జగన్ ను గెలిపించాలనే టీఆర్ఎస్ రాయబారం.! అందుకే పవన్ గుస్సా..!

కేసీఆర్ పాలనకు ఆరు మార్కులేసిన రాజకీయ మాస్టారు పవన్ కల్యాణ్. అదే సమయంలో… తెలంగాణలో ఒక్క సమస్యపైనా స్పందించని.. గొప్ప టీఆర్ఎస్ సపోర్టర్ కూడా.. పవన్ కల్యాణే. అలాగే… చెల్లెలు కవిత అప్పుడెప్పుడో పార్లమెంట్ లో… ప్రత్యేకహోదాకు మద్దతిస్తే… ప్రత్యేకంగా ట్వీట్ చేసి… అభినందనలు చెప్పిన అన్న పవన్ కల్యాణ్. అదే టీఆర్ఎస్ కీలకమైన సమయంలో హ్యాండిచ్చి పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణకు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసినప్పుడు… తనకేమీ తెలియనట్లు అచ్చమైన అన్నలా వ్యవహరించిన వ్యక్తి పవన్ కల్యాణ్. అలాంటి పవన్ కల్యాణ్.. ఇప్పుడు.. టీఆర్ఎస్ ను.. ఏపీలో బూచిగా చూపించే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకు..?

టీఆర్ఎస్ నేతలు పవన్ వద్దకు ఏ రాయబారంతో వచ్చారు..?

కొద్ది రోజుల క్రితం.. పవన్ కల్యాణ్.. ఓ సంచలన ప్రకటన చేశారు. దాని ప్రకారం… తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు.. వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని రాయబారం చేశారట. పొత్తు అని పవన్ కల్యాణ్ గౌరవంగా చెప్పారు కానీ… టీఆర్ఎస్ అగ్రనాయకత్వం నుంచి పవన్ కల్యాణ్ కు వచ్చిన సందేశం మాత్రం… పోటీ నుంచి తప్పుకుని… జగన్ కు మద్దతు ప్రకటించడం మంచిదనేనట. టీఆర్ఎస్ ను తాను ఎంత గొప్పగా… పరిగణించినా.. వారు మాత్రం తనను ఏపీ రాజకీయాల్లో కూడా పూచికపుల్లలా చూడటం.. పవన్ కు ఆగ్రహం తెప్పించింది. కానీ నేరుగా టీఆర్ఎస్ అగ్రనేతల్ని ఏమీ అనలేరు కాబట్టి… జగన్ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తను ఇంత కాలం నుంచి రాజకీయాలు చేస్తూంటే తన ప్రాధాన్యతను గుర్తించకుండా… టీఆర్ఎస్ ద్వారా.. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చినట్లు… తనకు ఇవ్వాలని జగన్ ఒత్తిడి తేవడంపై… కానుక వహిస్తున్నారు. అందుకే పదే పదే.. తాము పోరాడతాం.. పోటీ చేస్తామనే ప్రకటనలు పదే పదే చేస్తున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

టీఆర్ఎస్.. వైసీపీకే ఎందుకు ఎక్కువ మద్దతు పలుకుతోంది..?

తెనాలిలోని నాదెండ్ల మనోహర్ ఫార్మ్ హౌస్‌ లో ఏర్పాటు చేసిన ఓ సభలో పవన్ కల్యాణ్.. టీఆర్ఎస్ పై ఓ మాదిరి అసంతృప్తి వ్యక్తం చేశారు. రివర్స్ లో… వైసీపీకి.. టీఆర్ఎస్ ఎక్కువ ఎందుకు మద్దతు పలుకుతుందోనని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో.. వైఎస్ తో పాటు.. జగన్ ని కూడా టీఆర్ఎస్ వ్యతిరేకించిందనే సంగతిని గుర్తు చేస్తున్నారు. అంటే పవన్ కల్యాణ్.. పరోక్షంగా ఆ రెండు పార్టీలకు మధ్య విరోధం ఉందని చెప్పదల్చుకున్నారు. ఎందుకంటే.. జనసేనే.. టీఆర్ఎస్ తో ఎలాంటి గొడవలు పెట్టుకోలేదని.. మొదటి నుంచి సాన్నిహిత్యంతో ఉందని చెప్పుకోవడమే ఆ ఉద్దేశం. ఇలా చెప్పుకోవడం ఎందుకంటే.. టీఆర్ఎస్ … ఏపీ లో తన మద్దతు.. వైసీపీ కన్నా.. ఎక్కువగా జనసేనకే ఇవ్వాల్సి ఉంటుందనేది…కావొచ్చన్న అభిప్రాయం ఉంది. జనసేన అధినేత ఇప్పుడు పార్టీని నడపడానికి నిధుల లేమితో ఉన్నారు. వైసీపీకి టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సాయం తమకూ కావాలని జనసేన అధినేత కోరుకుంటున్నారని అనుకోవచ్చు.

టీఆర్ఎస్ ఒత్తిడికి పవన్ తలొగ్గుతారా..?

ఇప్పటికైతే టీఆర్ఎస్ అగ్రనేతలు… వారి సర్వేలను… దూతలతో పవన్ కల్యాణ్ వద్దకు పంపి.. ఇప్పటికిప్పుడు పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేస్తే.. జనసేన పరిస్థితి దుర్భరంగా ఉంటుందని.. చెబుతున్నట్లు తెలుస్తోంది. అదే ఈ సారి.. జగన్ కు మద్దతు ఇస్తే… గెలిపించారనే ఉంటుందని చెప్పుకొస్తున్నారట. విడిగా పోటీ చేస్తే అది తెలుగుదేశం పార్టీకే లాభం కలుగుతుదని.. అది ఉమ్మడి లక్ష్యానికి విరుద్ధంగా ఉంటుందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్.. ఇప్పటికైతే.. టీఆర్ఎస్ నేతల ప్రతిపాదనల్ని పక్కన పెట్టేశారు. అందుకే.. వైసీపీ, టీఆర్ఎస్ ను కలిపి విమర్శలు చేస్తున్నారు. అయితే… చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్న కేసీఆర్… వదిలే అవకాశం లేదు. జగన్, పవన్ కలిస్తే… చంద్రబాబును ఓడిపోతారని.. కేసీఆర్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరింత తీవ్రమైన ప్రయత్నాలు ఆయన వైపు నుంచి జరిగే అవకాశం ఉంది.

—సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com