కౌరవసేనలో పాండవ పక్షపాతి ఎవరు? అని ప్రశ్నిస్తే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వథామ అంటూ అందరూ టకటకా ఓ అరడజను పేర్లు చెప్పేస్తారు. కానీ నిజానికి దుర్యోధనుడిని అన్ని విధాల చెడగొట్టి యుద్దానికి ప్రేరేపించి అతనిని, అతని సోదరులని, అపారమయిన కౌరవ సైన్యాన్ని, కురు రాజ్యాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరంటే శకుని మామ అనే చెప్పవచ్చును. అతను కౌరవుల పక్షాన్నే ఉంటూ వారికే ఎసరు పెట్టి చివరికి పాండవులకు రాజ్యం కట్టబెట్టాడు.
ఇప్పుడు తెదేపా ఎంపీ జేసి దివాకర్ రెడ్డి తీరు చూస్తుంటే అచ్చం ఆ శకుని మామలాగే ఉంది. ఆయన పేరుకి తెలుగుదేశం పార్టీ సభ్యుడు, ఎంపీ అయినప్పటికీ, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, మీడియా స్టేట్మెంట్లు ప్రతిపక్షాలకు మంచి ఆయుధాలు అందిస్తున్నాయి. తేదేపాకు జవాబు చెప్పుకోలేని పరిస్థితి కల్పిస్తున్నాయి. రెండుమూడు రోజుల క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ “ప్రత్యేకహోదా రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చాలా కాలం క్రితమే తెలుసని అందుకే ప్యాకేజీల గురించి మాట్లాడుతున్నారని” ఇంటిగుట్టు బయటపెట్టేశారు. అది పట్టుకొని ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడుతో ఒక ఆటాడేసుకొన్నాయి.
మళ్ళీ ఈరోజు జేసీ మరో బాంబు ప్రేల్చాడు. చంద్రబాబు నాయుడు పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి రాయలసీమకి నీళ్ళందిస్తానని చెపుతున్నా తనకు ఏ మాత్రం నమ్మకం లేదని అన్నారు. దానివలన మహా అయితే కృష్ణా డెల్టాకు నీళ్ళివ్వగలరేమో గానీ రాయలసీమకు నీళ్లోస్తాయనే నమ్మకం తనకు లేదని అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు రాయలసీమకు నీళ్ళు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమని చెప్పారు.
ఈ ప్రాజెక్టు వలన రాయలసీమకు నీళ్ళు అందించడం అసంభవమని, ఇది కేవలం తెదేపా కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకు చేసుకొన్న ఏర్పాటు మాత్రమేనని రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ముఖ్యంగా వైకాపా గట్టిగా వాదిస్తోంది. తెదేపా నేతలందరూ అంతే ధీటుగా వైకాపా విమర్శలకి బదులిచ్చారు. తమ ప్రభుత్వం రాయలసీమకు నీళ్ళు అందిస్తే ఆ ప్రాంతంలో వైకాపా ప్రజాధారణ కోల్పోతుందని భయపడుతోందని అందుకే రాయలసీమకు నీళ్ళు అందించే ఈ పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు జగన్మోహన్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని ఎదురుదాడి చేసి అతని నోరు మూయించగలిగారు. కానీ ఇప్పుడు స్వంత పార్టీకే చెందిన జేసీ దివాకర్ రెడ్డి ఈ ప్రాజెక్టు వలన రాయలసీమకు నీళ్ళు రావని చెప్పడంతో తెదేపాకు ఎలా సమర్దించుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.