కొత్త క‌థ‌ల్ని న‌మ్మ‌వా ప‌వ‌న్‌??

అద్భుతాలు సృష్టించాలంటే కొత్త‌గా ఆలోచించాల్సిందే. కొత్త అడుగులు వేయాల్సిందే. ఎవ‌రో న‌డిచిన దారిలో న‌డుస్తూకూర్చుంటే ఎప్ప‌టికీ కొత్త శిఖ‌రాలు, కొత్త గమ్యాల్ని చూడ్డానికి వీలుండ‌దు. ఈ విష‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఎప్పుడు అర్థం అవుతుందో? ప‌వ‌న్ కెరీర్‌లో ఎక్కువ‌గా రీమేక్ సినిమాలే క‌నిపిస్తాయి. వాటిని న‌మ్మ‌కొంటే ప్ర‌యాణం సాఫీగా సాగిపోతుంద‌న్న భ‌రోసా కావొచ్చు. రీమేక్ క‌థ‌లైతే పెద్ద ద‌ర్శ‌కులే అక్క‌ర్లెద్దు.. అనామ‌కులూ డీల్ చేయ‌గ‌ల‌ర‌న్న కాన్ఫిడెన్స్ కావొచ్చు. మొత్తానికి ‘కొత్త ద‌ర్శ‌కులు + రీమేక్ క‌థ‌లు’ ఈ ఫార్మెట్‌ని ఫాలో అయిపోతున్నాడు పవ‌న్‌. ప‌వ‌న్ కెరీర్‌లో పెద్ద హిట్లుగా నిలిచిన ఖుషీ, గ‌బ్బ‌ర్‌సింగ్‌లు రీమేక్ క‌థ‌లే. వీటి మ‌ధ్య ప‌ర‌భాషా క‌థ‌ల్ని చాలామ‌ట్టుకు ఎంక‌రేజ్ చేశాడు ప‌వ‌న్‌. ఇప్పుడు జాలీ ఎల్ ఎల్ బీ 2ని ప‌వ‌న్ రీమేక్ చేస్తున్నాడ‌ట‌.

రీమేక్ సినిమాల్ని ఎంచుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ ఎప్పుడూ అరిగిపోయిన ఫార్మెట్‌ని ప‌ట్టుకొని వేళాడితే ఎలా?? ‘నాకో కొత్త క‌థ కావాలి’ అని అడిగితే ప‌వ‌న్ కోసం క‌థలు గుమ్మ‌రించే వాళ్లు ఎంత‌మంది ఉండ‌రు? ఆ రిస్క్ ప‌వ‌న్ ఎందుకు చేయ‌డు? జాలీ ఎల్ ఎల్ బీ ఓ కమ‌ర్షియ‌ల్ హీరోకి త‌గిన క‌థ కాదే..? అందులో క‌మ‌ర్షియాలిటీ ఏం లేదే?? ఇలాంటి క‌థ‌లు మ‌న‌వాళ్లు రాయ‌లేరా? ఎందుకు రాయ‌రు.. కానీ మ‌న‌కు నమ్మ‌కాలు ఉండ‌వు. ఎక్క‌డో ఎవ‌రో చేసి హిట్టు కొడితే గానీ, మ‌నం కొత్త క‌థ‌ల్ని న‌మ్మం. అందుకే ఓ చోట ఆడిన సామాన్య‌మైన క‌థ‌ని కూడా కోట్లు పోసి కొంటుంటాం. ఈ విష‌యంలో ప‌వ‌న్‌మారాల్సిన అవ‌స‌రం ఉంది.

కొత్త పంథాలో వెళ్తానంటే ప‌వ‌న్‌ని ఆపేవాళ్లు ఎవ‌రూ ఉండ‌రు. పైగా ట్రెండ్ కూడా మారుతోంది. హీరోలంతా ఏదో చేద్దామ‌ని త‌పిస్తున్నారు. ప‌వ‌న్‌ని ఆ స్టామినా ఉన్న‌ప్పుడు రీమేక్ క‌థ‌ల్ని ప‌ట్టుకొని వేళాడితే లాభం ఏముంది? గోపాల గోపాల సినిమాని ప‌వ‌న్ చాలా శ్ర‌ద్ద‌గానే చేశాడు. కానీ… అదేం గొప్ప క‌మ‌ర్షియ‌ల్ హిట్ కాలేదే. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి కావాల్సింది యావ‌రేజ్‌లూ, ఎబౌ ఏవ‌రేజ్‌లూ కాదు. ఓ దిమ్మ తిరిగే హిట్‌. అది రీమేక్‌ల‌తో సాధ్యం కాద‌న్న విష‌యం ప‌వ‌న్ గుర్తించుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.