వైసీపీ హయాంలో పరకామణిలో రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి చేసిన దొంగతనం విషయంలో జరిగిన గుట్టు అంతా బయటకు వస్తోంది. పట్టుబడిన తర్వాత అతని ఆస్తులను వైసీపీ నేతలు, కొంత మంది టీటీడీ ఉన్నతాధికారులు పంచుకున్నారు. తమ బినామీ పేర్లపై బదిలీ చేయించుకున్నారు. చాలా స్వల్ప మొత్తం మాత్రమే టీటీడీ పేర రాయించారు. ఇప్పుడీ అంశం వెలుగులోకి రావడంతో సంచలనాత్మకవుతోంది.
లోక్ అదాలత్ రాజీని నిలిపివేసిన హైకోర్టు
రవికుమార్ వైసీపీ హయాంలో దొంగతనం చేసి దొరికిపోయాడు. కేసు పెట్టారు. దొంగతనం కేసును లోక్ అదాలత్లో రాజీ చేశారు. ఇలా ఎలా చేశారని హైకోర్టు కూడా ఆశ్చర్యపోయింది. రికార్డులన్నీ సీజ్ చేయాలని ఆదేశించింది. ఈ రాజీని నిలిపివేసింది. దీంతో మళ్లీ విచారణ ప్రారంభమవనుంది. లోక్ అదాలత్ కు కేసు ఎలా వెళ్లింది..రాజీ ఎలా చేసుకున్నారో .. మొత్తం ఉన్నతాధికారి ఒకరు తన వాంగ్మూలాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన అప్రూవల్ గా మారారని ఇందులో నిందితులు బయటపడబోతున్నారని స్పష్టమయింది.
వంద కోట్ల ఆస్తులు పంచుకున్న వైసీపీ నేతలు, అధికారులు
రవికుమార్ దొంగతనం చేస్తూ దొరికాడు. కేసు లేకుండా చేసేందుకు కొన్ని ఆస్తులు టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా రాయించి.. మిగతా ఆస్తులన్నింటినీ వైసీపీ నేతలు, అధికారులు పంచుకున్నారు. దాదాపుగా వంద కోట్ల ఆస్తులు తమ బినామీలపై రాయించుకున్నారని తేలింది. వారెవరో .. ఎవరెవరి పేర్ల మీద ఆస్తులు రాయించుకున్నారో ఇప్పటికే మొత్తం ఆరా తీశారు. లెక్కలన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు హైకోర్టు లోక్ అదాలత్ రాజీని నిలిపివేయడంతో అందరి జాతకాలు బయటకు తీయనున్నారు.
దేవుడి సొమ్ముపై కనీస భయం లేదా ?
దేవుడి సొమ్ము అని తెలిస్తే ఒక్క రూపాయి కూడా ముట్టుకోరు భక్తులు. కానీ వైసీపీ హయాంలో టీటీడీ పాలనను చేతుల్లోకి తీసుకున్నవారంతా సూడో భక్తులు. వారికి కేవలం రాజకీయ అధికారం కోసమే భక్తి ఉంటుంది. దోపిడీ కోసమే భక్తి ఉంటుంది. దేవుడి సొమ్మును ఏ మాత్రం భయం లేకుండా దోచుకున్నారు. ఫలితం అనుభవించబోతున్నారు.


