వైసీపీ లేని ఏపీని చూడబోతున్నామని ప్రజలకు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. తూ.గో జిల్లా మండపేటలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఏపీ భవిష్యత్‌కు వైఎస్ఆర్సీపీ హానికరంగా మారిందన్నారు. జనసేనను అధికారంలోకి తీసుకు రావాలని ప్రజల్ని కోరడం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం కావాలా.. మరో ప్రభుత్వం రావాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు జేబుల్లోంచి డబ్బులు తీసి ఇవ్వడం సరదా కాదన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విధంగానే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు రూ. ఏడు లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. వాళ్ల జేబుల్లోనుంచి డబ్బులు తీసి ఇవ్వమనడం లేదని ప్రజలు కట్టిన పన్నుల నుంచే ఇవ్వమని అడుగుతున్నామన్నారు. తనకు జగన్ లాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేకపోయినా కోట్ల రూపాయలురైతుల కుటుంబాలకు సాయం చేశామన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును దురుద్దేశపూర్వకంగా పెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ చేసిన హత్య కేసును తప్పు దారి పట్టించేందుకు ఆ వివాదం తెచ్చారన్నారు. తెలంగాణలో నా అనే భావన ఉంటే.. ఏపీ అంటే కులం అనే భావన ఉందని.. కులాన్ని గౌరవిస్తూనే కులాతీతభావన ఉండాలన్నారు.
2024 ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులను పంచాయతీ అభివృద్దికే కేటాయిస్తామని స్పష్టం చేశారు. తప్పు జరిగినప్పుడు ఎదిరించే శక్తి లేకపోతే మనుగడ ఉండదని .. తప్పులను ఎత్తి చూపే విషయంలో యువత వెనుకడుగు వేయవద్దని సూచించారు. కేసులకు భయపడవద్దని..జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. 99 తప్పుల వరకూ చూస్తామని.. వందో తప్పునకు తాట తీస్తామని హెచ్చరించారు. ఏపీ భవిష్యత్‌కు వైసీపీ హానికరమన్నారు. పోలీసులు నిష్ఫక్ష పాతంగా పని చేయాలన్నారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారు.. ఎంత మందిని జైల్లో పెడతారని ప్రశ్నించారు.