రివ్యూ: ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

Pakka commercial Movie review

తెలుగు360 రేటింగ్ 2.5/5

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కొన్ని సౌల‌భ్యాలుంటాయి. అడ‌క్కుండా పాట‌లొచ్చేయొచ్చు. మూడున్న‌ప్పుడు ఫైటింగులు చేసుకోవ‌చ్చు. క‌థ‌కు సంబంధం లేని కామెడీ ట్రాకులు పేర్చుకోవ‌చ్చు. లాజిక్కులు మ‌ర్చిపోవొచ్చు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాకే ఇన్నుంటే.. `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` అని పేరు పెట్టుకొన్న సినిమాకి ఇంకెన్ని ఉండొచ్చు..? అని మారుతి ఫీలై ఉంటాడు. అందులో త‌ప్పులేదు. సినిమా పేరులోనే అంతా ఉంది కాబ‌ట్టి.. ఏం తీసినా, ఏం చెప్పినా, ఏం చూపించినా చ‌ల్తా అని లెక్క‌లేసుకుని ఉంటాడు. ఆ లెక్క‌ల‌తోనే గోపీచంద్ తో ఓ `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` సినిమా తీశాడు. మ‌రి… ఈ సినిమా ఎలా ఉంది? క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల్ని బాగా ఒంట‌ప‌ట్టించుకొందా, లేదా?

సూర్య నారాయ‌ణ మూర్తి (స‌త్య‌రాజ్‌) నీతికి, న్యాయానికీ, ఉద్యోగ ధ‌ర్మానికీ విలువ ఇచ్చే న్యాయ‌మూర్తి. అయితే… ఓ త‌ప్పుడు తీర్పు వ‌ల్ల ఓ అమాయ‌కురాలు బ‌లైపోయింద‌ని తెలుసుకొని, త‌న ఉద్యోగానికి రాజీనామా చేసి, ఓ కిరాణ కొట్టు పెట్టుకొని సాధార‌ణ జీవితం గ‌డుపుతుంటాడు. త‌న కొడుకే ల‌క్కీ (గోపీచంద్‌). త‌ను కూడా న‌ల్ల‌కోటు వేసుకొని లాయ‌ర్ అవుతాడు. కాక‌పోతే.. తండ్రిలా కాదు. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌. డ‌బ్బు ఇస్తే తిమ్మిని బ‌మ్మి చేసి.. నేర‌స్థుడ్ని కూడా నిర్దోషిగా నిరూపించే తెలివితేట‌లు ఉన్న‌వాడు. ఎవ‌రి వ‌ల్ల (రావు ర‌మేష్‌) అయితే… సూర్య నారాయ‌ణ మూర్తి త‌న ఉద్యోగాన్ని వ‌దులుకోవాల్సివ‌స్తుందో, అత‌ని ద‌గ్గ‌రే డ‌బ్బుల‌కు కక్కుర్తి ప‌డి… ప‌ర్స‌న‌ల్ లాయ‌ర్‌గా చేర‌తాడు ల‌క్కీ. దాంతో… ఎప్పుడో పాతికేళ్ల క్రితం విప్పేసిన న‌ల్ల‌కోటుని మ‌ళ్లీ వేసుకొని, కొడుకుకు వ్య‌తిరేకంగా న్యాయ పోరాటం చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌తాడు మూర్తి. మ‌రి ఈ తండ్రీ కొడుకుల పోరు ఏ స్థాయికి చేరుకుంది? క‌మ‌ర్షియ‌ల్ గా ఆలోచించే కొడుకు గెలిచాడా, నాన్ క‌మ‌ర్షియ‌ల్ గా ఆలోచించే నాన్న గెలిచాడా? అనేది మిగిలిన క‌థ‌.

