కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ కలిసిపోయిన కాలం నుంచీ మీడియాలోనూ, అభిమానుల్లోనూ ఓ ప్రశ్న ఎప్పుడూ చర్చనీయాంశం అవుతూనే ఉంది. నిజాయితీగా చెప్పాలంటే ప్రజల ఆలోచనల్లో ఆ ప్రశ్న సజీవంగా ఉండేలా చేయడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యాడు. చిరంజీవి-పవన్ కళ్యాణ్‌ల మధ్య విభేదాలు ఉన్నాయా? అన్నదే ఆ ప్రశ్న. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం పవన్‌కి ఇష్టం లేదు, పోరాటం చేయాలన్నదే పవన్ ఆలోచన అంటూ రకరకాల ఊహాగానాలను వ్యూహాత్మకంగా మీడియాకు వదిలారు. ప్రజారాజ్యం ఫెయిల్యూర్ని చిరంజీవి అకౌంట్లో పడేలా చేయడంలో పవన్ సక్సెస్ అయ్యాడు. జనాలకు ఫెయిల్యూర్ అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి చిరంజీవి జీరో అయిపోయాడు. పవన్ హీరో అయిపోయాడు. అక్కడి నుంచీ పవన్ క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతూ పోయింది. చిరుత, మగధీర సినిమాల టైంలో రామ్ చరణ్‌ని ఆకాశానికెత్తేస్తూ పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొన్న పవన్….. చిరంజీవి పార్టీ విలీనం తర్వాత నుంచి మాత్రం మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాను అన్న ఓ క్లియర్ మెస్సేజ్‌ని జనాల్లోకి పంపించడానికి అన్ని ప్రయత్నాలూ చేశాడు. నాయక్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో…. ‘మా నాన్న తర్వాత నేను కాదు…. కళ్యాణ్ బాబాయే’ అని చెప్తూ.. ‘మా బాబాయ్‌ని ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను’ అని పవన్‌పైన తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ చాలా ఆవేశంగా ప్రసంగించాడు చరణ్. కానీ పవన్ మాత్రం ఎవరో పరాయి వాళ్ళు గెస్ట్‌గా పిలిస్తే వచ్చినట్టుగా పైపైన మాట్లాడేశాడు. సినిమా పరిశ్రమ మొత్తాన్ని కుటుంబంగా భావిస్తానని చెప్పి తన ఇమేజ్‌ని పెంచుకునే ప్రయత్నం చేశాడు. మెగా ఫంక్షన్స్‌కి పవన్ అటెండ్ అవకుండా ఉండడం, ఒకవేళ వెళ్ళినా మెగా కుటుంబంతో నాకు విభేదాలున్నాయి, బలవంతంగా రావాల్సి వచ్చింది అన్న అర్థం వచ్చేలా తన మాటలు, చేతలు ఉండేలా జాగ్రత్తపడడంలాంటివి చాలా చేశాడు పవన్. చరణ్‌గారు, అర్జున్‌గారు అని పవన్ కళ్యాణ్ మాట్లాడడం కూడా అందులో భాగమే. తన సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌లో కూడా ‘నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను, ఆర్థిక కష్టాల్లో ఉన్నాను..’ అని చాలా సార్లు మాట్లాడేశాడు పవన్. ఓ వైపు పవన్ తీరు ఇలా ఉంటే మరోవైపు పవన్ అభిమానులు కూడా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇరిటేట్ చేశారు. నాగబాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు అయితే తమ కోపాన్ని, అసహనాన్ని బహిరంగ వేదికలపైనే వ్యక్తం చేయాల్సి వచ్చింది. మీడియాలో తనపై వచ్చే వార్తలన్నింటినీ ఫాలో అవుతూ ఉంటాడు పవన్. తనపై వచ్చే విమర్శలన్నింటికీ ఘాటుగా కౌంటర్స్ కూడా ఇస్తూ ఉంటాడు. కానీ పవన్ అభిమానులందరూ మెగా ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు చిరంజీవిని కూడా ఇబ్బంది పెడుతున్నారన్న విషయాన్ని మాత్రం అస్సలు పట్టించుకోలేదు పవన్.
