సెటైర్: నిజాం ఆత్మ లేచింది

అమావాస్య, అర్థరాత్రి. గోరీల మధ్య ఎండుటాకుల శబ్దంతప్ప మరేదీ వినబడటంలేదు. అంతలో పెద్దమెరుపు..ఫటాలున ఒక గోరీని తాకిందది. అంతే ఆ గోరీ గోడలు విచ్చుకున్నాయి. అందులోనుంచి ఆత్మపైకిలేచింది. దీంతోపాటు దగ్గర్లోఉన్న మరో గోరీలోనుంచి ఇంకో ఆత్మకూడా పైకిలేచింది.

`నిజాం ప్రభువులకు దండాలు…’ రెండవఆత్మ అంది వినయంగా..

మొదటి ఆత్మ చాలా గర్వంగా ఫీలైంది. ఇన్ని సంవత్సరాలైనా ఇంకా తనను ప్రభువుగా గర్తుంచినందుకు…

` భేష్, బాగుంది. ఇంతకీ నువ్వుఎవరు ?’

`ప్రభు నేను మీ తర్వాత చాలాకాలానికి పోయాక ఈ దగ్గర్లోనే పూడ్చిపెట్టారు. అప్పుడప్పుడూ ఇలా బయటకువచ్చేసి లోకంపోకడ తెలుసుకుంటూ ఉంటాను. మీరు అంగీకరిస్తే మీఆత్మపర్యటనలో సహాయకారిగా ఉంటాను. విశేషాలు మీరు అడగకపోయినా చెబుతాను. అది నా హాబీ’

`భేష్ , బాగుంది, చాలాకాలంతర్వాత లేచిన ఈ నిజాం ప్రభువులవారికి నీలాంటి వాడి సహాయం కావాల్సిందే. ఇంతకీ నీపేరు…? ‘

` నాపేరు, అదే…అదే, ఆత్మరూపంలోకి వెళ్ళిపోవడంతో ఛటక్కున గుర్తుకొచ్చిచావడంలేదు ప్రభూ. అయినా,మీ ముందు నేనెంత, చాలా చిన్నఆత్మను కదా… అందుకే `చినఆత్మ’ అని పిలవండి చాలు… పదండి, రాజ్యం విశేషాలు చూద్దురుగానీ’

రెండు ఆత్మలూ రయ్యిన పైకిలేచాయి. నగరంలో అర్థరాత్రి అయినా కార్లూ, బైక్ లు యమస్పీడ్ గా తిరుగుతూనే ఉన్నాయి.

`ఇంత ఆర్థరాత్రి అయినా భయంలేకుండా వీరంతా తెగతిరుగుతున్నారే…ఆశ్చర్యంగా ఉంది’

`ఇందులో మీరు ఆశ్చర్యపోవడంలో వింతేమీలేదు. ఈమధ్యకాలంలో భాగ్యనగరి బాగా డెవలప్ అయింది. అన్నివేషాలు ఇక్కడే దొరుకుతాయి. నిద్రలేని నగరంగా ప్రసిద్ధిచెందింది. ఇంతకన్నా ఆశ్చర్యపోయే విశేషాలు ఇంకా చాలానే ఉన్నాయి పదండి.’

`ఓహో..భేష్… పద, మన రాజ్యం ఎలా ఉందో చూద్దాం. ముందుగా గోల్కండ కోటకు వెళదాం,పద చిన్నఆత్మా’

రయ్యిన పైకిలేచి ఎగిరాయి ఆత్మలు.

`ఇదిగో ప్రభూ, గోల్కొండ కోటకు వచ్చేశాం’

నిజాం ఆత్మ ఉన్నట్టుండి ఎగిరిగంతేసింది. ఆ గెంతుతో ఎత్తైన గోల్కొండకోట బురుజుమీదకు చేరింది. ఆనందంగా తిరగాడింది. పాతజ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ…

`చినఆత్మా, చూడు, ఇక్కడే నేను చిన్నప్పుడు ఆడుకున్నాను. అదిగో, అక్కడే బేగంతో ముచ్చట్లాడుకున్నాను. ఇదంతా నాది…అంతా నాదే…అవును గోల్కొండ నాదే..’
ఇలా అనుకుంటూ నిజాంఆత్మ నవ్వింది. మరింత బిగ్గరగా నవ్వింది. ఆనందంతోకూడినఆవేశంతో వికటాట్టహాసం చేసింది. ఆ నవ్వులకు గోల్కొండకోట దద్దరిల్లింది.

