ప‌వ‌న్ నిర్ణ‌యం… సినిమాకు చేటే!

మేధావి మౌనం కూడా ప్ర‌మాద‌మే. స‌త్తా ఉన్న‌వాళ్లు చేతులు క‌ట్టుకుని కూర్చుంటే ఉప‌యోగ‌ముండ‌దు. సినిమా స్టార్లూ అంతే. బాక్సాఫీసుని కుదేలు చేయ‌గ‌ల స్టామినా ఉన్న‌వాళ్లు సినిమాలు చేయ‌కుండా కూర్చోవ‌డం ప‌రిశ్ర‌మ‌కు మంచిది కాదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు రాజ‌కీయాల్లో ఉన్నాడు. జ‌న‌సేన‌, జ‌నం, రాజ‌కీయాలు త‌ప్ప మ‌రో మాట ఆయ‌న్నుంచి వినిపించ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ గెలుస్తాడో, లేదో… ప‌వ‌న్ రాజ‌కీయ ఆగ‌మ‌నం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలేంటో ఇప్పుడే లెక్క‌గ‌ట్ట‌లేం. కానీ.. చిత్ర‌సీమ‌కు మాత్రం ఈలోగా న‌ష్టం జ‌రిగిపోతోంది. ప‌వ‌న్ స‌త్తా ఏమిటో తెలియంది కాదు. త‌న ఫ్లాప్ సినిమాల క‌ల‌క్ష‌న్లు… మ‌రో స్టార్ హీరో హిట్ వ‌సూళ్ల‌తో స‌మానం. కాట‌మ‌రాయుడు ఫ్లాప్ అయినా.. తొలి మూడు రోజుల వ‌సూళ్లు భీక‌రంగా వ‌చ్చాయి. అజ్ఞాత‌వాసి తొలి రోజు వ‌సూళ్లు నాన్ బాహుబ‌లి రికార్డులన్నింటినీ క్రాస్ చేసేసింది. ఫ్లాప్‌సినిమాల ప‌రిస్థితే అలా ఉంటే…. ఓ హిట్ ఇస్తే… బాక్సాఫీసు షేక్ అయిపోవాల్సిందే క‌దా?

అలాంటి స్టార్ హీరో సినిమాల‌కు దూరం అయ్యాడు. ప‌వ‌న్ కోసం త‌యారు చేసుకున్న క‌థ‌లు ప‌క్క‌దారి ప‌డుతున్నాయి. ప‌వ‌న్ సినిమా లేని లోటు బాక్సాఫీసుకు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప‌వ‌న్ సినిమాల విష‌యంలో పెద్ద స్పీడేం కాదు. మ‌హా అయితే యేడాదికి ఒక సినిమా చేస్తుంటాడు. కానీ అది చాలు. ఆ సినిమా గురించి అభిమానులు యేడాదంతా ఎదురు చూస్తుంటారు. ఆ సినిమా గురించే మాట్లాడుకుంటుంటారు. ఆ కిక్ ఇప్పుడు మిస్ అయ్యింది. చిరు రాజ‌కీయాల్లోకి వెళ్లాక స‌రిగ్గా ఇదే ప‌రిస్థితి ఎదురైంది. తొమ్మిదేళ్ల పాటు చాలా హిట్లు, సూప‌ర్ హిట్లు వ‌చ్చాయి. కానీ… చిరు నుంచి సినిమా లేని లోటు మాత్రం అలానే ఉంది. రాజ‌కీయాల్లో ఫ్లాప్ అయ్యాక‌.. మ‌ళ్లీ సినిమాల వైపు రాక త‌ప్ప‌లేదు. కానీ.. రీ ఎంట్రీలోనే రూ.150 కోట్లు సాధించి షాక్ ఇచ్చేశాడు. ఇప్పుడు ప‌వ‌న్ నుంచి కూడా అభిమానులు అదే కోరుకుంటున్నారు. ఆ ఎన్నిక‌ల‌య్యాక‌.. మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాల‌వైపు రావాల‌ని, ఆనాటి వైభ‌వాన్ని మ‌ళ్లీ గుర్తు చేయాల‌ని ఆకాంక్షిస్తున్నారు. ఎన్నిక‌ల‌య్యాక ప‌వ‌న్ సినిమాల్లోకి వ‌చ్చే ఛాన్సులు పుష్క‌లంగా ఉన్నాయి. మిత్రుడు త్రివిక్ర‌మ్ `కోబ‌లి` క‌థ ఎప్పుడో సిద్ధం చేశాడు. 2019 ఎన్నిక‌ల‌య్యాక‌… ప‌వ‌న్ ఈ సినిమాతోనే మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్సుంద‌ని స‌మాచారం. ప‌వ‌న్ ఫ్యాన్స్ కూడా ఆక్ష‌ణాల కోస‌మే ఎదురు చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com