పహల్గం ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదని ప్రధాని మోడీ చేసిన ప్రకటన పాకిస్తాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పైకి గంభీరంగా కనిపిస్తున్నా..లోలోపల మాత్రం వణుకుతోంది. అందుకే అగ్రరాజ్యలను శరణు వేడుకుంటోంది. చైనా , రష్యాలతో చర్చలు జరిపిన పాక్ ప్రధాని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోనూ సంప్రదింపులు జరిపినట్లుగా కథనాలు వస్తున్నాయి.
భారత్ – పాక్ మధ్య యుద్ధమంటూ జరిగితే ఇరువైపులా నష్టం జరిగినా.. పాక్ ఆ నష్టం నుంచి కోలుకోవడం కష్టమే. పాక్ ప్రభుత్వం భారత్ యుద్ద ప్రకటనలకు భయపడిపోతోంది. యుద్దానికి సిధ్దమంటూనే అంతర్గతంగా రెండు దేశాల మధ్య శాంతి నెలకునేలా చొరవ తీసుకోవాలని అగ్రరాజ్యలను అభ్యర్థిస్తోంది. కానీ పాక్ ఆర్మీ చీఫ్ మాత్రం యుద్దాన్ని కోరుకుంటున్నారు.
ఇటీవల కాలంలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తీవ్ర విమర్శల పాలయ్యారు. బెలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో పాక్ సైన్యాన్ని బలూచ్ ఆర్మీ , పాక్ తాలిబాన్లు ఊచకోత కోశారు. దీనిని పాక్ సైన్యం సరిగ్గా తిప్పికోట్టలేకపోయిందని, అసిం మునీర్ రాజీనామా చేయాలని డిమాండ్ లు వచ్చాయి. దీంతో తన పదవిని కాపాడుకునేందుకు పాక్ – భారత్ మధ్య యుద్ధం రావాలని ఆయన కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
పాక్ – భారత్ మధ్య యుద్దమంటే ప్రజలు తప్పనిసరిగా భావోద్వేగానికి గురి అవుతారు. ఆయా దేశాల ప్రజలు ఆయా దేశాల సైన్యానికి మద్దతుగా ఒకటి నిలుస్తారు. ఇప్పుడు భారత్ యుద్దానికి దిగితే తన రాజీనామా డిమాండ్ తోపాటు , తన సామర్ధ్యంపై ఉన్న మరకలను ఈ యుద్ధం పక్కదోవ పట్టిస్తుందనే ఆలోచనతో అసిం ఉన్నారని టాక్ నడుస్తోంది.
అందుకే భారత్ తో యుద్ధం కావాలని పాక్ ఆర్మీ చీఫ్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ, యుద్దమంటూ జరిగితే పాక్ తిరిగి కోలుకోవడం కష్టమే.