పేరుకి త‌గ్గ‌ట్టుగానే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో అల్లుకొన్న మ‌సాలా క‌థ ఇది. ట్రీట్‌మెంట్ కూడా రెగ్యుల‌ర్ ఫార్మెట్‌లోనే సాగింది. హీరో డ‌బ్బుల కోసం ఏమైనా చేయ‌డం, చివ‌ర్లో ఉత్త‌ముడిగా మారిపోవ‌డం.. తాత‌ల నాటి ఆలోచ‌న‌. దాన్ని మారుతి మ‌ళ్లీ న‌మ్ముకొన్నాడు. మారుతి బ‌లం.. కామెడీ. దాన్ని సందుసందునా ఇరికించే ప్ర‌య‌త్నం చేశాడు. లాయ‌ర్ ఝాన్సీ (రాశీఖ‌న్నా) అలా సృష్టించుకొన్న పాత్రే. ఈ క్యారెక్ట‌ర్ ఎంత కామెడీ గా ఉంటుందంటే.. త‌నో సీరియ‌ల్ ఆర్టిస్టు. రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోలేద‌న్న కోపంతో… ద‌ర్శ‌కుడు ఆ పాత్ర‌ని మ‌ధ్య‌లోంచే చంపేసి, సీరియ‌ల్ నుంచి అర్థాంత‌రంగా తీసేస్తాడు. దాంతో ఝాన్సీ కోర్టు మెట్లు ఎక్కుతుంది. అక్క‌డ కూడా త‌న కేసు తానే వాదించుకుంటుంది. కోర్టు మొట్టికాయ‌లు వేసేస‌రికి… హీరో ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా చేరుతుంది. ఈ పాత్ర రాసుకొనేట‌ప్పుడు లాజిక్‌ని ప‌క్క‌న పెట్టి, కేవ‌లం మ్యాజిక్ పైనే దృష్టి పెట్టాడు మారుతి. కాబ‌ట్టే… అది అలా త‌యారైంది. ఝాన్సీ పాత్ర ఇంట్లో సీన్ దాదాపు 5 నిమిషాలు ఉంటుంది. ఆ సీన్ బాగానే ఉన్నా… రాను రాను.. టీవీ సీరియ‌ల్ డైలాగులు చెబుతుండ‌డంతో… అది కూడా రొటీన్ గా మారిపోయింది. మిగిలిన పాత్ర‌ల‌కంటే ఝాన్సీ పాత్ర‌నే మారుతి ఎక్కువ ప్రేమించిన‌ట్టు క‌నిపిస్తుంది. ఆ పాత్ర‌ని ఎక్క‌డ ప‌డితే అక్క‌డ‌కి తీసుకొచ్చేశారు. ఆఖ‌రికి స‌త్య‌రాజ్ చెప్పాల్సిన డైలాగులు కూడా `మీరుండండి అంకుల్‌.` అని తానే చెప్పేస్తుంది. ఇక స‌త్య‌రాజ్ లాంటి క్యారెక్ట‌ర్ ఎందుకు?

సినిమాటిక్ లిబ‌ర్టీ మారుతి చాలా తీసుకొన్నాడు. సినిమా లాంగ్వేజ్ ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వాడాడు. కొన్నిసార్లు అది వర్క‌వుట్ అయ్యింది. ఇంకొన్నిసార్లు మ‌రీ ఓవ‌ర్ అనిపిస్తుంది. `మీరు చూస్తోంది సినిమా రా.. లోప‌లికి వెళ్ల‌కండి.. పాత్ర‌ల్ని మ‌రీ ఓన్ చేసేసుకోండి..` అంటూ సినిమాని ఫాలో కాకుండా ఆ డైలాగులు, ఆ ట్రీట్‌మెంట్ అడ్డుకొన్న‌ట్టు అనిపిస్తుంది. మొత్తంగా చూస్తే… చాలా పేల‌వ‌మైన క‌థ‌.. చాలా రొటీన్ ట్రీట్‌మెంట్. మ‌ధ్య‌మ‌ధ్య‌లో కొన్ని క‌మ‌ర్షియ‌ల్ మెరుపులు జోడించ‌డం వ‌ల్ల‌.. మారుతి టైపు కామెడీ కొంత‌లో కొంత వ‌ర్క‌వుట్ అవ్వ‌డం వ‌ల్ల‌.. అక్క‌డ‌క్క‌డ పాసైపోతూ ఉంటుంది. ముందు నుంచీ చివ‌రి వ‌ర‌కూ హీరోకి ఎద‌రంటూ లేక‌పోవ‌డంతో.. క‌థంతా ఓ సైడే న‌డుస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. చివ‌రికి స‌త్య‌రాజ్ న‌ల్ల‌కోటు వేసుకొన్న త‌ర‌వాత కూడా… గోపీచంద్ పాత్ర ని త‌గ్గించ‌డానికి మారుతి భ‌య‌ప‌డ్డాడు. దాంతో సినిమా వ‌న్ సైడ్ వార్ అయిపోయింది. ఇదంతా ల‌క్కీ ఎందుకు చేశాడ‌నేదానికి ఓ ఫ్లాష్ బ్యాక్ జోడించారు. అది అన‌వ‌స‌ర‌మే అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన త‌ర‌వాత క‌థై పోవాలి. కానీ.. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ని తీసుకొచ్చి సినిమాని మ‌రో 5 నిమిషాలు పొడిగించారు. అవే డైలాగులు అంత‌కు ముందు సీన్‌లో గోపీచంద్ చెబితే స‌రిపోయేది క‌దా… అనిపిస్తుంది.

