జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. రాష్ట్ర స్థాయి కమిటీ నుంచి జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారీ ఒడిదుడుకుల తర్వాత ఇప్పుడు పార్టీ మంచి పొజిషన్ లో ఉంది. పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఇదే మంచి సమయం అని భావిస్తున్నారు. జూలై 2024లో మొదటి దశగా రాష్ట్ర కమిటీని ప్రకటించారు, ఇప్పుడు గ్రామ స్థాయిలోనూ పార్టీని బలోపేతం చేయనున్నారు.
గ్రామ స్థాయి వరకూ జనసేన కమిటీలు
పార్టీ కేంద్ర కార్యాలయ బృందం ఇటీవల వివిధ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు, వీరమహిళలతో సమావేశాలు నిర్వహించి, క్షేత్రస్థాయి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించింది. ఈ డేటాను ఆధారంగా చేసుకుని, కమిటీల కూర్పును రూపొందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కార్యకర్తల మనోభావాలను గుర్తించాలి. వారి భావాలకు అనుగుణంగా మాత్రమే ముందుకు సాగాలి. ఇది పార్టీ బలానికి కీలకమని పవన్ భావిస్తున్నారు.
కొన్ని జిల్లాలపై ప్రత్యేక దృష్టి
ఉమ్మడి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉందని, అక్కడి నాయకత్వాన్ని మరింత పటిష్ఠం చేసి కార్యక్రమాలను వేగవంతం చేయాలని పవన్ భావిస్తున్నారు. ఈ జిల్లాల్లో ఎన్నికల సమయంలో జనసేన గెలుపులు సాధించడమే కాకుండా, పార్టీ క్షేత్ర స్థాయి బలాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. మండల, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పడితే, ప్రజల సమస్యలకు త్వరగా స్పందించవచ్చని, పార్టీ గ్రాస్‌రూట్ స్థాయిలో బలపడుతుందని నిర్ణయానికి చ్చారు.
గ్రౌండ్ వర్క్ పూర్తి చేసిన నేతలు
2024 ఎన్నికల తర్వాతి సమావేశాల్లో పవన్‌కల్యాణ్ పలు రకాల సూచనలు ఇచ్చారు. అప్పటి నుంచి పార్టీ కేంద్ర బృందం 100కి పైగా నియోజకవర్గాల్లో సర్వేలు, చర్చలు నిర్వహించి, 5,000 మంది పైగా కార్యకర్తల అభిప్రాయాలు స్వీకరించింది. డిసెంబర్ 2025లోపు జిల్లా స్థాయి కమిటీలను ప్రకటించాలని, 2026 మధ్య నాటికి మండల, గ్రామ కమిటీలు పూర్తి చేయాలని ప్లాన్. అవన్నీ పూర్తి చేస్తే.. ప్రతి చోటా జనసేన క్యాడర్ కనిపిస్తారు.