సీఎం చంద్రబాబుతో సుదీర్ఘంగా జరిగిన సమావేశం పూర్తిగా అభివృద్ధి అంశాలపైనే జరిగిందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ, గ్రామ పంచాయతీలకు నిధుల కేటాయింపులో వెనకడుగు వేయకూడదనే చంద్రబాబు నిర్ణయాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో ఎలా వినియోగించాలో కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలిపారు.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం జల్ జీవన్ మిషన్ పై ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. 2026 నాటికి రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ ఇంటికీ కుళాయి ద్వారా రక్షిత మంచినీటిని అందించడమే లక్ష్యంగా, పనుల వేగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్లో సుమారు 4,000 కోట్ల రూపాయలను కేటాయించారు. కేవలం నీటి సరఫరానే కాకుండా, గ్రామాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థల పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్దేశించిన వికసిత్ భారత్ – 2047 లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్‌ను భాగస్వామిని చేయడమే తమ అంతిమ ఉద్దేశమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న గాంధీజీ సూక్తిని నిజం చేసేలా, పంచాయతీ రాజ్ వ్యవస్థకు పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించారు. మామూలుగా అయితే ఇలాంటి అధికారిక అంశాలపై చర్చించేటప్పుడు వివరాలతో అధికారులు కూడా హాజరయ్యేవారు. పవన్ మాత్రమే ఈ సారి సమావేశంలో పాల్గొన్నారు. రాజకీయాలపైనా చర్చించి ఉంటారని అంచనా వేస్తున్నారు.


