పఠాన్ కోట్ దాడులతో అతనికి సంబందమేమీ లేదుట!

పఠాన్ కోట్ దాడులకు జైష్-ఏ-మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ కుట్ర పన్నారని భారత్ ఆరోపించి, అందుకు తగిన ఆధారాలు కూడా పాకిస్తాన్ కి అందజేసింది. ఆ కుట్రకు పాల్పడినవారిని గుర్తించి వారిపై చర్యలు చేపట్టేందుకు పాక్ ప్రభుత్వం ఉన్నతాధికారులతో కూడిన ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్ర పోలీసులు మసూద్ అజహర్ ని అదుపులోకి తీసుకొని గృహ నిర్బందంలో ఉంచినట్లు వార్తలు కూడా వచ్చాయి.

కొండను త్రవ్వి ఎలుకను పట్టినట్లుగా నెలరోజుల పాటు దర్యాప్తు చేసిన సిట్ బృందం, భారత్ సమర్పించిన ఆధారాలు సరిపోవని కనుక మళ్ళీ ఇంకా ఆధారాలు ఏమయినా ఉంటే అందజేయవలసిందిగా కోరింది. అది ఏర్పాటు చేసిన సిట్ బృందం మసూద్ అజహర్ కి ఈ కుట్రతో ఎటువంటి సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని ప్రకటించినట్లు పాక్ మీడియాలో వార్తలు వచ్చేయి. పఠాన్ కోట్ పై దాడి జరిగినప్పుడు ఉన్నంత వేడి, ఉద్రిక్తతలు ఇప్పుడు లేవు కనుక మెల్లగా పాక్ తన అసలు రంగు ప్రదర్శించడం మొదలుపెట్టినట్లుంది.

ముంబై 26/11 దాడులు జరిగిన తరువాతా కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. ఆ దాడులకు అతనే కుట్ర పన్నాడని నిరూపించే ఆధారాలు భారత్ పాకిస్తాన్ కి అందజేసింది. అప్పుడు కూడా పాక్ కొన్ని రోజులు ‘దర్యాప్తు నాటకం’ ఆడిన తరువాత ఆ దాడితో అతనికి సంబంధం ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని ప్రకటించింది. అప్పటి నుండి అతను పాకిస్తాన్ లో స్వేచ్చగా తిరుగుతున్నాడు.

కొన్ని రోజుల క్రితమే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఒక బహిరంగ సభలో అతను మాట్లాడుతూ ‘మున్ముందు పఠాన్ కోట్ వంటి దాడులు భారత్ పై మళ్ళీ చేస్తామని భారత్ ని హెచ్చరించాడు. ముంబై 26/11 దాడుల సూత్రదారులలో ఒకడయిన డేవిడ్ హెడ్లీ నిన్న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ముంబై కోర్టు విచారణకి హాజరయినప్పుడు, అతను కూడా ఆ దాడులకు జైష్-ఏ-మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ కుట్ర పన్నారని కోర్టుకి తెలిపాడు.

ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా పాకిస్తాన్ అతనిపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం బహుశః అతనంటే ప్రభుత్వానికి భయమయినా అయ్యుండాలి లేదా భారత్ పై దాడులకు పాక్ ప్రభుత్వమే అతనిని ప్రోత్సహిస్తునందునయినా ఉండాలి.

అతనికి క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా భారత్ పట్ల పాక్ వైఖరిలో ఎన్నటికీ మార్పు రాదనే భారత ప్రజల అభిప్రాయాన్ని పాక్ మరొకసారి దృవీకరించినట్లయింది. పాక్ ప్రభుత్వం ఎలాగూ మసూద్ అజహర్ పై చర్యలు తీసుకోలేదు…అటువంటి ఉద్దేశ్యం కూడా లేదు కనుక ఏదో ఒకరోజు అతను మళ్ళీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రవేశించినప్పుడు భారత్ సేనలే దాడులు చేసి అతనిని మట్టుబెట్టవచ్చును. భారత్ పై దాడులకు పాల్పడేవారిని వారి ఇళ్ళలోకి దూరి మరీ వేటాడుతామని భారత రక్షణమంత్రి మనోహర్ పార్రికర్ చెప్పారు.  బహుశః దానర్ధం అదేనని భావించవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com