`శాంతించండి ప్రభూ, శాంతించండి … గోల్కొండ కోట అప్పట్లో మీదేకావచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మీదికాదు. అది తానదే అంటూ ఈ మధ్యనే ఒకాయన బాహాటంగా చెప్పేశాడు. ఈమధ్యనే ఇక్కడివాళ్లు ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం కూడా చెప్పారు’

నిజాం ఆత్మకు కోపం వచ్చింది.

`ఆఁ ఎవరూ, నా కోటను తనది అన్న ఆ సాహసి ఎవరు? ఆస్వాగత సత్కారాలు అందుకున్నదెవరు? ? ‘

`అతనో మాటకారి ప్రభూ, క్షణాల్లో మాటలగారడీతో జనాల్ని తనవైపు ఆకర్షించుకోగలడు. అతని మాటలు రెండువైపులా పదునున్న కత్తిలాంటివనుకోండి’

`ఓహో, అంతటి చతురుడా… సరే , చార్మినార్ ఎలా ఉందో చూద్దాం పదా…’

రెండు ఆత్మలూ మళ్ళీ రయ్యిన ఎగిరి చార్మినార్ మీద వాలాయి.
నిజాంఆత్మ పులకించిపోయింది. చార్మినార్ చుట్టూ కలయతిరిగింది. ప్రేమగా తాకింది.

`ఈ చార్మినార్ నాది, దేశపు వింతల్లో ఇదొకటి. చరిత్రను తనలో దాచుకున్న అపూర్వ కళాఖండం ఇది. చార్మినార్ నాది….అహ్హాహ్హా…’

`ప్రభూ, అంతగా ఆనందంతోకూడిన ఆవేశంతో నవ్వకండీ, ఈ చార్మినార్ కూడా తనదే అంటున్నాడు ఆ మనిషి’

మళ్ళీ కోపం వచ్చింది నిజాం ఆత్మకు.

`ఎవడ్రా వాడు, చార్మినార్ కూడా తనదేనంటాడా…?’

`శాంతించండి ప్రభూ, చార్మినార్ తడిమి చూశారుగా, ఇక పదండి, మూసీనది, సాలరా జంగ్ మీజియం, ఫలక్ నుమా ,గోషామహల్ చూద్దాం..’

రెండు ఆత్మలు వాటన్నింటి దగ్గరు వెళ్ళాయి. కలయతిరిగాయి.
ఎక్కడకు వెళ్లినా అవన్నీ ఒకే ఒక్కడు తనవంటూ బల్లగుద్దిమరీ చెబుతున్నాడని తెలుసుకున్న నిజాం ఆత్మ మరింత కలవరపాటుకు గురైంది.

చివరకు ఉస్మానియా ఆస్పత్రి దగ్గరకు చేరాయి రెండు ఆత్మలు.

`ఇక్కడేమిటి చిన్నఆత్మా, హడావుడిగా ఉంది’

`చిత్తం ప్రభూ, ఈ భవనం పడిపోవడానికి సిద్ధంగా ఉందని ఆస్పత్రిలోని రోగులను తరలిస్తున్నారు’

`ఇది ఎవరి పని ?’

`ఇది కూడా ఆ వ్యక్తి పనే ప్రభూ’

`భేష్, ఇదొక్కటి మంచిపని చేస్తున్నాడు’

`కానీ, ప్రభూ, ఈ భవనం కూల్చేసి బహుళ అంతస్థుల వ్యాపార భవనం కడతారేమోనని కొంతమంది చెవులుకొరుక్కుంటున్నారు ప్రభూ’

నిజాం ఆత్మలో అసహనం పెరిగిపోయింది.

