రివ్యూ: పఠాన్‌

షారుఖ్‌ ఖాన్‌.. బాలీవుడ్ బాద్షా. ఇది రైమింగ్ బావుంది పెట్టిన టైటిల్ కాదు. ఆయన సాధించిన విజయాలు తెచ్చిపెట్టిన టైటిల్. అయితే గత కొన్నేళ్ళుగా ఇది కేవలం టైటిల్ గానే మిగిలిపోయింది. షారుఖ్‌కి మునపటి విజయాలు లేవు. గత నాలుగేళ్ళుగా ఆయన నుంచి సినిమానే రాలేదు. ఇలాంటి నేపధ్యంలో భారీ అంచనాలతో బోలెడు హంగులతో థియేటర్లో అడుగుపెట్టింది పఠాన్‌. ఐమ్యాక్స్‌ కెమెరాలతో చిత్రీకరించిన తొలి హిందీ చిత్రం, ఐ. సి. ఇ థియేటర్‌ ఫార్మాట్‌లో వస్తున్న ఫస్ట్‌ ఇండియన్‌ మూవీ, షారుక్ కెరీర్ లోనే హయ్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్ రాబట్టుకున్న చిత్రం.. ఇలా బోలెడు అంచనాలతో వచ్చిన పఠాన్‌.. ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి ఇచ్చింది ? పఠాన్‌ షారుఖ్ కి పూర్వపు ప్రభని తీసుకొచ్చిందా ?

2019లో ఆర్టికల్ 370 ఎత్తివేయడంతో పాకిస్తాన్ ఆర్మీ ఇండియాపై ఓ భారీ కుట్ర పన్నుతుంది. ఔట్‌ఫిట్‌ ఎక్స్‌ అనే ప్రైవేట్‌ ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపి భారతదేశాన్ని నాశనం చేయడానికి వ్యూహం రచిస్తుంది. ఔట్‌ఫిట్‌ సంస్థ నాయకుడు జిమ్‌ (జాన్‌ అబ్రహాం). జిమ్ ఒకప్పుడు దేశభక్తి గల ఇండియన్ ‘రా’ ఏజెంట్. కానీ తనకు ఎదురైన కొన్ని పరిస్థితుల కారణంగా డబ్బు కోసం ఏదైనా చేసే ఉగ్రవాదిగా మారిపోతాడు. చికెన్ పాక్స్ వైరస్ ని మ్యూటేట్ చేసి భారతదేశంలో ఒక నగరం మొత్తాన్ని సర్వనాశనం చేసే వైరస్ ని తయారు చేస్తాడు. జిమ్ కుట్రని అడ్డుకోవడానికి ‘రా’ ఏజెంట్‌ అయిన పఠాన్‌ (షారుఖ్‌) రంగంలోకి దిగుతాడు. మరి ఈ మిషన్ ఎలా సాగింది ? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు ?ఐఎస్ఐ ఏజెంట్ రుబినా (దీపికా పదుకొన్) ఈ ఆపరేషన్‌ లోకి ఎలా వస్తుంది ? జిమ్ ఎందుకు టెర్రరిస్ట్ గా మారాడు ? చివరికి మిషన్ ఏమైయింది ? అనేది మిగతా కథ.

దేశభక్తి నేపధ్యంలో సాగే స్పై థ్రిల్లర్ ఇది. ఇలాంటి సినిమా కథలకు ఒక కామన్ సెటప్ వుంటుంది. దేశానికి ఒక ఆపద పొంచి వుంటుంది. రా ఏజెంట్ అయిన కథానాయకుడు ఆ ఆపద నుంచి కాపాడుతాడు. పఠాన్‌ కథ కూడా అంటే. అయితే ఇలాంటి కథల సక్సెస్ సీక్రెట్ ట్రీట్ మెంట్ లో వుంటుంది. కథ మొదటి రెండు సీన్స్ లోనే తెలిసిపోయినప్పుడు తర్వాత చూపించే అద్భుతాలపైనే ప్రేక్షకుడి ద్రుష్టి నిలపాలి. ఈ విషయంలో దర్శకుడు సిదార్ద్ ఆనంద్ కొంత మేరకు విజయం సాధించాడు. ప్రతి యాక్షన్ సీన్ ని ఒక క్లైమాక్స్ ఫైట్ లానే చూపించాడు. పఠాన్‌ గా షారుక్ ఖాన్ ఎంట్రీలో వచ్చిన ఫైట్ ఒక క్లైమాక్స్ లానే వుంటుంది. తర్వాత దుబాయిలో జిమ్ తో పఠాన్‌ చేసే యాక్షన్ కూడా హాలీవుడ్ స్థాయిలో గాల్లో చిత్రీకరించడం లాజిక్ కి దూరంగా ఉన్నప్పటికీ షారుఖ్‌, జాన్ అబ్రహం ల ఇమేజ్ తో ఆ యాక్షన్ సీన్స్ పాసైపోతాయి. తర్వాత వచ్చే భేషరం పాట కూడా యాక్షన్ కి కావాల్సిన గ్లామర్ ని యాడ్ చేస్తుంది. షారుఖ్‌, రుబినా కలసి జర్మనీలో చేపట్టిన ‘రక్తబీజ్’ మిషన్ కూడా ఆసక్తికరంగానే వుంటుంది. దీపిక పాత్ర రూపంలో మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బాంగ్ వేయడం కూడా సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది.

