“ ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో “ అనే డైలాగ్ పవన్ కల్యాణ్ సినిమా నుంచే పాపులర్ అయింది. బలం ఉందని ఎప్పుడూ పైచేయిగా ఉండాలని అనుకోలేరు. ఒక్కోసారి తగ్గడం కూడా నెగ్గడమే అవుతుంది. పవన్ కల్యాణ్ ఈ డైలాగును సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోనూ అన్వయించి విజేతగా నిలిచారు. వందకు వంద శాతం.. పోటీ చేసిన ప్రతీ సీట్లోనూ గెలవడం అంటే… ఇప్పటి వరకూ ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని ఫీట్ అది. దాన్ని పవన్ నేతృత్వంలో జనసేన సాధించింది. రెండు చోట్ల ఓడిపోయారన్న ఎగతాళిని మరెవ్వరూ అలా చేయకుండా చేయగలిగారు.
సినీ రంగంలో బాక్సాఫీసు పవర్ స్టార్
పవన్ కల్యాణ్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలోకి వచ్చారు. కానీ అది పరిచయం కావడానికి మాత్రమే ఉపయోగపడింది. మొదటి సినిమా ఫెయిలైనా తర్వాత ఎవరూ సినిమాలు చేయడానికి ముందుకు రాలేదు. తర్వాత పవన్ సినిమాలు ఎలా ఉండాలో.. యువతకు ఏది కావాలో అధ్యయనం చేసుకుని దానికి తగ్గ సినిమా కథలపై దృష్టి సారించారు. కొద్ది కాలంలోనే యూత్ ఐకాన్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకు తిరుగులేదు. పవర్ స్టార్ అయ్యారు. ఏ రంగంలో వారసుడికైనా.. పరిచయం మాత్రమే అడ్వాంటేజ్ . నిలబడాలంటే స్వయంశక్తి ముఖ్యం. ఆ పవర్ చూపించారు పవన్ కల్యాణ్.
రాజకీయ రంగంలో ఎదురీదే పవర్
పవన్ కల్యాణ్ కు సామాజిక సమస్యలపై మొదటి నుంచి ఆవేశం ఉంది. అందుకే సోదరుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం బాధ్యతలు తీసుకున్నారు. కానీ ప్రజారాజ్యం ఫెయిల్యూర్ ఆయనను బాగా ఇబ్బందిపెట్టింది. సైలెంటుగా గా ఉండలేనని జనసేన పార్టీ పెట్టారు. ఆయనకు తెలుసు.. రాజకీయాల్లో ఎదురీదాల్సి ఉంటుందని. పట్టుదలగా ముందుకు సాగారు. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. కానీ రాజకీయాలు చేయడం తనకూ వచ్చని .. ఎన్డీఏలో చేరడం ద్వారా సంపూర్ణమైన విజయాలు సాధించి నిరూపించారు. ఎదురీదే పవర్ ఉంది కాబట్టే నేడు పొలిటికల్ గానూ పవర్ స్టార్ గా మారారు.
స్వార్థం లేని ప్రజాసేవే ఆ పవర్ టార్గెట్
సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మందికి ఆర్థిక సమస్యలు ఉండవు. అధికారంలోకి వచ్చాక అసలు ఉండవు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం భిన్నం. సొంతంగా సంపాదించి రాజకీయాల్లో ఖర్చు చేయాలనుకుంటారు కానీ.. ఒక్క రూపాయి రాజకీయాల నుంచి సంపాదించాలని అనుకోరు. దోచుకున్న వాళ్లు ఆయనపై విమర్శలు చేయవచ్చు కానీ ఆయన పంథా మారదు. అదే సమయంలో పవన్ కల్యాణ్ తన పవర్ ను అడ్డు పెట్టినంత కాలం తాము పవర్ లోకి రాలేమని తెలుసుకున్న కొంత మంది నేతలు ఆయనపై వ్యక్తిగత దాడులు చేస్తూంటారు. కానీ దేనికీ చలించకుండా.. పవర్ ఫుల్ రాజకీయాలు చేయడంలో పవన్ ది ప్రత్యేక శైలి.
హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.