భారత్ లో కూడా ఉగ్రవాదులున్నారు: ముషరఫ్

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ నిన్న పాక్ మీడియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “పఠాన్ కోట్ పై ఉగ్రవాదుల దాడి జరగడం దురదృష్టకరమయిన విషయమే. దానిని నేను కూడా ఖండిస్తున్నాను. కానీ దానిపై భారత్ మరీ అతిగా స్పందించడం మంచిది కాదని నేను భావిస్తున్నాను. భారత్, పాక్ రెండు దేశాలు కూడా ఉగ్రవాద పీడిత దేశాలే. పాకిస్తాన్ లోనే కాదు…భారత్ లో కూడా ఉగ్రవాదులున్నారు. కానీ భారత్ లో ఎక్కడ ఎవరు దాడి చేసిన వెంటనే అందరూ పాకిస్తాన్ వైపు వేలెత్తి చూపిస్తుంటారు. పాక్ కూడా భారత్ లాగే ఉగ్రవాద పీడిత దేశమే. కనుక పఠాన్ కోట్ పై జరిగిన దాడి కారణంగా పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకురావాలనుకోవడం సరికాదు,” అని అన్నారు.

ముషరఫ్ తన ఇంటర్వ్యూని కొనసాగిస్తూ “భారత్ తో పోలిస్తే మాది చిన్న దేశమే కావచ్చును. కానీ దానిని అలుసుగా తీసుకొని మా అభిప్రాయాలకు విలువనీయకుండా ఒత్తిడి తేవాలనే భారత్ వైఖరిని నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తుంటాను. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారత్ లో చాలా మంది ముస్లింలలో అసంతృప్తి పెరిగింది. అదే వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో భారత్-పాక్ సంబంధాలు కూడా చాలా బలపడ్డాయి. ఎందుకంటే ఆయన ప్రయత్నాలలో చలా నిజాయితీ, నిబద్దత ఉంది కనుక. వాజ్ పేయి సాహెబ్ తరువాత డా.మన్మోహన్ సింగ్ సాహెబ్ కూడా పాకిస్తాన్ తో చాలా స్నేహపూర్వకంగా వ్యవహరించేవారు. వారిరువురూ ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ఇరుగు పొరుగు దేశాలతో వ్యవహరించేవారు. నిజమయిన నాయకుడికి పట్టువిడుపులు తెలిసి ఉండాలని నేను భావిస్తాను. కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత అటువంటి స్నేహపూర్వక వైఖరి భారత ప్రభుత్వంలో కనిపించడం లేదు నాకు. ఆయనలో మాపై పెత్తనం చేయాలనే ధోరణే ఎక్కువగా కనబడుతోంది. డిల్లీ, బీహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడం గమనిస్తే భారత ప్రజలలో క్రమంగా ఆయన పట్ల వ్యతిరేకత పెరుగుతోందని అర్ధమవుతోంది,” అని అన్నారు.

మోడీ లాహోర్ పర్యటనపై కూడా ముషారఫ్ పెదవి విరిచారు. “మోడీ కాబూల్ లో ఉన్నప్పుడు పాకిస్తాన్ న్ని తీవ్రంగా విమర్శించారు. వెంటనే పాకిస్తాన్ వచ్చి నవాజ్ షరీఫ్ తో కలిసి ఫోటోలు దిగి హడావుడి చేసారు. దానిని ఏవిధంగా చూడాలి మేము? ఆయన మీడియా దృష్టిని ఆకర్షించి ప్రచారం పొందాలనే ఉద్దేశ్యంతోనే లాహోర్ వచ్చినట్లుంది తప్ప నిజంగా పాక్ పై సదుద్దేశ్యం కలిగి మా దేశంతో సంబంధాలు బలపరుచుకోవాలనే ఉద్దేశ్యంతో వచ్చినట్లు నేను భావించడం లేదు. కనుక నా దృష్టిలో మోడీ లాహోర్ పర్యటనకి ఏ మాత్రం ప్రాముఖ్యత లేదు,” అని ముషారఫ్ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com