జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రకటించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామ్ తాళ్లూరి నిర్మాత. తర్వాత ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డికి సినిమా చేస్తానని మాటిచ్చారు. అలాగే విశ్వప్రసాద్‌తో ఓ పెద్ద డీల్ చర్చల్లో ఉందని చెబుతున్నారు. పవన్ సినిమాలపై జరుగుతున్న ప్రచారం చూస్తే.. అటు డిప్యూటీ సీఎం పదవితో పాటు సినిమాలను కూడా అంతే సీరియస్ గా తీసుకుంటారని స్పష్టమవుతోంది. ఇదే చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. రెండు పడవలపై ప్రయాణం అంటే.. రేపు ఏదైనా తేడా వస్తే విమర్శించడానికి అన్నింటికీ అదే కారణం అవుతుంది.
డిప్యూటీ సీఎం హోదాలో నటించడం తప్పు కాదు..కానీ !
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అలాగని ఆయన నటించడం తప్పు కాదు. కానీ నైతికంగా అయితే మంత్రి పదవుల్లో ఉంటే నటించడం మానేస్తారు.రోజా కూడా తనకు మంత్రి పదవి రాగానే టీవీషోలు.. ఇతర కార్యక్రమాలను నిలిపివేసి పూర్తిగా మంత్రిగా బాధ్యతలకే పరిమితమయ్యారు. ఇప్పుడు పదవులు పోవడంతో మళ్లీ తెర ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం డిప్యూటీ సీఎంగా ఉంటూనే హీరోగా నటిస్తున్నారు. ఆయనను విమర్శించడానికి ప్రత్యర్థులకు ఓ అవకాశం ఇచ్చినట్లే.
వ్యాపారం వేరు.. నటన వేరు !
పవన్ కల్యాణ్ ..తనకు ఆదాయ మార్గం నటనేనని అప్పులు తీర్చుకోవాలన్నా.. పార్టీని నడిపించుకోవాలన్నా తాను సినిమాలు చేయాల్సిందేనని చెబుతున్నారు. అది ఆయన అనివార్యత. కానీ రాజకీయాల్లో ఇది వ్యాలిడ్ వాదన కాదు. చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు కదా అని కొంత మంది ప్రశ్నిస్తూ ఉంటారు. వ్యాపారం చేయడం వేరు.. సినిమాల్లో నటించడం వేరు. వ్యాపారాలకు ఎంత సమయం కేటాయించినా అది అంతర్గతంగానే ఉంటుంది. బయట పెద్దగా తెలియదు. కానీ పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం అనేది అందరికీ తెలుస్తుంది. రోజుల తరరబడి ఆయన షూటింగ్స్ కోసం వెళ్లారా అన చర్చ జరుగుతుంది. పవన్ ఏదైనా వ్యాపారం కోసం..తన షూటింగ్ సమయం అంత కన్నా ఎక్కువ సమయం కేటాయిస్తే ఇంత ఇంపాక్ట్ రాదు. పవన్ సినిమా అనేది ప్రజలతో సంబంధం ఉన్న అంశం. అందుకే చర్చనీయాంశం అవుతుంది.
అధికార విధుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన ప్రజలకు రాకూడదు !
పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయిస్తానని ప్రజలకు నమ్మకం కలిగించేందుకు టీవీకే విజయ్ తన చివరి సినిమాగా జననాయగన్‌ను ప్రకటించారు. మరోసారి తాను సినిమాల్లో వచ్చే అవకాశం లేదని తనను ఇంతలా ఆదరించిన వారి కోసం వచ్చే 30 ఏళ్లు నిలబడతానని ఆయన గట్టిగా చెబుతున్నారు. అలా చెప్పకపోతే ప్రజలు మరో రకంగా ఆలోచించే అవకాశం ఉంది. ఆయనను సినిమా హీరోగా అభిమానించేవారు ..రాజకీయాల్లోకి ఎందుకు హీరోగా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు. వారికి అలాంటి చాన్స్ ఇవ్వకుండా విజయ్ వ్యూహాత్మకంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది అనివార్యం. పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తూనే ఎన్నికల్లో పోటీ చేశారు. కూటమిగా గెలిచారు. డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే ప్రజలు ఆమోదించినట్లే. ఇప్పుడు కూడా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు. రేపు ఏదైనా చిన్న విషయంలో ఆయనను టార్గెట్ చేయాలనుకుంటే అందరూ మొదట చెప్పే కారణం ఇదే అవుతుంది. అందుకే పవన్ కల్యాణ్ కొన్ని విషయాలపై కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే సాహసం చేస్తున్నట్లే అనుకోవాలి.
