ ఈజ్ కింగ్ అనుకొన్నప్పుడు దానిపై దృష్టి పెడితే మంచిది. 8 వారాల నిబంధన వల్ల కాస్తో కూస్తో ఫుట్ ఫాల్స్ పెరగొచ్చు. ఓటీటీలపై కొంతైనా నియంత్రణ సాధించవచ్చు. కాకపోతే ని నిబంధన ప్రతీ నిర్మాత తప్పకుండా పాటించేలా చేయాలి. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తే ఎన్ని నిబంధనలు తెచ్చినా లాభం లేదు.
