మే 9న ‘హరి హర వీరమల్లు’ వస్తుందని ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు. అయితే మరోసారి వాయిదా పడి, అందర్నీ నిరాశ పరిచింది. ‘వీరమల్లు’కు సంబంధించి మరి కొంత షూటింగ్ బాకీ వుంది. పవన్ ఖాళీ చేసుకొని, ఆ పార్ట్ పూర్తి చేస్తే తప్ప ఈ సినిమా బయటకు రాదు. అందుకే ‘వీరమల్లు’ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా? అని ఎదురు చూపుల్లో పడిపోయారు ఫ్యాన్స్. ఇన్నాళ్లకు పవన్ కు మళ్లీ సినిమాలపై ఫోకస్ మొదలైంది. ఆయన ‘వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత ఏ.ఎం.రత్నం ప్రకటించారు. పవన్ సెట్లో అడుగు పెట్టారని, రెండు రోజుల షూట్ లో పాల్గొంటారని, దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ట్వీట్ చేశారు రత్నం. దాంతో ‘వీరమల్లు’కు పేకప్ చెప్పే సమయం ఆసన్నమైపోయింది.
త్వరలోనే ట్రైలర్, దాంతో పాటు మిగిలిన పాటలూ విడుదల చేస్తామని నిర్మాత ప్రకటించారు. జూన్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 80 శాతం చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. మిగిలిన 20 శాతం జ్యోతికృష్ణ పూర్తి చేశారు. కీరవాణి సంగీతం అందించిన సినిమా ఇది. రెండు పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. మరో 3 పాటలు త్వరలో ఒకొక్కటిగా విడుదల చేస్తారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.
‘వీరమల్లు’ని ఎలాగైతే పూర్తి చేశాడో అలానే `ఓజీ`కి కూడా డేట్లు ఇచ్చి ఆ సినిమా కూడా ఫినిష్ చేయాలని పవన్ భావిస్తున్నాడు. దాంతో పాటుగా `ఉస్తాద్ భగత్ సింగ్`కూ పవన్ కొన్ని డేట్లు కేటాయించే అవకాశం ఉంది.