పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి తీరుతానని పట్టుదలగా ఉన్న మమతా బెనర్జీకి ఓవైసీ షాక్ ఇస్తున్నారు. స్థానిక ముస్లిం నేత హుమయాన్ కబీర్ పెట్టిన పార్టీతో కలిసి పొత్తు పెట్టుకుని ముస్లింల ఓటు బ్యాంకును గణనీయంగా పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది మమతా బెనర్జీకి ఓటమిని తెచ్చి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ముస్లింలు మమతా బెనర్జీ ఓటు బ్యాంక్
ఇప్పటి వరకు టీఎంసీ ఓటు బ్యాంక్‌గా మైనారిటీ ఓట్లను కొల్లగొట్టేందుకు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం , స్థానిక ముస్లిం నేత హుమాయున్ కబీర్ స్థాపించిన భారతీయ రిజర్వ్ పార్టీ చేతులు కలపడం బెంగాల్ రాజకీయాల్లో కీలక మార్పు. బెంగాల్ జనాభాలో సుమారు 30 శాతం వరకు ఉన్న ముస్లిం ఓటర్లు మమతా బెనర్జీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అయితే, ఈసారి మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినజ్‌పూర్ వంటి ముస్లిం ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ఒవైసీ-హుమాయున్ కబీర్ ద్వయం గట్టిగా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. హుమాయున్ కబీర్ గతంలో టీఎంసీలో కీలక నేతగా ఉండి, మమత తీరుపై అసంతృప్తితో బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టారు. ఇప్పుడు ఆయనకు ఒవైసీ మద్దతు తోడవడంతో, టీఎంసీకి పడే గంపగుత్త ఓట్లు చీలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇది మమతా బెనర్జీకి రాజకీయంగా పెద్ద గండంగా మారింది.
బి-టీమ్ ఆరోపణలు
ఈ పరిణామాలపై మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ సభల్లో ఆమె ఒవైసీని, హుమాయున్ కబీర్‌ను టార్గెట్ చేస్తూ.. వీరు బీజేపీకి బి-టీమ్ గా పనిచేస్తున్నారు. ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి లాభం చేకూర్చడమే వీరి లక్ష్యం అని ఘాటుగా విమర్శిస్తున్నారు. గతంలో ఎంఐఎంను ఒక హైదరాబాద్ పార్టీగా కొట్టిపారేసిన దీదీ, ఇప్పుడు హుమాయున్ కబీర్ లాంటి లోకల్ లీడర్ తో వారు జతకట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పొత్తు వల్ల కనీసం 10 నుంచి 15 శాతం ముస్లిం ఓట్లు చీలిపోయినా, అనేక నియోజకవర్గాల్లో టీఎంసీ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.
స్థానిక ముస్లిం నేతృత్వం
హుమాయున్ కబీర్ తన ప్రచారంలో ఒక కొత్త పాయింట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ముస్లింలు కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉండకూడదు, మనకంటూ ఒక స్వతంత్ర రాజకీయ నాయకత్వం ఉండాలి అని ఆయన పిలుపునిస్తున్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం ముస్లింలను కేవలం ఎన్నికలకే వాడుకుంటోందని, వారి అభివృద్ధిని విస్మరించిందని ఆయన చేస్తున్న ఆరోపణలు మైనారిటీ యువతలో కొంత మేర ప్రభావం చూపుతున్నాయి. ఒవైసీ తనదైన శైలిలో వాగ్ధాటితో ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. దీనివల్ల టీఎంసీ కేడర్ లో కొంత ఆందోళన మొదలైంది.
బీజేపీకి వరంగా మారనున్న త్రిముఖ పోటీ?
ముస్లిం ఓట్లు టీఎంసీ, ఎంఐఎం-బిఆర్పీ కూటమి మధ్య చీలితే, అది అంతిమంగా బీజేపీకి భారీ లాభాన్ని చేకూరుస్తుంది. అనేక స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొనడం వల్ల హిందూ ఓట్లు కేంద్రీకృతమై బీజేపీ అభ్యర్థులు సులభంగా గెలిచే అవకాశం ఉంటుంది. అందుకే మమతా బెనర్జీ తన ప్రచారశైలిని మార్చి, కేవలం అభివృద్ధి కంటే కూడా “ఓటు చీల్చకండి” అనే విన్నపం వైపు మళ్లుతున్నారు. మతా బెనర్జీకి ఈసారి ఎన్నికలు కేవలం బీజేపీతో పోరాటం మాత్రమే కాదు, తన సొంత కంచుకోటను కాపాడుకునే అగ్నిపరీక్షగా మారాయి. ఒవైసీ , హుమాయున్ కబీర్ ల గాలం ఎంతవరకు ఫలిస్తుందనే దానిపైనే బెంగాల్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఆధారపడి ఉంది.

