సెప్టెంబరు 25న బాక్సాఫీసు దగ్గర భారీ వార్ జరగబోతోందని ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్సయ్యారు. ఈ డేట్ పై రెండు క్రేజీ సినిమాలు గురి పెట్టాయి. ఒకటి పవన్ కల్యాణ్ ఓజీ అయితే.. రెండోది నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’. ఈ రెండు సినిమాలూ సెప్టెంబరు 25నే వస్తామని ప్రకటించేశాయి. ఓజీ నిర్మాత దానయ్య అయితే డేట్ మారే ప్రసక్తే లేదని క్లియర్ గా చెప్పేశారు. అయితే ఇప్పుడు ఈ రేసు లోంచి ‘అఖండ 2’ తప్పుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎందుకంటే ‘అఖండ 2’ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. 11 రోజుల ఓ కీలకమైన షెడ్యూల్ బాకీ వుంది. అది పూర్తి చేయాలి. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా టైమ్ పట్టేట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషించనుంది. ఆ పనులు ఓ పట్టాన తెవలవు. హడావుడిగా సినిమాని పూర్తి చేయడం కంటే కాస్త నిదానంగా బెటర్ క్వాలిటీతో సినిమా ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారు బోయపాటి శ్రీను. అందుకే ఇంకొంత సమయం తీసుకొని సినిమాని విడుదల చేద్దామనుకొంటున్నారు. ఒకవేళ సెప్టెంబరు 25 మిస్ అయితే…. డిసెంబరు రావడం పక్కా. డిసెంబరులో మరో మంచి డేట్ ఎప్పుడు ఉందా? అంటూ చిత్రబృందం అన్వేషిస్తోంది. ఒకవేళ ‘అఖండ 2’ గనుక డ్రాప్ అయితే.. ఓజీకి లైన్ క్లియర్ అయినట్టే. ఓజీ షూటింగ్ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.