పవన్ ప్లానింగ్ అంతా కూడా ఆయన ఇమేజ్‌కి చాలా చాలా ప్లస్ అయింది. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి తర్వాత స్థానాన్ని ఎంజాయ్ చేసిన పవన్…ఆ పార్టీ ఫెయిల్యూర్ పాపం మాత్రం తనకు అంటకుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. తన క్రేజ్‌ని విపరీతంగా పెంచేసుకున్నాడు. చిరంజీవి రాజకీయ వైఫల్యంలో భాగం పంచుకోవడానికి భయపడ్డ పవన్…మెగాస్టార్ సినీ ఫీల్డ్ సక్సెస్‌ని ఏ రేంజ్లో వాడేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడానికి కారణమే చిరంజీవి దంపతులు. ఆ విషయాన్ని పవనే స్వయంగా చెప్పుకున్నాడు. ప్రారంభంలో పవన్‌తో సినిమాలు తీసిన నిర్మాతలందరినీ సెట్ చేసింది చిరంజీవినే అన్న విషయం సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి తెలుసు. అలాగే చిరంజీవి ఫ్యాన్స్ అందరూ పవన్‌ని కూడా ఓన్ చేసుకునేలా చేయడంలో చిరంజీవి సక్సెస్ అయ్యాడు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ స్వార్థం మాత్రం చాలా మంది అభిమానులను చరణ్‌కి దూరం చేసింది. ఇప్పుడు కూడా చరణ్ సినిమాని పక్కన పెట్టేసి నితిన్‌తో సిినిమాని స్టార్ట్ చేశాడు పవన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ప్రధాన వర్గానికి చెందిన నేతకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు కాబట్టి అదే వర్గానికి చెందిన హీరోని ప్రోత్సహిస్తూ ఉంటే ఆ వర్గం ప్రజలలో మరీ ఎక్కువ వ్యతిరేకత రాదు అనుకుంటున్నాడు పవన్. రాజకీయాల మాట ఎలా ఉన్నా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి, మెగా ఫ్యాన్స్‌కి మాత్రం ఓ టెన్షన్ పట్టుకుంది. త్వరలో ధృవ ఆడియో సక్సెస్ మీట్ ఉంది. ఖైదీ నంబర్ 150 ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా త్వరలోనే ఉంటుంది అంటున్నారు. మరి ఈ రెండు ఫంక్షన్స్‌కి పవన్ అటెండ్ అవుతాడా? కనీసం మెగా 150 ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కి అయినా వస్తాడా? అని ఇప్పుడు మెగా వర్గాలు సమాలోచనలు చేస్తున్నాయి.
చిరంజీవి రాజకీయ వైఫల్యం ప్రభావం తనపైన పడకుండా చూసుకోవడంలో పవన్ వందశాతం సక్సెస్ అయ్యాడు. చిరంజీవికి ఈ స్థాయి రాజకీయ తెలివితేటలు లేవు. అందుకే వైఫల్య భారం మొత్తం తనపైనే వేసుకున్నాడు. పవన్ ఇమేజ్‌ని ఇంకాస్త పెంచడానికే ప్రయత్నం చేశాడు చిరంజీవి. ఇప్పుడు 150వ సినిమాని సూపర్ హిట్ చేయడం కోసం పునాదిరాళ్ళు టైం కంటే ఎక్కువ కష్టపడుతున్నాడు చిరంజీవి. తన పొలిటికల్ ఫెయిల్యూర్ని తెలుగు ప్రజలందరూ మర్చిపోయి మళ్ళీ తనను మెగాస్టార్‌గా ఆదరించాలని ఆశిస్తున్నాడు. మరి ఈ సమయంలో అయినా పవన్…చిరంజీవికి అండగా నిలబడతాడా? పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా చిరంజీవి సినిమాను ఓన్ చేసుకునేలా చేస్తాడా? చూడాలి మరి.