`అతనెవరయ్యా, నిజాం ఆస్తులన్నీ తనవంటూ చెప్పుకోవడమే కాకుండా వాటిని కూల్చేస్తాడా. పద అతగాడి సంగతి చూద్దాం’

రెండు ఆత్మలు ఓ పెద్ద భవనంలోని పడకగదివద్దకు చేరుకున్నాయి.

అక్కడ పక్కమీద, ఒక బక్కపలచటి వ్యక్తి పడుకుని ఉన్నాడు. ముక్కేమో చాలా పొడుగ్గా ఉంది. కోలమొహం. నిద్రలో ఏదో కలవరిస్తున్నాడు.

`గీ హైదరాబాద్ గాళ్ల సొమ్మాఏందీ, ఇది నాది, గామాటకొస్తే, గీ గోల్కొండ నాదీ, గా చార్మినార్ నాదీ, గివన్నీ నావే. ఏడనుంచో వచ్చి, ఈడచేరి మావంటరా … నేనూర్కో.. గీమొత్తం నాదే…’

నిజాం ఆత్మకు కోపం తారాస్థాయికి చేరింది. ఇతగాడ్ని ఆటపట్టించాలని నిర్ణయించుకుంది. కానీ….
మళ్ళీ కలవరింత…

`నేను చెప్పలా, మా నిజాం సానా గొప్పోడు. ఈ డ్రైనేజ్ లేసినాడు, నిజాం ప్రభువు మా గొప్పగా పాలించిండు. నిజాంపాలన భేషుగ్గా ఉండె.. పోరగాళ్ల టెస్ట్ బుక్స్ లా గా నిజాంచేసిన మంచి పనులపై పాఠం పెట్టిస్తా. గట్ల చేయకపోతే నాముక్కు నేలకు రాస్తా. నన్ను నమ్మండ్రీ…’

`నిజాం ఆత్మకు ఏం చేయాలో అర్థంకాలేదు. ఇతగాడు పొగుడ్తున్నాడా, తిడుతున్నాడా…’

అంతలో మళ్ళీ ఆ వ్యక్తి కలవరిస్తూనే…
`నిజాం చాలా మంచి ప్రభువు. కాదన్నవాడి గోరీకడతా, బొందపెడతా, వాడి ముక్కు నేలకు రాయిస్తా, వాడి బొక్కలేరుతా.. గిసువంటి పాలనతెస్తా. నిజాంని మరిపిస్తా. నేనే నిజాంనవుతా…’

నిజాం ఆత్మ ఈ తిట్ల దండకం వినలేక చెవులుమూసుకుంది. `ఇదేమిటీ తానే నిజాం అంటున్నాడు, మరి నేనో…’ ఆత్మకు అర్థంకాలేదు. మంచం తలవైపు గోడకు పెద్ద ఫోటో వ్రేలాడదీసిఉంది. అందులో ఈ ముక్కుపొడుగువ్యక్తే నిజాం వేషంలో కనిపిస్తున్నాడు. నిజాం ఆత్మకు ఆశ్చర్యమేసింది.

`ఏమిటిది చినఆత్మా, చూడటానికి నిజాం ప్రభువు ఫోటోలాగా ఉంది. కానీ ఆ ఫేస్, ఇతగాడి ఫేస్ లా ఉందే… అంటే…!’

`అంటే, ఏముందీ ప్రభూ, నిజాం గురించి ఎక్కువగా ఆలోచించాడు, నిజాం లాగా ఉండాలనుకున్నాడు. చివరకు నిజంగానే మారిపోయాడు… లకలకలకా.. లకలకలకా….అంటూ అదోలా నవ్వేసింది చినఆత్మ.

`అంటే ఇక నా అవసరం…’ సందేహపడింది నిజాం ఆత్మ.

`ఇక మీ అవసరమేమీలేదు. ఆయన ఇప్పుడు నిజాంలాగానే మారిపోయాడు. ఇక అతగాడి పాలనే నిజాం పాలనన్నమాట. పదండి, గోరీ పిలుస్తోంది …’

అంతే, రెండు ఆత్మలు మళ్ళీ గోరీలదొడ్డికి చేరుకున్నాయి. మెరుపులా గోరీల్లోకి దూరిపోయాయి. అక్కడ మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. ఎండుటాకుల చప్పుళ్లు తప్ప.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close