కథ అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ వచ్చినప్పటికీ కళ్ళు చెదిరిపోయే యాక్షన్ సీన్స్ తో ఎక్కడా బోర్ కొట్టించకుండా ఇంటర్వెల్ వరకూ లాక్కొచ్చిన దర్శకుడు ఇంటర్ వెల్ తర్వాత కూడా అదే యాక్షన్ పై ఆదారపడ్డాడు. సల్మాన్ ఖాన్ రూపంలో ఒక స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చాడు. సల్మాన్, షారుఖ్ కలసి చేసిన ఫైట్ ఫ్యాన్స్ కి పండగలా వుంటుంది. ఎక్ థా టైగర్ సినిమా రూపంలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ఏజెంట్ గా వున్నాడు కాబట్టి ఈ కథలోకి ఆయన ఎంట్రీ సహజంగానే అనిపిస్తుంది. క్లైమాక్స్ చేరుకోవడానికి ముందు కాస్త సాగాదీత ధోరణి కథనంలో చోటు చేసుకుంటుంది. దీపిక పాత్రని షారుఖ్ గుడ్డిగా నమ్మకం, తర్వాత ఆ పాత్రలో సడన్ గా మార్పు వచ్చేసినట్లు చూపించడం క్లూలెస్ గా వుంటుంది. పైగా ఇందులో పఠాన్, రుబినా, జిమ్.. ఇలా మూడు పాత్రలకు బ్యాక్ స్టొరీలు వుంటాయి. అవి రొటీన్ గానే వుంటాయి తప్పితే అందులో పెద్ద కొత్తదనం వుండదు. అయితే వైరస్ కోసం జరిగే పోరాటంతో యాక్షన్ మళ్ళీ ట్రాక్ పైకి వస్తుంది. మంచు కొండల్లో తీసిన ఫైట్ మార్వలెస్ గా వుంటుంది. ల్యాబ్ లో జరిగిన ప్రమాదం కథకు ఎమోషనల్ యాంగిల్ తీసుకొస్తుంది. ఇక క్లైమాక్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్ కూడా నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. ఊహించినట్లే పఠాన్, జిమ్ ని అంతం చేసి పెను ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడటంతో ఈ కథకు శుభం కార్డు పడుతుంది. చివర్లో సల్మాన్ షారుఖ్ ల సీన్ ఫ్యాన్స్ కి బోనస్.

సినిమా పట్ల షారుఖ్ ఖాన్ కి వున్నా అంకిత భావానికి పఠాన్ అద్దం పడుతుంది. గూగుల్ లో షారుఖ్ వయసు 57ని చూపిస్తుంది. కానీ తెరపై ఆయన్ని చూస్తుంటే 37లా కనిపిస్తున్నాడు. బాడీలో ఎక్కడా ఫ్యాట్ లేకుండా ఫిజిక్ ని మెంటైన్ చేయడం ఆయనకే చెల్లింది. అంత ఫిట్ గా వున్నారు కాబట్టే ఇలాంటి యాక్షన్ సినిమా కుదిరింది. షారుఖ్ నటన గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పఠాన్ పాత్రని దాటి బయటికి రాలేదు. దీపిక పాత్రని చక్కగా వాడుకున్నాడు దర్శకుడు. గ్లామర్ తో పాటు యాక్షన్ ని కూడా చూపించే అవకాశం ఇచ్చింది రుబినా పాత్ర. జిమ్ పాత్రలో జాన్ అబ్రహం ఆకట్టుకున్నాడు. స్టయిలీష్ విలన్ గా కనిపించాడు. షారుఖ్ కి ధీటుగా నిలబడ్డాడు. సల్మాన్ ఖాన్ ఒక్క ఫైట్ లో కనిపించినా.. వున్న కాసేపు అదరగొట్టాడు. డింపుల్ కపాడియా కి మంచి పాత్ర దక్కింది, మిగతా పాత్రలు పరిధిమేర నటించారు.

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. భారీ నిర్మాణ విలువలు తెరపై కనిపించాయి. యాక్షన్ సీన్స్ ని నెక్స్ట్ లెవల్ లో డిజైన్ చేశారు. యాక్షన్ ని ఇష్టపడేవారికి ఈ సినిమా మరింత నచ్చుతుంది. భేషరం పాట ఆకట్టుకుంటుంది. నేపధ్య సంగీతం బావుంది. జిమ్ పాత్రకి ఇచ్చిన బీజీఎం ఎఫెక్టివ్ గా వుంటుంది. కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. రిచ్ విలువల్స్ రాబట్టుకున్నారు. సినిమా కోసం పెట్టిన ఖర్చు తెరపై కనిపించింది. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కథ పరంగా నవ్యత చూపించలేదు కానీ టేకింగ్ తో కట్టిపడేశాడు. ప్రేక్షకులకు ఊహకు అందిపోయే ఓ కథని తీసుకొని ఊహకందని విజువల్స్, యాక్షన్ సీన్స్ తో పఠాన్ ని పర్ఫెక్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ గా మలిచాడు.

ఫినిషింగ్ టచ్ : పటాక్లు పేలాయ్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close