పవన్ కళ్యాణ్ కాకినాడలో నిన్న నిర్వహించిన బహిరంగ సభలో ప్రత్యేక హోదా ఇవ్వకుండా భాజపా రాష్ట్ర ప్రజలని మోసం చేసిందని మొహమాటం లేకుండా నేరుగానే ఆరోపించడం ద్వారా ఇకపై తాను ఆ పార్టీకి దూరం అవుతున్నట్లు చాలా స్పష్టంగా చాటి చెప్పినట్లయింది. రాష్ట్ర విభజన ప్రస్తావన చేసి ఉత్తరాది వారి అహంకారం సహించబోమని చెప్పడం ద్వారా తను తెదేపాకే ప్రాధాన్యం ఇస్తానని చెప్పినట్లయింది. కానీ తెదేపాకి తన మద్దతు కావాలనుకొంటే ధైర్యంగా ప్రత్యేక హోదా కోసం కేంద్రప్రభుత్వంతో పోరాటానికి సిద్దం అవ్వాల్సి ఉంటుందనే విషయం కూడా నొక్కి చెప్పారు. తెదేపా అందుకు సిద్దపడుతుందో లేదో మున్ముందు తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం కేంద్రం ఇచ్చిన ప్యాకేజిని తీసుకొని దానితో సర్దుకుపోవాలని అనుకొంటున్నట్లుగానే కనబడుతోంది.
ప్రత్యేక హోదా కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో భాజపా పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడి ఉంది. అది పవన్ కళ్యాణ్ సభతో మరి కాస్త పెరిగి ఉండవచ్చు. కేంద్రప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజిని తెదేపా ప్రభుత్వం తీసుకొన్నప్పటికీ, ప్రజలలో తమ రెండు పార్టీలు, ప్రభుత్వాల పట్ల పెల్లుబుకుతున్న ఆగ్రహం, అసంతృప్తిని తెదేపా కూడా భయపడుతూనే ఉంది. కనుక నేటికీ అది కూడా ఇంకా చిన్నగా అసంతృప్తి రాగాలు తీస్తూనే ఉంది. ఒకవేళ ఈ ప్రత్యేక ఉద్యమాల వలన రాష్ట్రంలో ప్రత్యేక వేడి మరింత పెరిగితే, తెదేపా కూడా మళ్ళీ స్వరం పెంచవచ్చు. పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తానని భరోసా ఇస్తున్నారు కనుక, ఒకవేళ భాజపాతో స్నేహం వలన తనకి ప్రమాదం అనుకొంటే దానితో తెగతెంపులకి కూడా వెనుకాడకపోవచ్చు. అదే జరిగితే రాష్ట్రంలో భాజపా ఒంటరి అయిపోతుంది. దాని పరిస్థితి వ్రతం చెడ్డా ఫలం దక్కన్నట్లు అవుతుంది.
రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలన్నీ భాజపాని చాలా కలవార పరుస్తున్నాయి. అందుకే అది నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. తన ఇద్దరు ఆంధ్రా మంత్రులు, ఎంపిలు, సీనియర్ నేతలతో డిల్లీ చర్చలు ప్రారంభిస్తోంది. రాష్ట్రంలో తెదేపాతో కలిసి సాగుతున్నప్పటికీ, ఏకాకిగా మిగిలిపోయి ప్రజాగ్రహానికి గురవుతున్నందున ఈ సమస్య నుంచి ఏవిధంగా బయటపడాలని ఆలోచనలు చేస్తోంది. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు కనుక రాష్ట్రానికి ఇచ్చిన, ఇస్తున్న సహాయ సహకారాల గురించి ప్రజలకి వివరింఛి వారి అపోహలు దూరం చేయాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది. కానీ తెదేపా, వైకాపా, పవన్ కళ్యాణ్ ల ప్రభావంలో ఉన్న రాష్ట్ర ప్రజలకి నచ్చ చెప్పడం అసాధ్యం అని అది గ్రహించే ఉంటుంది. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది కనుక ప్రస్తుత పరిస్థితులలో దాని ముందు ఇంతకంటే వేరే మార్గాలేవీ లేవు.
పవన్ కళ్యాణ్ మద్దతుతోనే రాష్ట్రంలో విజయం సాధించిన భాజపా ఇప్పుడు ఆయన కారణంగానే కూకటి వ్రేళ్ళతో కూలిపోయే పరిస్థితి ఏర్పడటం చాల విచిత్రమే. ఈ సమస్య నుంచి భాజపా ఏవిధంగా గట్టెక్కుటుందో చూడాలి. బహుశః తెదేపా ద్వారానే పరిస్థితులని నియంత్రించే ప్రయత్నం చేస్తుందేమో?