రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ ను పట్నాలో పోలీసులు అరెస్టు చేశారు. అయితే అక్కడి కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించింది. పదుల సార్లు నోటీసులు జారీ చేసినా రాలేదని .. విచారణకు సహకరించలేదని ఆధారాలు సమర్పించినా కోర్టు సంతృప్తి చెందలేదు. బీహార్ లో ఎలా ఉంటుందో పోలీసులకు తెలుసు కాబట్టి హైకోర్టును ఆశ్రయించనున్నారు. అయితే రాజ్యాంగాన్ని చదువుకుని.. చట్టాలను ఔపాలన పట్టిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్.. ఇలాంటి ప్రయత్నాల ద్వారా కేసు నుంచి తప్పించుకోగలరా అన్నదే ప్రశ్న.
తాము చెప్పినట్లుగా చేసే వారిని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వారితో అసాంఘిక పనులు చేయించిన జగన్ రెడ్డి ఇప్పుడు సేఫ్‌గానే ఉన్నారు. కానీ ఆ పనులు చేసిన వారు మాత్రం బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్.. జగన్ హయాంలో సీఐడీలో ఉండి చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం మారుతుందని తెలియగానే ఆయన తన సొంత క్యాడర్ కు వెళ్లిపోయారు. అప్పటి నుండి ఏపీ వైపు రాలేదు.
తనను కస్టోడియల్ టార్చర్ చేసిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని పోరాడుతున్న రఘురామకృష్ణరాజు కేసులో ఆయనపై కేసు నమోదు అయింది. ఆయన విచారణకు రావాలని ఎన్నో సార్లు నోటీసులు ఇచ్చారు. ప్రతీ సారి ఏదో ఓ కారణం చెప్పి తప్పించుకున్నారు. తర్వాత అసలు స్పందించడం మానేశారు. తప్పనిసరిగా పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
తన అరెస్టుపై ముందుగానే సమాచారం ఉండటంతో సునీల్ నాయక్ ఉన్నతాధికారుల సాయంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. సాధారణంగా ట్రాన్సిట్ వారెంట్ కు కోర్టులు ఎలాంటి అభ్యంతరాలు చెప్పవు. కానీ పట్నా కోర్టు మాత్రం 30 రోజుల పాటు చర్యలొద్దని ఆదేశించింది. పోలీసులు పట్నా హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇలా రచ్చ చేసి సునీల్ నాయక్ తప్పించుకోవడం సాధ్యం కాదని ..పోలీసుగానే పని చేసిన ఆయనకు తెలియకుండా ఉండదు. ఇలా చేయడం వల్ల ఆయన ఇంకా ఇంకా ఇబ్బందుల్లో కూరుకుపోతారు.
సునీల్ నాయక్ .. జగన్ మోహన్ రెడ్డి కోసమో…. మరొకరి కోసమో ఏపీకి వచ్చి అడ్డగోలు పనులు చేశారు. ఆయన చేసినవి చిన్నవి కాదు. బీహార్ లో కూడా అలాంటి ఘోరమైన పనులు ఐపీఎస్‌లు చేయరు. ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఇవి ఇంకా పెద్దవి అవుతాయి. చట్టం చేతులు చాలా పొడవని.. వాటిని అమలు చేసే బాధ్యతల్లో ఉన్న ఆయనకు తెలియకపోవడం విచిత్రం. సునీల్ నాయక్ .. విచారణకు సహకరించనప్పుడే ఆయన నిండా కూరుకుపోయారు.
