ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు, పాక్ సైన్యం మధ్య ఇప్పుడు యుద్ధం జరుగుతోంది. దీనికి కారణం ఇద్దరూ చెప్పుకుంటున్నది ఉగ్రవాదమే. తమ దేశంలో ఉగ్రవాద దాడులు చేస్తున్న ముఠాలకు ఆప్ఘాన్ సాయం చేస్తోందని.. అందుకే దాడులు చేస్తున్నామని పాక్ చెబుతోంది. కానీ పాక్ దశాబ్దాలుగా భారత్‌లో చేస్తోందేమిటి?
భారత్‌లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నపాక్
పాకిస్థాన్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఒక విదేశాంగ విధాన సాధనంగా వాడుకుంటూ వస్తోంది. భారత్‌ను అస్థిరపరిచేందుకు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలను పెంచి పోషించిన పాక్, ఇప్పుడు తన సొంత గడ్డపై తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ రూపంలో అదే సెగను ఎదుర్కొంటోంది. ఆఫ్ఘన్ సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని సాకు చూపి దాడులు చేస్తున్న పాక్, భారత్ సరిహద్దుల్లో తాను నిర్వహిస్తున్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్ల విషయంలో మాత్రం మౌనం వహిస్తోంది. పొరుగు దేశాల్లో ఉగ్రవాదాన్ని ఎగదోయవచ్చు కానీ, తమ దేశంలో మాత్రం శాంతి ఉండాలనుకోవడం పాక్ ద్వంద్వ నీతికి పరాకాష్ట.
ఆఫ్ఘన్ గడ్డపై నుంచి పాక్ లో టెర్రర్ దాడులు చేస్తున్న టీటీపీ
మసూద్ అజర్, హఫీజ్ సయీద్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాదులకు రక్షణ కల్పించడం ద్వారా పాక్ భారత్ పై కుట్రలు చేస్తోంది. భారత్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలు, ఉగ్రవాద మూలాలపై దాడి చేసింది. అయితే అలా చేయడం తమ దేశంపై దాడి చేయడమేనని పాకిస్తాన్ రెచ్చిపోయింది. మరి ఇప్పుడు ఆఫ్ఘన్ గడ్డపై నుంచి తమ దేశంలో ఉగ్రవాద దాడులు చేస్తున్న టీటీపీ విషయంలో అదే పాలసీ ఎందుకు పాటించదు..?. ఆఫ్ఘన్ ప్రభుత్వమైనా తాలిబన్లకు ఆధారాలు ఇచ్చి .. వారిని అరెస్టు చేసుకోవచ్చు కదా !
పాక్ పాలు పోసిన సంస్థే టీటీపీ
ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థికంగా చితికిపోయి, రాజకీయంగా అస్థిరతలో ఉంది. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధ వాతావరణాన్ని కొనితెచ్చుకోవడం ఆ దేశానికి ఆత్మహత్యాసదృశ్యం. ఆఫ్ఘన్ తాలిబన్ల మద్దతుతో టీటీపీ చేస్తున్న దాడులు పాక్ భద్రతా దళాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకప్పుడు తాను నిర్మించిన జిహాదీ నెట్వర్క్ ఇప్పుడు తన నియంత్రణ తప్పి, తననే బలితీసుకుంటోంది. ఉగ్రవాదాన్ని ఒక వ్యూహాత్మక ఆయుధంగా వాడుకున్న ఏ దేశమైనా కాలక్రమేణా అదే ఉగ్రవాదానికి బలికాక తప్పదని పాక్ ప్రస్తుత స్థితి నిరూపిస్తోంది. సర్వనాశనం అయ్యే వరకూ పాక్ బయటపడటం కష్టం.
