పరకామణి చోరీ చిన్న దొంగతనం కేసు అని వైసీపీ అధినేత జగన్ రెడ్డి వ్యాఖ్యానించడంపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. తిరుమలలో పెద్ద ఎత్తున అవినీతి చేశారని.. అవన్నీ బయటపడుతున్నాయని.. తన మతంలో జరిగి ఉంటే జగన్ ఇలా స్పందించేవారా అని ప్రశ్నించారు. తాజాగా పట్టు శాలువాల పేరుతో పాలిస్టర్ శాలువాలు సరఫరా చేసిన స్కాం బయటపడింది. తిరుమలలో ఎన్నో అక్రమాలు జరిగాయని వాటన్నింటిపై విచారణ జరపాలని కూటమి ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
మాట్లాడితే హిందూ మతం మెజార్టీ అంటున్నారని.. కానీ మెజార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. హిందూ మెజార్టీ మిథ్య అన్నారు. చట్టాలు ఏ మతానికైనా ఒక్కడే ఉండాలని స్పష్టం చేశారు. హిందూత్వాన్ని విమర్శించినప్పుడు హిందువులు అంతా స్పందించాల్సి ఉందన్నారు. కానీ ఇతర మతాలపై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఆ మతం అంతా స్పందిస్తారు కానీ హిందూ మతంపై విమర్శలు చేస్తే మాత్రం సెక్యలరిజం అంటున్నారన్నారు. అంతకు ముందు తమిళనాడులోని ఓ ఆలయం విషయంలో న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు జరుగుతున్న రాజకీయంపైనా ట్వీట్ పెట్టారు.
తమిళనాడు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ డీఎంకే సూడో సెక్యూలిజంను పాటిస్తోందని మండిపడ్డారు. హిందూసమాజ హక్కును కాపాడేలా ఓ న్యాయమూర్తి తీర్పు ఇస్తే.. 120 మంది ఎంపీలు అభిశంసన పిటిషన్ ఇచ్చారన్నారు. శబరిమల విషయంలో తీర్పు ఇచ్చినా న్యాయపరంగా ఎదుర్కొన్నారే కానీ ఇలా అభిశంసన తీర్మానాలు చేయలేదన్నారు. మొత్తంగా పవన్ తన డిమాండ్ అయిన సనాతన ధర్మ బోర్డును నియమించి అన్ని ఆలయాలను దాని పరిధిలోకి తేవాలని మరోసారి డిమాండ్ చేశారు.
