హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్లో పవన్ కళ్యాణ్ మాటలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. సక్సెస్‌లో మాట్లాడాల్సిన మాటలకు భిన్నంగా ఆయన ప్రసంగం సాగింది. చాలా ఓపెన్‌గా మాట్లాడారు పవన్.
ఈ సినిమా రిలీజ్ కావడానికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. పవన్ స్వయంగా కలగజేసుకొని వాటిని పరిష్కరించారు. దీనిగురించి ఆయన చాలా సరదాగా చెప్పారు. ‘‘పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా నేను పంచాయితీలు చేసి సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది. నా జీవిత కాలంలో ఏదీ తేలికగా దొరకలేదు. డిప్యూటీ సీఎంని కదా, సినిమా సులువుగా విడుదలవుతుందనుకున్నా. కానీ, వారం నుంచి నిద్రపోలేదు. గత రెండు రోజుల్లో నేను మాట్లాడిన విషయాలు నా 29 ఏళ్ల సినీ జీవితంలో 10 శాతం కూడా మాట్లాడలేదు’’ అని చెప్పుకొచ్చారు.
బాయ్‌కాట్ ట్రెండ్ గురించి ప్రస్తావించారు. ‘‘కొంతమంది సినిమాను బాయ్‌కాట్ చేద్దాం అన్నారు. చేస్తే చేసుకోండని భావించాను. ఎక్కడో నెల్లూరులో చిన్న వీధుల్లో పెరిగిన వాడిని. నేను ఇక్కడ వరకూ రావడమే గొప్ప. నా సినిమాను మీరు ఆపుతున్నారు అంటే నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరే చెబుతున్నట్లు. నేను ఒక సినిమా తీస్తే మిమ్మల్ని అంత బయటపెట్టిందా? ఇదేమైనా క్విట్ ఇండియా ఉద్యమమా? ఏం చేసుకున్నా నాకేం తేడా పడదు. ఇంతకుముందు చాలా చూశాను. ఇలాంటి తాటాకు చప్పుళ్లకి నేను భయపడను’’ అన్నారు.
ఇక సినిమా కంటెంట్ గురించి మాట్లాడుతూ… ‘‘మేము మతాల గురించి చెప్పలేదు. మంచి చెడు గురించి చెప్పాము. ఔరంగజేబు డార్క్ సైడ్‌ని చూపించాము. మొఘల్స్ చాలా గొప్ప వాళ్లు అని అంటారు. వాళ్లే జిజియా పన్ను పెట్టారు. దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని సినిమాలో చూపించాము. జిజియా పన్ను గురించి చదువుకున్నప్పుడు చాలా బాధగా ఉండేది. దీనిగురించి ఎవరు మాట్లాడడం లేదేంటి అనుకునేవాడిని. ఈరోజు ఈ సినిమా రూపంలో ఆ విషయాన్ని చెప్పడం బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నేను సినిమా రికార్డులు, కలెక్షన్ల దగ్గర ఆగిపోను. ఒక సినిమా నుంచి ఏం నేర్చుకున్నాము, ఏమి ఇచ్చామన్నదే చూస్తాను’’ అని చెప్పారు.
ఇక హరిహర వీరమల్లుపై వచ్చిన విమర్శల గురించి, అభిమానుల బాధ గురించి కూడా మాట్లాడారు. ‘‘ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి. మేము అవన్నీ పార్ట్ 2 లో రాకుండా చూసుకుంటాము. నా అభిమానులకు ఒక విషయం చెబుతున్నాను. మీరు అంత సున్నితంగా ఉండకండి. ఈజీగా ఉండండి. నేను దెబ్బలు తింటున్నాను. మీరు జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ప్రతి కామెంట్‌కు నలిగిపోవద్దు. ఒక నెగెటివ్ కామెంట్‌ను ఎలా తిప్పికొట్టాలో ఆలోచించి అలా తిప్పికొట్టండి. అంతేగానీ కుంగిపోవద్దు’’ అని సలహా ఇచ్చారు.
చివర్లో జయాపజయాల గురించి పవన్ చెప్పిన మాటలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ‘‘నేను సక్సెస్‌ని, ఫెయిల్యూర్ని ఒకేలా తీసుకుంటాను. 2019లో ఓడిపోయినప్పుడు నేను ఎంత అవమాన పడుతున్నానో అని చూడాలని కొందరు భావించారు. ఎక్కడో ఒక చిన్న ఊరిలో పుట్టాను. హీరో అయ్యాను. పార్టీ పెట్టాను. ఓడిపోవడం కూడా నాకు గెలుపే. నేను నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తాను. ఒక అడుగు ముందుకు వేస్తేనే ఈరోజు డిప్యూటీ సీఎంగా మీ ముందుకు వచ్చాను. సక్సెస్‌ని, ఫెయిల్యూర్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జీవితాన్ని, బంధాలను సీరియస్‌గా తీసుకుందాం. మనం మహా బతికితే 100 ఏళ్లు బతుకుతాం. ఈ మాత్రానికి ఎందుకంత హేట్? హ్యాపీగా ఉండటం నేర్చుకుందాం’’ అని ముగించారు పవన్. మొత్తానికి, చాలా అరుదుగా సక్సెస్ మీట్‌కు వచ్చే పవన్… అంతే అరుదైన విధంగా మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది.