మార్ఫింగ్ నిజమే..తేల్చిన ఫోరెన్సిక్..! పవన్‌కు కేసుల తలనొప్పి !!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు రోజులు కలసి రావడం లేదు. అటు రాజకీయంగా.. ఇటు తాను చేసిన ట్వీట్ల వల్ల వచ్చే సమస్యలు రోజు రోజుకూ ఎక్కువైపోతున్నాయి. దేవ్ అలియాస్ వాసుదేవ్ అనబడే బీజేపీ ద్వీతీయశ్రేణి నాయకుడ్ని.. తన పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఎంపిక చేసుకోవడంతో వచ్చి పడుతున్న విమర్శలను…. తిప్పికొట్టలేక సతమతమవుతున్నారు. ఎలా సమర్థించుకోవాలో తెలియక.. ట్విట్టర్‌లో కూడా స్పందించలేకపోతున్నారు. దీనికి తోడు ఇప్పుడు కొత్తగా పవన్ కల్యాణ్‌కు కేసుల భయం ముంచుకొచ్చింది. మీడియాపై తాను ట్విట్టర్ వేదికగా చేసిన ఎటాక్‌లో.. ట్వీట్ చేసిన మార్ఫింగ్ వీడియోపై సైంటిఫిక్ సాక్ష్యాధారాలు లభించాయి.

పవన్ కల్యాణ్ ట్వీట్ చేసిన వీడియో…మార్ఫింగ్ చేసిందేనని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు.ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను తెలుగు360 సంపాదించింది. అందులో ఉన్న విషయాలను బట్టి చూస్తే.. టివి ఛానల్స్ పవన్ కల్యాణ్ పై పెట్టిన కేసుల్లొ గనుక సీరియస్ గా తీసుకుంటే పవన్ తప్పించుకోవడం కష్టమని భావిస్తున్నారు.

శ్రీరెడ్డి అనే నటీమణి తన తల్లిని తిట్టిందని.. టీవీ చానళ్లు ఆ తిట్టును పదే పదే ప్రసారం చేస్తున్నాయని… పవన్ కల్యాణ్ .. మీడియాపై ఓ రేంజ్ పోరాటం ట్విట్టర్ వేదికగా చేశారు. తెలుగుదేశం పార్టీ నేత లోకేషే ఇదంతా చేయిస్తున్నాడంటూ.. ట్వీట్లు చేసి.. ఓ రోజు ఫిల్మ్ చాంబర్‌లో హైడ్రామా కూడా నడపించారు. అదే రోజు.. ఓ మీడియా చానల్‌పై దాడి జరిగింది. అ ఆ వేడిలోనే.. పవన్ కల్యాణ్ ఓ వీడియో తన ట్విట్టర్ ఎకౌంట్ నుంచి.. అప్ లోడ్ చేశారు. టీవీ నైన్ తన తల్లిని ఇలానే తిట్టిందటూ చెప్పుకొచ్చారు. నిజానికి ఆ వీడియో టీవీనైన్‌లో ప్రసారం చేయలేదు. అందులో శ్రీరెడ్డి అనే నటీమణి పవన్ ను తిట్టినట్లు చెబుతున్న తిట్టును బీప్ చేసేసింది. అంటే వినిపించనీయలేదు. కానీ పవన్ ట్వీట్ చేసిన వీడియోలో మాత్రం ఆ తిట్టు స్పష్టంగా ఉంది. కేవలం అభిమానుల్ని రెచ్చగొట్టి…దాడులు చేయించడానికే.. పవన్ ఇలా మార్ఫింగ్ వీడియోను అప్ లోడ్ చేశారని.. టీవీ నైన్ యాజమాన్యం, జర్నలిస్టు సంఘాల నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సాక్ష్యాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.పవన్ కల్యాణ్ మార్ఫింగ్ వీడియోను అప్ లోడ్ చేసినట్లు తేలిపోయింది.

ఇప్పుడేం జరగొచ్చని..న్యాయనిపుణులను తెలుగు360 సంప్రదించింది. మార్ఫింగ్‌ను పవన్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు ఉండకపోయినా.. స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి.. దాన్ని అప్ లోడ్ చేసినందున…కచ్చితంగా నేరం పవన్ మీదకే వస్తుందని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కేసు ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే… పవన్ కల్యాణ్‌ను అరెస్ట్ చేసి.. వెంటనే బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా మార్ఫింగ్ చేసి.. కొంత మంది రిప్యుటేషన్‌ను దెబ్బతీయడానికి కుట్ర పన్నినట్లుగా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ అభియోగాల కింద నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం.. మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకూ జైలు శిక్ష పడుతుంది. జరిమానా దీనికి అదనం. ఇప్పుడు ఇదే జనసేన వర్గాల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏం చేస్తారన్నదానిపై అంతటా ఆసక్తి నెలకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]