వ‌రుణ యాగం కాదు హ‌రిత య‌జ్ఞం చేప‌ట్టండి

ఇది చేస్తున్న‌ది ఏదో పండిత బృందం కాదు.. ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. లౌకిక ప్ర‌భుత్వాలు అని చెప్పుకునేవి లౌకిక‌త్వానికి ప్ర‌తీక‌గా నిల‌వాలి. శంకుస్థాప‌న‌ల‌కు వేద‌పండితుల‌తో పూజ‌లు..చాంబ‌ర్‌లోకి వెళ్ళాలంటే పండితుల ఆశీర్వ‌చ‌నాలు.. శాస్త్రోక్త విధివిధానాలు వీరికి అత్య‌వ‌స‌రం. అది లేకుండా అడుగు తీసి అడుగేయ‌లేరు. తీరా లోప‌ల అడుగుపెట్టాక వాస్తుదోషాలంటూ వాటిని కూల‌గొట్టించ‌డం.. త‌మ‌కు న‌చ్చినట్టు క‌ట్టుకోవ‌డం. ఇదంతా సొంత సొమ్ముతో చేయించుకుంటే ఎవ‌రికీ బాధుండ‌దు. పబ్లిక్ మ‌నీ అంటే ప్ర‌జాధ‌నం.. ప్ర‌జ‌ల నుంచి ముక్కుపిండి వ‌సూలు చేసిన ప‌న్నుల ద్వారా రాష్ట్ర ఖ‌జానాకు చేరిన డ‌బ్బు. ఇలా చేస్తే వృధా కాదా. దీనిగురించి మాట్లాడితే ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు కోపం రావ‌చ్చు. కానీ మాట్లాడ‌క తప్ప‌దు..
అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గంలో ప్ర‌భుత్వం ఈ నెల 23న వ‌ర్షాలు కుర‌వాల‌ని వ‌రుణ జ‌పాన్ని త‌ల‌పెట్టింది. ఉద‌యం 8 నుంచి సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కూ సాగుతుంది. గ‌ణ‌ప‌తి పూజ‌, ల‌ఘు పుణ్య‌హ‌వ‌చ‌నం, క‌ల‌శారాధ‌న‌, న‌వ‌చండీ పారాయ‌ణం, న‌వ న‌వ క‌న్య‌క పూజ‌, చండీయాగం నిర్వ‌హిస్తారు. 24 వ తేదీన బెంగ‌ళూరుకు చెందిన ద్వార‌కా బ‌ద‌రిక ఆశ్ర‌మం పీఠాధిప‌తి విద్యానారాయ‌ణ తీర్థ స్వామి ఆధ్వ‌ర్యంలో గంగ‌పూజ‌, వ‌రుణ జ‌పం, 100 క‌ల‌శాల‌తో ఊరేగింపు, మ‌హా ప‌వ‌మాన హోమం, సుద‌ర్శ‌న హోమం, పూర్ణాహుతి, బ‌లిహ‌ర‌ణం, అన్న సంత‌ర్ప‌ణ‌, రుద్రాభిషేకాల‌ను కూడా నిర్వ‌హిస్తారు. వ్య‌క్తిగ‌తంగా ఇవి చేయ‌డం ప‌ట్ల ఎవరికీ అభ్యంత‌రాలుండ‌వు. ఎందుకంటే మ‌న‌ది హిందూ ధ‌ర్మాన్ని పాటించే దేశమూ, దైవాన్ని న‌మ్మే దేశ‌మూ కాబ‌ట్టి. హోమంలో వాడే స‌మిధ‌ల కార‌ణంగా ఏర్ప‌డే పొగ మేఘాలు ఆకాశంలో నీటితో కూడిన మ‌బ్బుల‌ను ద్ర‌వీభ‌వింప‌జేసి, వాన‌ల రూపంలో వ‌ర్షింప‌చేస్తాయ‌నేది వైదిక సూత్రం. ఇప్పుడ‌లాంటి ప‌రిస్థితులున్నాయా! ఇటువంటి హోమాల కార‌ణంగా వ‌ర్షాలు కురిసే ప‌ర్యావ‌ర‌ణం భూమిపై ఉందా? ఇది ప్ర‌శ్నించుకోవాలి ముందు. కొండ‌లు.. వాటి మీద ఉండే చెట్లు క‌లుగ‌జేసే చ‌ల్ల‌టి ప‌ర్యావ‌ర‌ణం ఘ‌నీకృత మేఘాల‌ను ద్ర‌వీభూతం చేస్తాయి. ఇప్పులాంటి ప‌ర్యావ‌ర‌ణ‌మే లేదు. కార‌ణం ఇష్టారాజ్యంగా చెట్ల‌ను కొట్టేయ‌డం. ఏటా కొన్నికోట్ల చెట్ల‌ను విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్టిపారేస్తున్నారు. అందులో ప్ర‌భుత్వ భాగ‌మే అధికం. మెట్రో పేరిట హైద‌రాబాద్‌లో చెట్ల‌నూ..అమ‌రావ‌తి నిర్మాణం పేరిట ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ప‌చ్చ‌టి పొలాల‌నూ ధ్వంసం చేశారు.

అనంత‌పురం సంగ‌తి వేరే చెప్పాలా. త‌గిన చ‌ర్య‌లు తీసుకోక‌పోతే.. ఆ జిల్లా 2050నాటికి ఎడారిగా మారుతుంద‌న్న ప‌ర్యావ‌ర‌ణవేత్త‌ల మాట‌ల‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. చెట్లు లేని చోట‌.. రైతును గౌర‌వించ‌ని చోట వ‌రుణ జ‌పాలు కాదు క‌దా.. దేవ‌త‌లకూ, దిక్పాల‌కులకూ అధిదేవ‌తైన దేవేంద్రుడికి పూజ‌లు చేసినా ఉప‌యోగం ఉండ‌దు. ఇంకుడు గుంత‌ల‌తో పాటు చెట్లు నాటండి.. ప‌రిర‌క్షించండి. అప్పుడు యాగాల‌కైనా.. వ‌ర్షాల కోసం చేసే ప్ర‌య‌త్నాల‌కైనా ఫ‌లితం ఉంటుంది. డాక్ట‌ర్ వైయ‌స్ఆర్ హ‌యాంలో నిర్వ‌హించిన మేఘ‌మ‌థ‌నం రాయ‌ల‌సీమ జిల్లాల నేత‌ల జేబుల్లో కాసుల వ‌ర్షం కురిపించింది త‌ప్ప ఒక్క చుక్క వాన నీటిని భూమికి చేర్చ‌గ‌లిగిందా? ప‌్ర‌భుత్వ‌మూ దానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా వాస్త‌వాన్ని గ్ర‌హించాలి.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.