అవార్డ్ సినిమా అంటే దర్శక-నిర్మాతల్లో ఒకరకమైన భయం ఉంటుంది. పేరు తప్పా డబ్బులు రావనే భయం. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది. సినిమా బావుంది. మంచి ప్రయతం.. ఈ తరహాలో రివ్యూలు వస్తే మేకర్స్‌లో ఎక్కడో టెన్షన్ మొదలౌతుంది. సినిమా కేవలం అవార్డ్‌కి అంకితమైపోతుందనే దిగులు. ఇలాంటి భయం ‘పరదా’ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగులో కనిపించింది. అనుపమ పరమేశ్వరన్ టైటిల్ రోల్లో చేసిన ఫీమేల్ సెంట్రిక్ సినిమా. అనుష్క, నయనతార లాంటి హీరోయిన్స్‌కి తప్పితే ఈ జోనర్ మిగతావారికి వర్క్ అవుట్ కాలేదు.
‘పరదా’ ప్రమోషనల్ కంటెంట్ మాత్రం బావుంది. మనాలి, ధర్మశాలలాంటి రియల్ లొకేషన్స్‌లో సినిమా షూట్ చేశారు. కంటెంట్ చూస్తే ఖచ్చితంగా ఏదో విషయం ఉన్నట్లుగానే ఉంది. ఇలాంటి సినిమాలకు అవార్డులు రావడం రివాజు. ఇదే విషయం దర్శకుడు ప్రవీణ్ దగ్గర ప్రస్తావిస్తే… “సినిమాకు అవార్డులు వస్తే లాభం లేదు. డబ్బులు రావాలి. దయచేసి ఇలాంటి సినిమాని కేవలం అవార్డులకు పరిమితం చేసి ఊరుకోవద్దు. అందరూ థియేటర్స్‌లో చూడండి. ఇలాంటి సినిమాలకు డబ్బులు వస్తే ఈ జోనర్లో మరిన్ని సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు వస్తారు” అని చెప్పుకొచ్చాడు ప్రవీణ్. ఆగస్ట్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.