టీటీడీలో ఇటీవల ఏఈవో స్థాయి అధికారి క్రైస్తవుడిగా పట్టుబడటంతో సస్పెండ్ చేశారు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్న తర్వాత .. ఉద్యోగులందరికీ ఓ అవకాశం ఇచ్చారు. శ్రీవారి మీద నమ్మకం లేని వాళ్లు.. ఇతర మతస్తులు స్వచ్చందగా ఇతర శాఖలకు డిప్యూటేషన్ మీద వెళ్లిపోవాలని.. లేకపోతే వీఆర్ఎస్ తీసుకోవాలని ఆఫర్ ఇచ్చారు. మొత్తం పెద్దనిమిది మందిని మాత్రమే ఇలాంటి వారిని గుర్తించినట్లుగా చెప్పారు. వారికి విధులు అప్పగించడం మానేశారు. వారిపై చర్యలు ప్రాసెస్‌లో ఉన్నాయి.
అయితే చాలా మంది ఉద్యోగులు బయటపడటం లేదు. తాము మతమార్పిడి చేసుకున్నప్పటికీ ఇంకా టీటీడీలోనే విధులు నిర్వహిస్తున్నారు. బయటకు వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇదిపెద్ద సమస్యగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కనీసం వెయ్యి మంది ఇతర మతస్తులు ఉన్నారని ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ఈ ఆరోపణల్ని భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. ఆయన ఎందుకు ఖండించారో కానీ.. ఈ అన్యమతస్తుల వ్యవహారంపై ఏదో ఒకటి చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది.
సీఎంగా జగన్ ఉన్నప్పుడు సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం టీటీడీలో అన్యమతస్తులపై ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాయి. ఆయన అనుమానం ఉన్న ఉద్యోగుల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేశారు. కొంత మందిని పట్టుకున్నారు. అయితే హఠాత్తుగా జగన్ ఆయనను సీఎస్ పదవి నుంచి తప్పించారు. టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తులను పట్టుకుంటున్నారనే ఎల్వీని పంపేశారన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు మరోసారి అదే తరహాలో ప్రయత్నించాలని టీటీడీ బోర్డు భావిస్తోంది. త్వరలోనే ఉద్యోగుల ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు జరిగే అవకాశం ఉంది.