గోపీచంద్ లుక్ బాగుంది. త‌ను చాలా స్టైలీష్‌గా ఉన్నాడు. నాలుగేళ్లు త‌గ్గిన ఫీలింగ్ క‌నిపిస్తోంది. త‌ను కూడా ఇలాంటి పాత్ర‌ల్ని అల‌లీల‌గా, ఎలాంటి క‌ష్టం లేకుండా చేసుకుపోగ‌ల‌డు. అందుకే ల‌క్కీగా త‌నేమాత్రం క‌ష్ట‌ప‌డ‌లేదు. రాశీఖ‌న్నాకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ‌. త‌న కామెడీ టైమింగ్ బాగుంది. కాక‌పోతే… ప్ర‌తీ సీన్‌లోనూ ఇంచుమించుగా అవే డైలాగుల్ని రిపీట్ చేస్తున్న‌ట్టు అనిపించింది. స‌త్య‌రాజ్ పాత్ర‌ని ఇంకాస్త బ‌లంగా రాసుకోవాల్సింది. రావు ర‌మేష్ గెట‌ప్ మారింది త‌ప్ప‌.. ఇది వ‌ర‌కటి సినిమాల్లోని యాక్టింగే.. ఇక్క‌డ కూడా. అయితే రావు ర‌మేష్ టైమింగ్ వ‌ల్లే కొన్ని సీన్స్ లో డైలాగులు వ‌ర్క‌వుట్ అయ్యాయి. స‌ప్త‌గిరి మ‌రోసారి ఓవ‌ర్ చేశాడు. అజయ్ ఘోష్ – రావు ర‌మేష్ ల మ‌ధ్య ఎపిసోడ్ ఓకే అనిపిస్తుంది.

మారుతి చాలా సాదా సీదా క‌థ రాసుకొన్నాడు. ట్రీట్ మెంట్ కొత్త‌గా లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌. త‌న టైపు కామెడీ కూడా వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు. అయితే.. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఫైట్ల మీద సెటైర్ వేస్తూ, తీసిన ఫైట్ బాగుంది. అయితే ఇలాంటి ఎలిమెంట్లు బిట్లు బిట్లుగా చూసుకోవ‌డానికి బాగుంటాయి త‌ప్ప‌.. సినిమా నిల‌బ‌డాలంటే క‌థే ముఖ్యం. ఈ విష‌యాన్ని మారుతి మ‌ర్చిపోయాడు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. క‌ల‌ర్ టోన్ బాగా కుదిరింది. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ బీజియం… చాలాసార్లు వినిపించి విసుగు తెప్పించారు.ఈ సినిమా క్లైమాక్స్‌లో రావు ర‌మేష్ తో ఓ డైలాగ్ చెప్పిచాడు ద‌ర్శ‌కుడు. ‘ఈ సినిమా అయ్యాక నేనే గుర్తుకు రావాలి.. రివ్యూల్లో నా పెర్‌ఫార్మెన్స్ గురించే రాయాలి‘ అని నాలుగైదు వెబ్ సైట్ల పేర్లు చెప్పాడు. అందులో తెలుగు360 పేరు కూడా ఉంద‌నుకోండి. అలా చెప్పినా.. ఎవ‌రి పెర్‌ఫార్మెన్సు గురించీ, ఏ టెక్నిషియ‌ను ప్ర‌తిభ గురించీ గొప్పగా రాయ‌లేనంత‌గా ఉంది.

జ‌నాలు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్ని ఆద‌రిస్తున్నారంటే… అందులో ఫైట్లు, పాట‌లు, కామెడీ స్కిట్లు న‌చ్చి కాదు. వీట‌న్నింటినీ క‌లిపే ఓ క‌థ ఉండి తీరుతుంది. లేదంటే ఏ సినిమా ఆడ‌దు. ఆ క‌థే… ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ లో పేల‌వంగా త‌యారైంది.అక్కడక్కడా కామెడీ కుదిరినా , ఓవరాల్ గా రొటీన్ కమర్షియల్ చిత్రం గా మిగిలిపోతుంది.

తెలుగు360 రేటింగ్ 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డిస్నీప్లస్ హాట్ స్టార్ లో “వారియర్” సంచలనం!!

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పుడు ఆడియన్స్ ని ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఉర్రూతలూగిస్తోంది. దాని పేరు "వారియర్". ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని రెండు క్యారక్టర్లతో సంచలనం సృష్టించారు. హీరో...

పది లక్షల పెన్షన్లు సరే – డబ్బులెక్కడివి !?

కేంద్రం సహకరించండం లేదు. ఖర్చులకు తగ్గట్లుగా రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు. ఆదాయం ఎలా తెచ్చుకోవాలి అన్న ఎజెండాగా కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. ఐదు...

ఎడిటర్స్ కామెంట్స్ : దేశభక్తి రాజకీయ సరుకు కాదు !

"దేశభక్తి అనేది జెండా ఊపడంలో కాదు, మన దేశం ధర్మబద్ధంగా మరియు బలంగా ఉండాలని ప్రయత్నించడంలో ఉంటుంది." .. నూట యాభై ఏళ్ల కిందట బ్రిటన్‌కు చెందిన జేమ్స్ బ్రిస్ అనే పెద్దాయన...

పాలాభిషేకాలకు మరో ఫార్ములా కనిపెట్టిన ఏపీ సర్కార్ !

కార్పొరేషన్లు పెట్టి బీసీ , ఎస్సీ, ఎస్టీ, కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య సహా అన్ని కులాలకు పైసా సాయం చేయకపోగా.. అందరికీ ఇస్తున్న పథకాలు లెక్కలు చెబుతూ బురిడీ కొట్టిస్తున్న వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close