ఆగస్టు నెలంతా టాలీవుడ్ కొత్త చిత్రాలతో కళకళలాడబోతోంది. ప్రతీవారం కొత్త పోస్టర్లతో థియేటర్లు తళతళలాడుతూనే ఉన్నాయి. గత వారం కూలీ, వార్ 2 ఒకేసారి విడుదలైన సంగతి తెలిసిందే. టాక్ ఎలాగున్నా – పెద్ద హీరోల సినిమాలు కావడంతో వీకెండ్ వరకూ వసూళ్లతో హోరెత్తింది. ఈవారం కూడా బాక్సాఫీసు ఇదే జోరు కొనసాగించే అవకాశం ఉంది. ఆగస్టు 22 చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగాస్టార్ బర్త్ డేని టాలీవుడ్ కూడా సెలబ్రేట్ చేసుకొంటోంది. మూడు నాలుగు చిన్న సినిమాలు ఈవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిలో పరదా, మేఘాలు చెప్పిన ప్రేమకథ, బార్బరిక్ చిత్రాలు ఉన్నాయి.
ఈ మూడింటిలో ‘పరదా’ కాస్త స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన చిత్రమిది. తన కెరీర్లో ఇదే బెస్ట్ ఫిల్మ్ అని ఢంకాబనాయించి మరీ చెబుతోంది అనుపమ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఈ సినిమా ఓ మార్గ దర్శకం కానుందని దర్శకుడు అంటున్నాడు. టీజర్, ట్రైలర్లలో బలమైన కథావస్తువు ఉందన్న సంగతి అర్థం అవుతోంది.
సత్యరాజ్, ఉదయభాను ప్రధాన పాత్రలు పోషించిన ‘బార్బరిక్’ కూడా ఈవారమే వస్తోంది. ‘మహారాజా’ జోనర్లో సాగే సినిమా ఇది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఉదయభాను పాత్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. థ్రిల్లర్ చిత్రాలకు మంచి గిరాకీ ఉంది. భాషతో సంబంధం లేకుండా అందరూ ఆదరించే జోనర్ ఇది. బార్బరిక్ కూడా అదే జోనర్ లో రూపొందిన సినిమానే. ఈ రెండు సినిమాలతో పాటుగా ‘మేఘాలు చెప్పిన ప్రేమకథ’ అనే మరో చిన్న సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఫీల్ గుడ్ ఎమోషన్ని తీసుకొస్తున్నాయి. వీటితో పాటుగా ‘వార్ 2’, ‘కూలీ’ సెకండ్ వీక్ రన్ ఎలా కాపాడుకొంటాయన్నది ఆసక్తికరం. ఎలా చూసినా ఈ వారం కూడా బాక్సాఫీసు దగ్గర సందడి కనిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.